వృత్తి దక్షత

 

వ్యాపారులు, వ్యవసాయకులు, పారిశ్రామికులు, శ్రామికులు, గృహస్థులు, పాలకులు, బోధకులు – వీరందరితో కూడి ఉన్నదే సమాజం. మానవ శరీరంలో కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు . . . ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి. ప్రతి అంగానికీ సరిసమానమైన విశిష్టత, సరిసమానమైన బాధ్యత, సరిసమానమైన దైవత్వం ఉంది. శరీరంలో ఏదో ఒక భాగం లేదా, ఏదో ఒక అంగం ; ప్రధానమైనది, మిగిలినవి అప్రధానమైన అంగాలు కావు.

వ్యాపార దక్షత ఉన్నవారు వ్యాపారం చేయాలి. వ్యవసాయ దక్షత ఉన్నవారు వ్యవసాయం చేయాలి. పై దక్షత లేనివాళ్ళు శారీరక శ్రమలో అయినా దక్షతను చూపించాలి.

వ్యాపారులు మొట్టమొదటగా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ” సమాజానికి వారి వ్యాపారం అతిముఖ్యమైనది ” అని. వ్యాపార వృత్తిలో ఉన్నవారు మొదట వ్యాపార దక్షత కలిగించుకోవాలి. న్యాయంగా వ్యాపారం చెయ్యాలి. కుటుంబ శ్రేయస్సుకు తగినంత లాభాలనే దృష్టిలో పెట్టుకోవాలి. అంతకు మించి వచ్చిన లాభాలను సంఘశ్రేయస్సుకు వినియోగించాలి.

వ్యాపార దక్షత అనేది ఒక శాస్త్రం ; దీన్నే ఇంగ్లీషులో Business Management అంటాం. దీనికి ప్రత్యేకంగా ప్రపంచమంతటా కళాశాలలు ఉన్నాయి. కనుక, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార దక్షతను సంపాదించుకోవాలంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, Business Management లాంటి కోర్సుల ద్వారా వ్యాపార దక్షతను సంపాదించుకోవాలి. అందులోని సూత్రాలను అవగాహన చేసుకోవాలి. తోటి వ్యాపారులతో వ్యాపార విషయాలను పరస్పరం చర్చిస్తూ, పరస్పరం నేర్చుకుంటూ ఉండాలి. ఆ పరిస్థితుల్లో చేపట్టిన వృత్తికి తగిన సజ్జన సాంగత్యంఆ పరిస్థితుల్లో తగిన స్వాధ్యాయం చేయాలి. ఆ పరిస్థితుల్లో సొంత వ్యాపారం మీద పూర్తి ధ్యాస ఉంచాలి.

  • పాలకులు పాలనా దక్షత ను కలిగి ఉండాలి.
  • వ్యవసాయదారులు వ్యవసాయ దక్షత ను కలిగి ఉండాలి.
  • వ్యాపారస్థులు వ్యాపార దక్షత ను కలిగి ఉండాలి.
  • గృహస్థులు గృహ నిర్వహణా దక్షత ను కలిగి ఉండాలి.
  • శ్రామికులు శ్రామిక దక్షత ను కలిగి ఉండాలి.

అయితే మరి అందరూ ఆత్మజ్ఞాన పరాయణులు కావాలి. అది కంపల్సరీ. అంటే తప్పనిసరి. ఒక త్రాటి మీద వృత్తి దక్షత మరొకత్రాటి మీద అత్మజ్ఞాన దక్షత కలిగి ఉండాలి.