భగవద్గీత 3-23

“ యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||

 

పదచ్ఛేదం

యది – హి – అహం – న – వర్తేయం – జాతు – కర్మణి – అతంద్రితః – మమ – వర్త్మ – అనువర్తంతే – మనుష్యాః – పార్థ – సర్వశః

ప్రతిపదార్ధం

హి = ఎంచేతంటే ; పార్థ = అర్జునా ; యది = ఒకవేళ ; జాతు = ఎప్పుడైనా ; అహం = నేను ; అతంద్రితః = జాగరూకుడనై ; కర్మణి = కర్మలలో ; న, వర్తేయం = ప్రవర్తించకపోతే ; మనుష్యాః = మానవులు ; సర్వశః = అన్నిరకాల ; మమ = నా యొక్క ; వర్త్మ = మార్గాన్ని ; అనువర్తంతే = అనుసరిస్తారు

తాత్పర్యం

“ అర్జునా ! ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే, మానవులు అన్ని విధాలా నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు. ”

వివరణ

ఇంకా కృష్ణుడు అంటున్నాడు …

“ నేను అజాగరూకుడనైతే అందరూ ఆ అజాగ్రత్తలోనే పడిపోతారు ” కానీ,

“ నేను ఎప్పుడూ జాగ్రత్తతోనే ప్రవర్తించాను ” …

“ నేను ఎప్పుడూ సరిగ్గానే వ్యవహరించాను ” …

ఎంచేతంటే, “ ఇతరులు నన్ను ‘ గురువు ’ గా స్వీకరించారు ” కనుక.

“ ఇతరులకు ‘ గురువు ’గా వుండడానికి నేను ఇష్టపడ్డాను ” కనుక.

“ ‘ గురువు’ అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా వుండాలి ”.

“ తనకు నచ్చినట్లుగానే చేసే విధం వున్నప్పుడు ‘ గురువు బాధ్యత ’ స్వీకరించకూడదు ”.

ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతుంది.

అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు.

లోకం అజాగ్రత్తలో పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట.

కనుక, ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి.

అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడే వారు ఉత్తములవుతారు.

ధ్యానయోగులు, ఆత్మజ్ఞానపరాయణులు చేసే కర్మలు

అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి …

అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి.

మాటలూ, చేతలేకాదు … ఆలోచనలు కూడా

ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

ఆలోచనలను సక్రమంగా ఉంచుకోవాలి.

ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి … మాట్లాడాలి … కర్మలు చెయ్యాలి. నకారాత్మక ధోరణిని విడనాడాలి.

దేనిలో ఎవరికి నిష్ణాత ఉందో దానిని 

మాత్రమే వారు ఇతరులకు నేర్పించపూనాలి.

తమకు ఇంకా నిష్ణాత అలవడలేదని 

తెలుసుకున్నవారు …

నడిపించడానికి సిద్ధపడకూడదు.

ఇంకా నేర్చుకోవడానికే సిద్ధపడాలి …

నడపబడడానికే సిద్ధపడాలి …

ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి …

ఆ తర్వాతే నేర్పించ ఉపక్రమించాలి.