“వైరాగ్యం+అభ్యాసం”

 

పాతంజల యోగదర్శనంలో 1 వ సూత్రం:

“అథః యోగానుశాసనమ్”

అథః = ఇప్పుడు యోగః = యోగం యొక్క అనుశాసనం = శాస్త్రం

“ఇక ఇప్పుడు యోగశాస్త్రం ఆరంభించబడుతోంది.”

పాతంజల యోగదర్శనంలో 2వ సూత్రం:

“యోగశ్చిత్తవృత్తి నిరోధః”

యోగః = ‘యోగం’ (అనగా) .. చిత్తవృత్తి నిరోధః = చిత్తవృత్తులను నిరోధించడమే

“చిత్తవృత్తులను నిరోధించడమే ‘యోగం’”

పాతంజల యోగదర్శనంలో 3వ సూత్రం:

“తథా ద్రష్టుః స్వరూపేవస్థానమ్”

తదా = చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు ద్రష్టుః = చూసేవాడు స్వరూపే = స్వరూపంలో అవస్థానమ్ = స్థిరంగా ఉండటం జరుగుతుంది.

“అప్పుడు ఆ చిత్తవృత్తుల నిరోధం జరిగినప్పుడు దృష్టలుగా మారి .. స్వ-స్వరూపంలో స్థితం అవుతాము.”

పాతంజల యోగ దర్శనంలో 4వ సూత్రం:

“వృత్తిస్వారూప్య మితరత్ర”

ఇతరత్ర = కాని పక్షంలో .. (అంటే చిత్తవృత్తి నిరోధం జరుగని పక్షంలో) వృత్తి స్వారూప్యం = వృత్తిలో సారూప్యం

“చిత్తవృత్తి నిరోధం జరుగునప్పుడు ఆ వివిధ చిత్తవృత్తులకు సమానమైన రూపాలు కలిగి ఉంటాం.”

పాతంజల యోగదర్శనంలో 12 వ సూత్రం: “అభ్యాస వైరాగ్యభ్యాం తన్నిరోధః”

” ‘చిత్తవృత్తుల యొక్క నిరోధం’ అన్నది అభ్యాస వైరాగ్యాల ద్వారానే సాధ్యపడుతుంది.”

ఇక్కడ రెండు విషయాలు ఉటంకించబడ్డాయి:

1. “వైరాగ్యం” .. 2.”అభ్యాసం”

ఈ రెండు విషయాల గురించి భగవద్గీత “ఆత్మ సంయమ యోగం” లో చాలా చక్కగా చెప్పబడింది:

“చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్”

– భగవద్గీత: 6వ అధ్యాయం, 34 వ శ్లో||

“ఓ కృష్ణా! ఈ మనస్సు ఎంతో చంచలమైంది మరి ఎంతో ప్రమాదమైన స్వభావాన్ని కలిగి ఉన్నది! ఈ మనస్సు ఎంతో దృఢమైనది మరి ఎంతైనా బలీయమైనది. దానిని నిగ్రహించడం అంటే .. గాలిని ఆపడం కంటే కూడా సుదుష్కరమైనదని నేను భావిస్తున్నాను” అని అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మతో .. మొర పెట్టుకున్నాడు. దానికి బదులుగా “శ్రీకృష్ణపరమాత్మ” ఈ విధంగా జవాబు ఇస్తారు:

“అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే”

– భగవద్గీత: 6వ అధ్యాయం, 35వ శ్లో||

“హే మహాబాహువైన కుంతీపుత్రుడా! నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే! దానిని వశపరచుకోవడం ఎంతో కష్టం! కానీ అభ్యాస వైరాగ్యలతో దానిని వశపరచుకొవడం సాధ్యమే” అని తేల్చి చెప్పారు.

“పిరమిడ్ వ్యాఖ్యానం”

ఇప్పుడు ఈ రెండు విషయాలను గురించి మరి  ” పిరమిడ్ వ్యాఖ్యానం” ఏమిటో తెలుసుకుందాం

“వైరాగ్యం”

“వైరగ్యం” అంటే .. కుటుంబాన్ని వదిలేసి హిమాలయాలకు పరుగెత్తడం కాదు. తన ప్రాపంచిక మౌలిక బాధ్యతలను విస్మరించడం కాదు ఏకాంతవాసం చెయ్యడం కాదు .. కాషాయవస్త్రాలు ధరించడం కాదు దండకమండలాలను పట్టుకుని తిరగడం కాదు శిరోముండనం చేయించుకోవడం కాదు మరి “వైరాగ్యం” అంటే ఏమిటి?! ఏమీ లేదు కాస్సేపు “జాగ్రతావస్థలో కళ్ళు మూసుకుని కూర్చోవడం” కళ్ళు తెరిస్తే మనం బాహ్య ప్రపంచానికి ఆహ్వానం పలుకుతాం .. అందులో లీనమైపోతాం “కళ్ళు మూసుకుంటే” మనం బాహ్య ప్రపంచం నుంచి వైదొలుగుతాం మరి దృశ్యమాన ప్రపంచం మనమీద ప్రభావం చూపించదు ప్రక్కనే మొగుడు/భార్య ఉన్నా .. ఒక గంటసేపు కళ్ళు మూసుకుని కూర్చోవడమే .. “వైరాగ్యం” అంటే! కళ్ళద్వారా 80% మన ప్రాణశక్తి బయటికి పోతుంది

ఆ ప్రాణశక్తి పోకడకు అడ్డుకట్ట వేయడమే “కళ్ళు మూసేసుకోవడం” తద్వారా బయటికి పోయే ప్రాణశక్తి బయటికి పోలేక అంతర్గతం అవుతుంది మరి అంతర్గతమైన ప్రాణశక్తి యోగాభ్యాసానికి తోడ్పడుతుంది “వైరాగ్యం” ద్వారానే యోగాభ్యాసం సాధ్యం “కళ్ళు మూసుకోకుండా” ధ్యాన అభ్యాసం/ యోగ అభ్యాసం అన్నది ప్రారంభం కాజాలదు!

“అభ్యాసం”

వైరాగ్యానికి తదుపరి వున్నదే “అభ్యాసం” ఏమిటి అభ్యసించాలి? మంత్రమా .. తంత్రమా .. యంత్రమా .. ఏదీ కాదు! అభ్యసించవలసిన ఏకైక విషయం .. “సుఖమయ ప్రాణాయామం” అంటే .. కుంభకరహిత, పూరకరహిత, రేచకరహిత “సుఖమయ, సహజ ప్రాణాయామం” అంటే గౌతమబుద్ధుడు ప్రవచించిన  “ఆనాపానసతి” ధ్యానాభ్యాసం అంటే అచ్చ తెలుగులో మనం చెప్పుకుంటూన్న “శ్వాస మీద ధ్యాస” ధ్యాన విధానం శ్వాసను నిర్బంధించకూడదు

ఉన్నది ఉన్నట్లుగా .. ఆ శ్వాసయొక్క రాకడ పోకడలకు సాక్షీభూతంగా ఉండడం అభ్యసించాలి ఇదే పతంజలి వారు కానీ .. శ్రీకృష్ణులవారు కానీ .. చెప్పిన “అభ్యాసం” అంటే!

“వైరాగ్యం” అంటే .. “కళ్ళు మూసేసుకోవడం” అరగంటో .. గంటో .. లేదా ఎవరి వయస్సు ఎంతో అంతసేపు కళ్ళు మూసేసుకుని కూర్చుని బాహ్య ప్రపంచాన్ని తాత్కాలికంగా తిరస్కరించడం! “అభ్యాసం” అంటే “శ్వాస మీద ధ్యాస” .. అంతే! సహజమైన “శ్వాసధార” మీద ఏకీకృతమైన “ధ్యాసధార”! “వైరాగ్యం నమో నమోమి” .. “అభ్యాసం నమో నమామి” “లోకా స్సమస్తా సుఖినోభవంతుః” “తస్మాత్ యోగీ భవ” ఇతిః పిరమిడ్ వ్యాఖ్యానం సమాప్తం