వాక్ క్షేత్రం

 

మానవ జీవితం .. ‘త్రినేత్రమయం’ అంటే.. ‘మూడు క్షేత్రాల మయం!

అవి.. 1. “భావనా క్షేత్రం” అంటే ఆలోచనల క్షేత్రం 2. “చేష్టా క్షేత్రం” అంటే.. కర్మల క్షేత్రం మరి 3. “వాక్ క్షేత్రం” మాటల క్షేత్రం!

“భావనలు” అంటే ఇంగ్లీషులో “thouhts”! “చేష్టలు” అంటే “deeds” మరి “వాక్కులు” అంటే “Words”

మన జీవితం అంతా కూడా విస్తారమైన భావనాక్షేత్రం, విస్తారమైన చేష్టాక్షేత్రం మరి విస్తారమైన వాక్షేత్ర్రాలతో నిండి ఉన్నట్లే.. మన చుట్టుప్రక్కల వాళ్ళందరి జీవితాలు కూడా వారికి సంబంధించిన వారి మూడు క్షేత్రాలతో విస్తారంగానిండివున్నాయి.

“Know Thy Self” అన్నాడు.. జీసస్ క్రైస్ట్ “నిన్ను నువ్వు తెలుసుకో” అన్నాడు గౌతమబుద్ధుడు “నన్ను నేను తెలుసుకోవడం” అంటే ఏమిటి? “నేను” అంటే ఎవరు? నా భావానా క్షేత్రం గురించీ, నా చేష్టాక్షేత్రం గురించీ మరి నా వాక్‌క్షేత్రం గురించీ.. నేను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇలా నన్ను నేను తెలుసుకుంటే.. ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే! మరి నన్ను నేను జయిస్తే ఈ సమస్త ప్రపంచాన్నీ జయించినట్లే! నాతో నేను హాయిగా జీవించగలిగితే.. ఈ ప్రపంచంలో నేను ఎవ్వరితోనైనా హాయిగ జీవించగలను కాబట్టి మనమంతా కూడా మనసా, వాచా, కర్మణా జితేంద్రియులం కావాలి; దానికి మన త్రిక్షేత్రాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

భావనా క్షేత్రం : దీనినే మనం “ఆలోచనల క్షేత్రం” అని కూడా అంటాం!

ఇది అత్యంత సృజనాత్మక క్షేత్రం.. మరి ఇక్కడ మనం అంతా కూడా సర్వస్వతంత్రులం! ఇక్కడ ‘క్రమ’ అక్రమా’లు లేవు; న్యాయాన్యాయాలు లేవు; తప్పోప్పులు లేవు; మరి ధర్మధర్మాలు లేవు. ఈ క్షేత్రంలో ఎవ్వరూ మనల్ని తప్పు పట్టజాలరు మరి “ఇలా ఎందుకు ఉన్నావు?” అని నిలదీయలేరు. ఇక్కడ మనల్ని ఎవ్వరూ ప్రాసిక్యూట్ చేయలేరు..లేదా మనపట్ల తీర్పు చెప్పలేరు!

ఒక పక్షి హాయిగా అనంతగగనంలో ఎలా విహరించగలదో.. అలాగే ఇక్కడ మనం హాయిగా విహరించవచ్చు! సర్వస్వతంత్రమైన ఈ క్షేత్రంలో ఎవ్వరి ఇష్టం వారిది; కనుక మనల్ని బట్టి మనం ఉన్నట్లే ఎదుటివాళ్ళు కూడా వాళ్ళను బట్టి వాళ్ళు వుంటారు! ఇది సత్యం!

“నా భార్య ఎందుకు ‘ఇలా’ ఆలోచిస్తోంది? నా కొడుకు ఎందుకు ‘అలా’ ఆలోచిస్తున్నాడు? లేదా నా శత్రువు ఎమ్దుకు ‘మరోలా’ ఆలోచిస్తున్నాడు?” అనుకోవడం శుద్ధ మూర్ఖత్వం!

మన ఆలోచనా ప్రపంచం మనలోంచి మనకోసం పుట్టినట్లే.. వాళ్ళ ఆలోచనా ప్రపంచం వాళ్ళలోంచి వాళ్ళకోసం పుడుతుంది. ఒకరి ఆలోచనలతో ఇంకొకరి ఆలోచలనకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇతరుల ఆలోచనల్లో తప్పొప్పులు ఉన్నాయని ‘అల్పజ్ఞులు’ అంటే .. “తప్పొప్పలకు తావు లేనిదే ఆలోచనల క్షేత్రం” అని ‘సర్వజ్ఞులు’ అంటారు.

అందుకే “Judge Ye Not” అన్నారు జీసస్ క్రైస్ట్. ఈ మూడు ఆంగ్లపదాల్లోనే సమస్త ఆత్మజ్ఞానం నిండివుందిమరి అవి “సహస్రార స్థితి”లో అలరారే.. ఉన్నతాత్మ నోటినుంచి జాలువారిన ఆణిముత్యాలు.

వాటిని అర్థం చేసుకోవాలంటే మనం కూడా జీసస్ క్రైస్ట్ ఉన్న సహస్రార స్థితికి చేరుకోవాలి! ప్రపంచ చదరంగ ఛాంపియన్ అయిన “గ్యారీ కాస్పరోవ్” ఆట తీరును ఇంకొక ప్రపంచ ఛాంఫియన్ అయిన “విశ్వనాథన్ ఆనంద్” మాత్రమే అర్థం చేసుకోగలడు! కొద్దిగా చదరంగం నేర్చుకుని కాలక్షేపానికి ఆడేవాళ్ళకు కాస్పరోవ్ ఆట తీరు ఎంతమాత్రం అర్థం కాజాలదు!

కనుక మనలాగే ఎవరి భావనాక్షేత్రం వారి ఇష్టం కాబట్టి సామాన్య మూర్ఖపు జనాల్లా వారి ఆలోచనల పట్ల తీర్పులు చెప్పకుండా..జీసస్ క్రైస్ట్‌లా విరాజిల్లాలి!

చేష్టా క్షేత్రం : క్రియారూపకంగా మన జీవితంలో మనం ఏం చేసినా దానిని “చేష్ట” అంటాం! ఉద్యోగం చెయ్యడం, పిల్లల్ని కనడం, చదువుకోవడం, డబ్బు సంపాదించడం, పూజలూ, దానాలూ చేయడం.. ఇలా జీవితంలో రకరకాల చేష్టలను మనం చేస్తూ ఉంటాం.

భావనా క్షేత్రం.. “ఆస్ట్రల్ ప్రపంచానికి” చెందినది అయితే చేష్టాక్షేత్రం.. “భౌతిక ప్రపంచానికి” సంబంధించింది.

భావనా క్షేత్రం అన్నది కారణక్షేత్రం అయితే చేష్టా క్షేత్రం అన్నది కార్యక్షేత్రం!

ప్రపంచంలో రకరకాల మనుష్యులు వుంటారు! జంతు జన్మలనుంచి నేరుగా మొట్టమొదటిసారి మావన శరీరంలో ప్రవేశించినవారు వున్నారు. మానవ శరీరంలో ప్రవేశించి పది జన్మల తీసుకున్నవాళ్ళు వున్నారు. ఐదు వందల జన్మల తీసుకున్న వాళ్ళు వున్నారు. వీళ్ళందరి స్వభావాలు ఒకే రకంగా వుండవు కదా!

మొట్టమొదట “తమోగుణ ప్రధాని” గా వచ్చి..కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా.. ఆ గుణం మారిపోతూ, మారిపోతూ.. “రజోగుణ ప్రధాని” గా తయారువుతాడు.

ఆ తర్వాత మెల్లిగా మెల్లిగా.. మారుతూ మారుతూ.. “సత్వగుణ ప్రధాని”గా ఆ తర్వాత ఇంకా మెల్లిగా మెల్లిగా.. మారుతూ “నిర్గుణుడు” గా అయిపోతాడు.

రకరకాల గుణ సంచయాలతో కూడి వున్న ఈ రకరకాల మానవుల చేష్టాక్షేత్రాలు ఒకే రకంగా ఉండవు.

ఒకానొక తమోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు ఆ గుణానికి మాత్రమే సంబంధించినవిగా ఉంటూ పూర్తిగా ఆ గుణానికే అంకితమై.. ఆ గుణానికి ప్రతిరూపాల్లా వుంటాయి. అలాగే ఒక రజోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపలు రజోగుణ ప్రధానమైనవిగానే వుంటాయి! తమోగుణ ప్రధానమైన వాడి కార్యకలాపాలు రజోగుణ ప్రధానమైనవాడి కార్యకలాపాలతో ఒకే విధంగా వుండజాలవు. అది అసంభవం!

ఏ వంట తింటే చేతికి ఆ వాసనే వచ్చినట్లు.. మనం అంతరంగంలో ఏ గుణాన్ని కలిగివుంటాయో మన బహిర్ కార్యకలాపాలు కూడా ఆ గుణానికి సంబంధించినవిగానే వుంటాయి తప్ప వేరే గుణానికి సంబంధించినవిగా వుండవు!

అలాగే, ఒకానొక రజోగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒకేలావుండజాలవు. ఒకానొక సత్వగుణ ప్రధాని చక్కటి సంగీతం వింటాడు. భజనలు చేస్తాడు..లేకపోతే చక్కగా ఆటపాటలలో వుంటాడుకానీ.. రజోగుణ ప్రధాని ఎల్లప్పుడూ మూర్ఖరాజకీయాల్లో వుంటాడు! అసలు వాడికి ప్రశాంతంగా వుండడం, వుంచడం అన్నది గిట్టనే గిట్టదు.

అలాగే ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒకానొక నిర్గుణి యొక్క కార్యకలాపాలు ఒక్కలాగే వుండవు.

నిర్గుణ ప్రధానమైనవాడు ఎప్పుడు తాను ధ్యానం చేస్తూ.. అందరితో ధ్యానం చేయిస్తూ వుంటాడు మరి..ధ్యానం గురించే మాట్లాడుతూ వుంటాడు. సత్వగుణ ప్రధాన కార్యకలాపాలు అయిన సంగీతం, భజనలు మరి ఆటపాటల్లో, నిర్గుణ ప్రధానులు అధికంగా వుండరు!

ఒకానొక “శిశువు లాంటి ఆత్మ” జీవితంలో అలాగే జీవిస్తాడు. కొన్ని జన్మలే ఎత్తాడు.. “యాభై జన్మలు ఎత్తలేదు”..కనుకు అంతేజ్ఞానం వుంటుంది. ఐదు జన్మలకు ఏ ఏ స్వభావాలు వుంటాయో అయిదు జన్మలు తీసుకున్నవారికి అవే వుంటాయి. యాభై జన్మలకు ఏ ఏ గుణ గణాలు వుంటాయో యాభై జన్మలు తీసుకున్న వారికి కూడా ఆ యా గుణగణాలే వుంటాయి.

అలాగే ఓ వెయ్యి జన్మలు తీసుకున్నవాడు తన స్థాయికి తగ్గ పనులు ఎవైతే ఉంటాయో ఆ పనులే చేస్తాడు. కనుక ఎవరి కార్యకలాపాలను కూడా మనం గర్వించ, నిందించ అర్హత లేనివాళ్ళం!

కనుక “తప్పు ఎక్కడ ఉంది?” అంటే “అసలు ‘తప్పు’ అనేది లేనే లేదు”!.. మరి తప్పు పట్టడమే అన్నింటికన్నా పెద్ద తప్పు!

మనం కొన్ని జన్మల్లో తమోగుణిగా పుట్టాల్సిందే. మరో కొన్ని జన్మలు రజోగుణపరంగా వుండాల్సిందే.. మరి కొన్నిజన్మలు సత్వగుణంగా వుండవలసిందే! చివరగా నిర్గుణంగా అయి తీరుతాం. కనుక ఎవ్వరినీ ఎవ్వరూ తప్పు పట్టవలసిన పనిలేదు!

“Judge Ye Not”

ఒకసారి ఒకానొక వేశ్యను రాళ్ళతో కొట్టబోతూంటే “మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు మత్రమే రాళ్ళతో కొట్టండి” అన్నాడు జీసస్‌క్రైస్ట్. అందరూ రాళ్ళు క్రింద పడేశారు. ఎవరి స్థాయిలలో వాళ్ళు తప్పులు చేస్తూ వుంటారు లేదా ఒప్పులు చేస్తూనే వుంటారు కనుక మనం ఎవ్వరినీ తప్పులు పట్టవద్దు మరి వారిపట్ల తీర్పులు చెప్పవద్దు. అసలు ఆ అర్హత ఎవ్వరికీ లేదు! ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో అయినాఅది అంతే!

భగవద్గీత‌లో శ్రీ కృష్ణుడు కూడా అర్జునుడిని “తమో,రజో, స్వాతిక గుణాలు ప్రకృతి సహజం కనుక నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయవయ్యా” అన్నాడు.

“నా ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయవయ్యా” అని చెప్పలేదు “నీ స్వధర్మం ఎలా అనిపిస్తుందో, నీ స్వగుణం నిన్ను ఎలా ప్రేరేపిస్తుందో అలానే చెయ్యి..అలాగే విలసిల్లు .. నాకు అనుగుణంగా నువ్వు విలసిల్లడం కాదు” అన్నాడు.

ఇలా అత్యంత సృజనాత్మకమైన భావనా క్షేత్రం‌లో సర్వస్వతంత్రులం అయిన మనం ఏమీచేయనవసరం లేదు మరి జన్మజన్మల గుణసంచయాలతో కూడిన చేష్టా క్షేత్రంలో ఏమీ చేయలేము. ఈ రెండింటికి మధ్యలోవున్న వాక్‌క్షేత్రం అన్నదే సకల కర్మలకూ మూలం కనుక మనం సరిచేసుకోవలసిందీ, సరిచూసుకోవలసిందీ వాక్ క్షేత్రాన్నే!!

“వాక్ క్షేత్రం”

“What goes into mouth, that does not defileth a person. What comes out of themouth, that defileth a person” అన్నారు..జీసస్ క్రైస్ట్.

“నోట్లోకి ఏం పోతుందో అది మానవుణ్ణి నాశనం చేయదు.. నోట్లో నుంచి ఏది బయటికి పోతుందో అదే మానవుణ్ణి నాశనం చేస్తుంది” అని దాని అర్థం!

నోటిలోంచి బయటికి వచ్చేవి “మాటలు” ..అంటే మన “వాక్ క్షేత్రం”! దానిని మనం తప్పక సరిచేసుకోవాలి!

మస్తిష్కంలో నుంచి “తలుపులు” వస్తాయి. నోట్లో నుంచి “వాక్కులు” వస్తాయి. కాయంలో నుంచి “కర్మలు” వస్తాయి. కనుక మస్తిష్కానికీ కాయానికీ మరి కారణానికీ కార్యానికీ మధ్య అనుసంధానమై వున్న వాక్ ప్రపంచం అన్నది అత్యంత కీలకమైంది!

భగవద్గీతలో.. అర్జునుడు “వాడు నా తండ్రి”.. “వీడు నా గురువు”.. “వాడు నా సోదరుడు” మరి “వాళ్ళను ఎలా చంపాలి?” అంటూ తనవిషాదమంతా వెళ్ళకక్కున్నాడు. ఆ విషాదమంతా అతని అజ్ఞానపు వాక్ క్షేత్రం లోంచి వచ్చింది.

అర్జునుడు విషాదం వెళ్ళగక్కితే.. “కృష్ణుడు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు; నీ మాటలు నువ్వు సరిచేసుకో; నీ మాటలు సత్యదూరం; సత్య వాక్కులేమిటో నేను చెప్తాను” అంటూ అద్భుతమైన “గీతామృతం” ఇచ్చాడు.

అర్జునుడి విషాద యోగం అర్జునుడి వాక్ క్షేత్రంలో నుంచి వస్తే.. శ్రీ క్రుష్ణుడి భగవద్గీత.. శ్రీ కృష్ణుడి వాక్ క్షేత్రంలో నుంచి వచ్చింది.

“అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే!

గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పండితాః||”

“నువ్వు ఏడవకూడని దానికోసం ఏడుస్తూ గొప్ప గొప్ప మాటలు నాకే చెప్తావా? నీకు ఏ అర్హత ఉందయ్యా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడడానికి?!నువ్వునీ స్థాయికి తగ్గ మాటలే మాట్లాడు; నీ స్థాయికి తగని మాటలు మాట్లాడవద్దు.

“నీకు పుట్టుకంటే తెలియదు..జన్మ అంటే తెలియదు చావంటే తెలియదు.. ‘మంచి’ అంటే తెలియదు.. ‘చెడు’ అంటే తెలియదు! అయినా మాట్లాడుతున్నావు.

“తెలియనప్పుడు మౌనంగా ఉండు.. తెలిసినప్పుడే మాట్లాడు. కనుక, నువ్వు మాట్లాడింది తప్పు”.. అని చక్కగా ఆయన ఖండించాడు, వివరించాడు, విశ్లేంచాడు, సరిచేశాడు. “వాక్ క్షేత్రం” శాస్త్రీయంగా.. సత్య సమ్మతంగా.. సత్యానికి దగ్గరగా వుండాలి. సత్యంలో లీనమై, సత్యంతో ఏకమై వున్న మాటలనే “సత్య వాక్కులు” అంటాం.

మన మాటల్ని సవరించుకోవడాన్ని “జ్ఞానయోగం” అంటాం!

ఎలాగైతే సంగీతం బాగా వచ్చిన వారి దగ్గర మనం సంగీతం నేర్చుకుంటామో, మాటలు బాగా మాట్లాడే వారి దగ్గరచేరి మాటలు బాగా మాట్లాడటం నేర్చుకోవాలి!

సత్య వాక్కులు వున్నవారి దగ్గర చేరి మనం సత్యవాక్కులు నేర్చుకోవాలి. అలాంటి మాటలను బుద్ధుడి దగ్గరి నుంచి అరువు తెచ్చుకోవాలి.. కృష్ణుడి దగ్గరి నుంచి అరువు తెచ్చుకోవాలి.. లేదా జీసస్ నుంచి అరువు తెచ్చుకోవాలి.

మిమ్మల్ని నేను “ఓ వెయ్యి రూపాయలు ఇవ్వండి” అన్నాను అనుకోండి!

“నా దగ్గర అయిదు రూపాయలు మాత్రమే ఉన్నాయి; అంతకన్నా ఎక్కువ లేదు, క్షమించండి అంటారా? లేక “మీకు వెయ్యి రూపాయలు అప్పు తెచ్చి మరీ ఇస్తాను’ అంటారా?”

మన దగ్గర డబ్బు లేకపోతే ప్రక్కవాళ్ళ దగ్గర నుంచి అరువు ఇప్పించినట్లే.. మన దగ్గర ‘బుద్ధి’ లేదు కనుక.. ప్రక్కవాళ్ళ ‘బుద్ధి’ని కాస్త అరువు తెచ్చుకోవాలి!పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది అనుభవమే.

ఎవరైన తప్పు మాట్లాడితే నేను వెంటనే తప్పు పడతాను! ఎవరైనా “గుడ్ మార్నింగ్ ” అంటే “ఏమయ్యా ‘బ్యాడ్ మార్నింగ్’ ఎక్కడైనా ఉందా?” అంటాను.

ప్రతి ఒక్కరూ వచ్చి “బాగున్నారా? అని అడుగుతారా! మీకు బుద్ధి లేదా? లేక మీ బుద్ధి గడ్డి తినిందా?” అని వెంటనే అరుస్తాను!

ఇది అందరికీ తెలుసు! చేష్టల తీరును నేనెప్పుడూ పట్టించుకోను! నేనెప్పుడూ పట్టించుకునేది.. మాటల అశాస్త్రీయాన్నే!

“పైన తిరుమలలో దేవుడున్నాడు” అంటే.. “నువ్వు చూశావా? అక్కడ ‘విగ్రహం’ ఉంది. ‘విగ్రహం చూడ్డానికి వెళ్ళాను’ అని చెప్పు ఒప్పుకుంటాను కానీ ‘దేవుణ్ణి’ చూడడానికి వెళ్ళానంటే తప్పు కనుక అవి సత్యవాక్కులు కావు” అంటాను!

“ఏడు రకాల వాక్ క్షేత్రాలు”

వాక్ క్షేత్రపరంగా మానవాళి అంతా.. ఏడు రకాలుగా విభజించబడింది.

మూలధార తత్వంలో ఉన్నవారు.. స్వాధీష్టాన తత్వంలో ఉన్నవారు..మణిపూరక తత్వంలో ఉన్నవారు.. అనాహతతత్వంలో ఉన్నవారు.. విశుద్ధ తత్వంలో ఉన్నవారు.. ఆజ్ఞాతత్వంలో ఉన్నవారు.. మరి సహస్రార తత్వంలో ఉన్నవారు.

మూలాధార తత్వం: ఇది శుద్ధ భౌతిక తత్వం! “నాకు పెళ్ళికావాలి; కూతురు పుట్టాలి; నేను బాగా సంపాదించాలి; బిల్డింగ్‌లు కట్టాలి” అంటూ ప్రార్థనలు చేస్తూ మూలాధార తత్వంలో ఉన్నవారికి కేవలం భౌతికమే కనపడుతుంది తప్ప ఇంకేమీ కనపడదు.

స్వాధీష్టాన తత్వం: “నేను MLA గా ఉండాలి; MP వుండాలి; మరి నాకే అందరూ ఓట్లు వేయాలి” అంటూ అల్పమైన కీర్తిప్రతిష్టల కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు.

మణిపూర్వక తత్వం : “నాకు సంగీతం రావాలి, నాకు సంస్కృతం భాష రావాలి; నేను డాక్టర్‌ను కావాలి, అమెరికాలో రిసెర్చ్ చెయ్యాలి” అంటూ భగవంతుడిని ప్రార్థిస్తూంటారు.

మూలధార, స్వాధిష్టాన, మణిపూరక తత్వాలను ఆత్మపరంగా “క్రిందిస్థాయిలో ఉన్న తత్వాలు” అంటారు; ఇవి పూర్తిగా ప్రాపంచికమై లౌకిక వాసనలతో కూడుకుని వున్నవి.

అనాహత తత్వం : ఇది అటు లౌకికమూ కాదు.. అలాగని పూర్తి ఆధ్యాత్మిక తత్వమూ కాదు. లౌకిక వ్యవహారాలతో పూర్తిగా విసిగిపోయి ఉన్నవారు.. “నాకు ఈ ప్రపంచంలో ఏదీ అక్కరలేదు; కేవలం మనశ్శాంతి మాత్రమే కావాలి” అనుకుంటు.. “ఓ భగవంతుడా! నాకు మనశ్శాంతినీ, కంటినిండా నిద్రనూ ఇవ్వవయ్యా!” అంటూ ప్రార్థనచేస్తూవుంటారు.

విశుద్ధ తత్వం : తమకు తాముగా శాంతిని పొందినవారు విశుద్ధ తత్వంలో ఉన్నవాళ్ళు; వీళ్ళు తమ కోసం భగవంతుణ్ణి ఏమీ కోరుకోరు. “నేను పొందవలసిన మనశ్శాంతినంతా పొందాను కనుక.. ఇక అందరికీ శాంతిని కలిగించే సన్మతిని ఇవ్వు భగవాన్”.. అంటూ ప్రార్థిస్తూంటారు.

రఘుపతి రాఘవ రాజారాం” అన్న గీతంలో “సబ్‌కో సన్మతి దే భగవాన్” అంటూ విశుద్ధ తత్వానికి పత్రీక అయిన మహాత్మా గాంధీ గారు భగవంతుడిని కోరుకున్నారు!

ఇతరులకోసం కోరుకోవడంలో కూడా వారు లౌకికంగా ఏమీ కోరరు. ఇతరులకు బట్టలు కావాలనో, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలనో, వాళ్ళకు కొడుకులు పుట్టాలనో లేదా వాళ్ళకు పేరు ప్రతిష్టలు రావాలనో వారు కోరుకోరు! వాళ్ళందరికీ శాంతి రావాలని కూడా కోరుకోరు కానీ.. వాళ్ళు శాంతిని పొందగలిగే “సన్మతి” ని ప్రసాదించమని మాత్రమే మహాత్ములు భగంతుడిని ప్రార్థిస్తూంటారు!

“సన్మతి” అంటే “Right Intellect” అంటే.. “సరి అయిన ప్రజ్ఞ”!

“ఈశ్వరుడు వేరు మరి అల్లావేరు” అనుకుంటూ అశాంతి పాలవుతున్న వారికి.. “ఈశ్వరుడు, అల్లా ఒకటే” అని తెలుసుకోగల సన్మతిని..ప్రజ్ఞను ఇవ్వమని భగవంతుడిని ప్రార్థించడం ఎంత గొప్ప ప్రార్థనో! అయిదవ స్థితి అయిన విశుద్ధ తత్వంలో వున్న వీరు.. ఏడవ స్థితి అయిన “సహస్రార తత్వం”లో ఉన్న భగవంతుడిని ప్రార్థిస్తూన్నారు. అది ప్రార్థనల్లో కెల్లా చివరిస్థాయి.

ఇలాంటి రకరకాల ప్రార్థనలన్నీ కూడా.. విశుద్ధ తత్వంలో అంతమైపోతాయి. ఆ తరువాత వున్న ఆజ్ఞాతత్వంలో “ధ్యానం” వుంటుంది; మరి ఆ పైన సహస్రార తత్వంలో “బోధించడం” వుంటుంది.

సామాన్య ప్రజలకు ..విశుద్ధ తత్వం వరకు ఉన్నవాళ్ళే అర్థం అవుతారు. ఒక ఆజ్ఞా తత్వం మరి ఒక సహస్రార తత్వం వాళ్ళను అర్థంచేసుకోవాలంటే వాళ్ళకు చాలా కష్టం! కేవలం ఒక విశుద్ధతత్వం లో వున్నవాడే వాళ్ళను గుర్తిస్తాడు!

ఆజ్ఞా తత్వం : ఈ తత్వంలో విలసిల్లేవారు.. ఇక ఎక్కువ మాటలు మాట్లాడరు.. మరి ఆచరణ అన్నదే వారికి ముఖ్యం. శ్రీ రాముడు ఆజ్ఞా తత్వానికి ప్రతీక మరి “ఆచరణ” ద్వారానే అతడు ఆదర్శ పురుషుడయ్యాడు. పితృవాక్య పరిపాలన అన్నది అతడిని ఉన్నతోన్నతుడిగా నిలబెట్టింది!

భౌతిక శరీరాలతోనే వుంటూ క్రింది స్థాయికి చెందిన మూలాధార, స్వాధీష్టాన, మణిపూరక తత్వాలతోవుండే సామాన్యజనాలతో పాటు అనాహత మరి విశుద్ధతత్వాలకు చెందిన మహాత్ములకు కూడా ఆజ్ఞా తత్వంలో ఉన్నవారు ఆదర్శప్రాయులు.

సహస్రార తత్వం : ఇక్కడ అంతా సత్యవాక్కు పరిపాలనే జీవితంగా వుంటుది. “సత్యం” పట్ల అద్భుతమైన అవగాహనతో కూడి వారు జీవిస్తూ ఉంటారు.

భర్త లేదా భార్య, తల్లి లేక తండ్రి.. “సత్య రూపకమైన మాటలు” మాట్లాడితే వింటాం.. లేకుంటే ప్రహ్లాదుడిలాగా వారిని సవినయంగా ఎదిరిస్తాం! సహస్రార తత్వానికి పత్రీక అయిన ఆ చిన్నబాలుడు సత్యవాక్ పరిపాలనకు ఎంత ధైర్యంగా నిలబడ్డాడో!

“నాకు తలనొప్పి వుంది” అంటే ధ్యానం చెయ్యండి”.. “నాకు బి.పి. వుంది” అంటే “ధ్యానం చెయ్యండి”.. “నాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి” అంటే “ధ్యానం చెయ్యండి”.. “నేను ఆర్థికంగా ఎంతో చితికిపోయాను” అంటే “ధ్యానం చెయ్యండి” అని చెపుతాము!

ఏసు ప్రభువు తన పదకొండేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి అందరినీ కూర్చోబెట్టి సత్యవాక్కులను బోధిస్తున్నాడు. ఇంతలో ఒక చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి “ఓ జీసస్! మీ తల్లి నిన్ను పిలుస్తోంది” అన్నాడట!

జీసస్ వెంటనే వెనుదిరిగి “ఎవరు నా తల్లి? ఆ దేవుని రాజ్యంలో ఉన్న తండ్రి వాక్కును ఎవరు పరిపాలిస్తారో..వారే నా తల్లిదండ్రులు” అంటూ అద్భుతమైన సత్యవాక్కులను పలికాడు.

ఏసుప్రభువు రోడ్డు మీద వెళ్తూంటే.. ఆయన బట్టలను ముట్టుకున్న వాళ్ళకు రోగాలు తగ్గిపోయేవట! అదే సంగతి ఆయనతో ప్రస్తావిస్తే.. “మీ విశ్వాసమే.. మీకు స్వస్థతను చేకూర్చింది” అన్న సత్యవాక్కునే పలికాడు కానీ “అంతా నేనే చేసాను” అని ఎప్పుడూ చెప్పలేదు!

“ఎవరిని వారే ఉద్ధరించుకోగలరు కానీ.. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించజాలరు” అన్న సత్యం తెలిసిన జీసస్..సహస్రార తత్వంలో అలరారే మాస్టర్ కనుక.. అతని నోట్లోంచి ఎల్లప్పుడూ సత్యం తెలిసిన జీసస్.. సహస్రార తత్వంలో అలరారే మాస్టర్ కనుక అతని నోట్లోంచి ఎల్లప్పుడూ సత్యపూరితమైన మాటలే వచ్చాయి!

సత్యలోకవాసులమైన మనం అందరం కూడా దిగివచ్చిన దేవుళ్ళమే! ధ్యానం ద్వారా ఆత్మానుభవం అయిన పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది తెలుసు! ఆత్మానుభవం కాని వారి నోటినుంచి అసత్య వాక్కులు, అజ్ఞానపు వాక్కులు మరి అశుభ వాక్కులే వస్తాయి. ప్రతి ఒక్కరినీ ఆత్మస్వరూపాలుగా గుర్తించి మాట్లాడే మాటలే “సత్యవాక్కులు”! రోజులో ఏదో కొంతసేపు నాలుగు సత్యవాక్కులు మాట్లాడేసి మౌనంగా వుంటే..దానిని సత్యవాక్ పాలన అనలేం! ప్రతిక్షణం..గాఢనిద్రలో లేపి పలుకరించినా..నోటిలోంచి సత్యవాక్కులే బయటికి రావాలి.

రోజులో 24 గంటలు సత్యవాక్ అభ్యాసంలోనే ఉండాలి. సత్యం యొక్క రూపురేఖలను గుర్తించి ఆ రూపులేఖల్లోనే జీవించాలి! అదే మరి “సత్యవాక్ పాలన” అంటే! ప్రహ్లాదుని సంతతి, గౌతమబుద్ధుని సంతతి, శ్రీకృష్ణుడి సంతతి మరి జీసస్ క్రైస్ట్ సంతతి అయిన మనమంతా.. ప్రతి క్షణం ఆత్మ తత్వాన్ని గురించీ, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించీ, “యద్భావం తద్భవతి”అన్న సూత్రం గురించీ మరి “అప్పో దీపో భవ” అన్న మహావాక్యం గురించీ మాత్రమే పలకాలి. “సత్యవాక్యం సరణం గచ్ఛామి”.. “సత్య వాక్ అభ్యాసం శరణం గచ్ఛామి” అనుకుంటూ వుండాలి!

మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక తత్వాల్లో ఉన్నవారి నోట్లోంచి అశుభ వాక్కులే సదా వస్తూంటాయి. అనాహత మరి విశుద్ధ తత్వంలో ఉన్నవారి నోట్లోంచి శుభవాక్కులు వస్తాయి ఆజ్ఞా మరి సహస్రార తత్వంలో ఉన్నవారి నోట్లోంచి సత్యవాక్కులు మాత్రమే వస్తాయి.

మనం ఏ తత్వంలో ఉన్నామో సరి చూసుకుంటూ మరి అంతకంటే ఉన్నతతత్వంలోకి వెళ్ళడానికి ఎరుకతో పరిసాధన చేస్తూ.. పరిశోధన చేస్తూ.. ఆ తత్వానికి చెందిన పరిపక్వమైన మాటలనే మాట్లాడాలి!! అదే సత్యవాక్ సాధన, సత్య వాక్ శోధన మరి సత్యవాక్ పరిపాలన!