శ్వాస శాస్త్రం … ఆత్మశాస్త్రం

 

“శ్వాస మీద ధ్యాస”

 

“మతం మూలాల్లో ఉన్నది మౌలికమైన ఆధ్యాత్మికత

ఆధ్యాత్మికత మూలాల్లో ఉన్నది ఆత్మశాస్త్రం

ఆత్మశాస్త్ర మూలాల్లో ఉన్నది ధ్యానశాస్త్రం

ధ్యానశాస్త్ర మూలాల్లో ఉన్నది శ్వాస మీద ధ్యాస !”

ఇలా అన్ని శాస్త్రాల యొక్క ఆధారం “శ్వాస” మాత్రమే! ఈ శ్వాసే మన ప్రాణం. ఈ శ్వాసే మన జీవితం ! శ్వాస శక్తే ప్రాణశక్తి .. ప్రాణశక్తే ప్రకృతి శక్తి .. ప్రకృతి శక్తే మరి విశ్వశక్తి! అంటే ఈ జగత్తుకంతటికీ జీవనాధారమైన ఈ విశ్వశక్తే నీళ్ళల్లో, మొక్కల్లో, జంతువుల్లో ప్రకృతి శక్తిగా, ప్రాణశక్తిగా మరి శ్వాసశక్తిగా మారి .. వాటి ఎదుగుదలకూ, వాటి మనుగడకూ తోడ్పడుతూ ఉంది. ఇలా విశ్వంలోని సకల చరాచరాలన్నింటిలోని ఈ మూలశక్తి ఆధారంగా వాటన్నింటినీ ఒకేచోటుకి చేర్చి మళ్ళీ కలపడమే “మతం” లేదా “Religion”!

“Re-ligate” అంటే “మళ్ళీ కలపడం”! కనుక ఇలాంటి వేరుపడిపోయిన ఆత్మలను అన్నింటినీ మళ్ళీ కలపగలిగే మూలచైతన్య శక్తిని గురించి విశేషంగా, అధ్యయనం చేయడమే మన అసలైన మతం ! అదే మన “ఆత్మశాస్త్ర మతం” !!

 

“ధ్యాన శాస్త్రం”

 

శ్వాసశక్తే మన మనుగడకు జీవనాధారం ! మరి ఈ శ్వాస శక్తే మనల్ని మన మూలాల్లోకి తీసుకునివెళ్తుంది. ఎప్పుడైతే మనం శ్వాసానుసంధానం చేస్తామో అప్పుడు శ్వాస సూక్ష్మమై .. మనస్సు శూన్యమై .. పరిశూన్యమై విస్తారంగా విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహించి, మన దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది .. మనం సూక్ష్మశరీరయానాలు చేస్తాం ! ఇలా మన ఆత్మశ్శక్తి అనంతంగా మనకు నిదితమవుతూ ఉంటుంది. ఇదంతా కూడా సరియైన “ధ్యానశాస్త్రం”.

 

“ఆత్మశాస్త్రం”

 

 

విశేష ధ్యానాభ్యాసం ద్వారా ఎప్పుడైతే మన ఆత్మ మేల్కొంటుందో అప్పుడు ఆత్మశక్తి ద్వారా మనం మన గతజన్మలు ఎన్నెన్నో తెలుసుకుంటాం. “మనం ఎన్నెన్నో జన్మలు, ఎత్తుతూ మరెన్నో అనుభవాలను గడిస్తూ ఉన్నాం” అని తెలుసుకుంటాం .. “ఇంకా క్రొత్త, క్రొత్త అనుభవాల కోసం ఈ జన్మ మళ్ళీ తీసుకున్నాం” అన్న సంగతి కూడా ఆత్మశాస్త్ర అభ్యాసం ద్వారా పొందే ఆత్మజ్ఞానం వల్లనే మనకు అవగతమవుతుంది.

“నేను శరీరాన్ని కాదు” .. “అయమాత్మా బ్రహ్మ” ..  “నేను అందరిలో ఉన్నాను”, .. “అహం బ్రహ్మాస్మి” .. “నేను ఆత్మను” అంటూ .. ఆత్మను గురించి ఖచ్చితంగా సంపూర్ణంగా తెలుసుకుంటూ వుంటాం. ఇలా ధ్యానం యొక్క విశేష అభ్యాసం వల్ల ఆత్మశాస్త్రం కూలంకషంగా తెలుస్తుంది. మనలో ఇలాంటి ఆత్మజ్ఞానం వల్లనే సరియైన వ్యవహారిక పరివర్తన వస్తుంది!

“ఎలా మాట్లాడాలి ?” .. “ఏ భావాన్ని వ్యక్తపరచాలి ?” .. “ఎలా నడుచుకోవాలి?” .. అన్న విషయాల్లో కూడా ఎంతో పరిపక్వత వస్తుంది! జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు ఎదురవుతూ .. వాటి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటూ, “ఆత్మ ఎదుగుదల కోసమే ఈ శరీరాన్ని ధరించి జన్మ తీసుకున్నాము” అనే ఆత్మసాక్షాత్కారాన్ని క్రమక్రమంగా పొందుతూ ఉంటాం.

ఇలా మెల్లమెల్లగా దేహ భావనను దాటుతూ, ఆత్మభావన వైపు మన ప్రయాణాన్ని మొదలుపెడతాం! క్రమంగా శరీరానికి వున్న అవుధులు ఆత్మకు లేవని అర్థం చేసుకుని, ఆనందంగా ఒకేసారి బహుముఖతలాల్లో విహరిస్తూ అనంతమైన ఆత్మజ్ఞానాన్ని అపారంగా గ్రోలుతూ ఉంటాం. ఇలా మన “ఆత్మకథ ” కు మూలం ” శ్వాసానుసంధానం ” మాత్రమే అన్న ముఖ్య అవగాహనను చక్కగా పొందుతాం !!