“అంతా మన మంచికే”

“అంతా మన మంచికే”
అని చిన్నప్పటి నుంచి మనం వింటూనే వున్నాం ..
అయితే, ఈ నానుడి యొక్క యదార్థ స్వరూపాన్ని తెలుసుకోగలగటమే ఆధ్యాత్మికత

“అంతా మన మంచికే” అని విన్నాం కానీ ..
“మరి నాకే ఎందుకు చెడు జరుగుతోంది?” అని అనుకున్నప్పుడు
మనం “ఆధ్యాత్మికత లేని ప్రాపంచికత” లో ఉన్నామన్న మాట
అయితే, ఎప్పుడైతే మన “కంటికి కనబడే ప్రాపంచికత” లో
“కంటికి కనబడని ఆధ్యాత్మికత” ప్రవేశిస్తుందో ..
అప్పుడు మనకు యదార్థం అన్నది యదార్థంగా అనుభూతిలోకి వస్తుంది
“ఔను! నిజమే! ‘ అంతా మన మంచికే’ ” అని!

ఆధ్యాత్మికతలో ప్రవేశించినప్పుడే “జరిగినదంతా మన మంచికే” అనీ
“ప్రస్తుతం జరుగుతూన్నది కూడా మన మంచికే” అనీ
మరి ” భవిష్యత్తులో జరగబోయేది కూడా మంచికే” అనీ
“సృష్టి అంతా మన మంచికే వుండి తీరుతుంది” అనీ అర్థమౌతుంది!

“అసతోమా సద్గమయ-
తమసోమా జ్యీతిర్గమయ-
మృత్యోర్మా అమృతం గమయ”
అంటే
“అసత్యం నుంచి సత్యంవైపు
అంధకారం నుంచి ప్రకాశం వైపు
మృతత్వం నుంచి అమృతత్వం వైపు మళ్ళించు” అని వున్నా ..
“ఎవరో వచ్చి సత్యం వైపు నన్ను తీసుకు వెళ్తారు” అన్నదే “ప్రాపంచికత”
“ఎవరికి వారే యమునా తీరే” అన్నది
అనుభవాత్మకంగా తెలుసుకోగలగాలి .. అదే “ఆధ్యాత్మికత”

ఎవ్వరూ మనల్ని చేయిపట్టుకుని నడిపించజాలరు
ఎవరికి వారే వారి వారి స్వంత బుద్ధిని ఉపయోగించి, స్వీయ వివేకాన్ని వాడుకుని
“ఆధ్యాత్మికత” లో ప్రవేశించగలగాలి, ప్రవేశించాలి
అందుకోసం
ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇతోధికంగా ధ్యానం చెయ్యాల్సిందే –
ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇతోధికంగా స్వాధ్యాయం చెయ్యాల్సిందే –
ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇతోధికంగా సజ్జనసాంగత్యం చెయ్యాల్సిందే!
అన్యధా శరణం నాస్తి!

మరొక్కసారి, మరొక్కసారి చెప్పుకుందాం
“అంతా మన మంచికే జరిగింది గతంలో ..
ప్రస్తుతంలో, వర్తమానంలో జరుగుతూన్నది అంతా మంచే ..
మరి జరుగబోయేది అంతానూ ఇంకా మహా మంచియే!”
ఓం తత్ సత్