“శ్రీ కృష్ణ ఉవాచ = ధ్యాన ఉవాచ”

 

“సర్వధర్మాన్ పరిత్యజ్య ‘మామ్’ ఏకం శరణం వ్రజ

‘అహం’ త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః”

= “ధ్యాన ఉవాచ” = భగవద్గీత : 18-66

“సర్వధర్మాలనూ అంటే .. సమస్త కర్తవ్యకర్మలనూ

‘నాకు’ సమర్పించి .. ‘నన్నే’ శరణుజొచ్చు ..

అన్ని పాపాలనుంచి నిన్ను ‘నేను’ విముక్తుణ్ణి గావిస్తాను ..

నువ్వు శోకింపకూడదు” = “ధ్యాన ఉవాచ” =

“మామ్” లేక “అహం” = ” ధ్యానయోగం”

భగవద్గీతలో అర్జునుడు “ధర్మసందేహం” గానూ శ్రీకృష్ణుడు

“ధ్యానయోగ పరాకాష్ట” గానూ పాత్రలు వహించారు

ఈ విధంగా మాత్రమే భగవద్గీతను అర్థం చేసుకోవాలి!

సాధారణంగా ఎవరయినా .. ఎక్కడయినా

అధర్మాలను వదిలిపెట్టేయమంటారు కానీ

భగవద్గీతా ప్రకరణంలోని ఈ చరమ శ్లోకంలో

సాక్షాత్తూ భగవంతుడయిన శ్రీకృష్ణుడే

“సకలకర్తవ్యకర్మలనూ వదిలిపెట్టేయి” అని అర్జునుడుని ఆదేశించాడు!

అలా వదిలిపెట్టడం వల్ల వచ్చే పాపాల నుంచి తాను విముక్తం కావిస్తాననీ,

శోకించ వద్దనీ భరోసా కూడా ఇచ్చాడు!

“భగవద్గీతా వాద-సంవాదం” లో ఉన్న పాత్రలు రెండు:

ఒకటి : ధర్మనిష్టను కలిగి ఉన్నా .. ధ్యానాచరణ మాత్రం లేక

మహా కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధర్మసంకటంలో పడిన “అర్జునుడు”

రెండు: ధర్మనిష్ఠతోపాటు సదా ధ్యానాచరణను కూడా కలిగి ఉన్న

శ్రేష్ఠుడయిన “శ్రీకృష్ణుడు”

“ధర్మనిష్ట” = “అర్జునుడు” – (భగవద్గీతకు పూర్వం)

“ధర్మ సంకటం” = “అర్జునుడు” – (భగవద్గీత సమయంలో)

“సదా ధ్యానయోగనిష్ఠ” = (శ్రీ కృష్ణుడు)”

“ధర్మం” అంటే “కర్తవ్యం”

మన శరీరం పట్ల ధర్మం .. మన కుటుంబం పట్ల ధర్మం .. మన సమాజం పట్ల ధర్మం

ఇలా పుట్టినప్పటినుంచీ వచ్చేంతవరకూ మనం ఆచరిస్తూన్న

సమస్త కర్మలనూ ఒకింత వదిలివేసి

‘ధ్యానయోగాన్ని’ శరణు వేడమని ధ్యానయోగీశ్వరుడైన శ్రీకృష్ణులవారి ఆదేశం

“‘మన్’ మనాః భవ ‘మద్’ భక్తః ‘మద్’ యాజీ ‘మామ్’ నమస్కారం

‘మామ్’ ఏవ ఏష్యసి సత్యమ్ తే ప్రతిజానే ప్రియోసి మే”

= “ధ్యాన ఉవాచ” = భగవద్గీత :18-65

“ఓ అర్జునా! నువ్వు ‘నా’ యందే మనస్సును నిలుపు ..

‘నా’ భక్తుడవుకా; ‘నన్నే’ సేవించు; ‘నాకే’ ప్రణమిల్లు ..

ఈ విధంగా చేయటం వలన ‘నన్నే’ పొందగలవు!

ఇది సత్యప్రతిజ్ఞాపూర్వకంగా ‘నేను’ చెప్తూన్న మాట ..

ఎందుకంటే నువ్వు ‘నాకు’ ఎంతో ప్రియుడవు!”

“కృష్ణుడు” = “సదా ధ్యానయోగనిష్ట”

“కృష్ణ ఉవాచ” = “ధ్యానయోగ ఉవాచ”

“‘నా’ యందే మనస్సు నిలుపు” = “ధ్యానం లోనే మనస్సు నిలుపు”

“‘నన్నే’ సేవించు అంటే = “ధ్యానాన్నే సేవించు” అన్నమాట

“‘నన్నే’ శరణు కోరు” అన్నప్పుడు “ధ్యానాన్నే శరణు కోరు” అన్నమాట

మరొక్కసారి అర్థం చేసుకుంటే ..

“అర్జునుడు” = అనునిత్య ధర్మనిష్ట మరి అప్పుడప్పుడూ ధర్మసంకటం

“శ్రీకృష్ణుడు” = “అనునిత్య ధ్యానయోగం” .. “ధ్యాన అభ్యాస తీవ్రత”

భార్యనూ, కుమారుడినీ, సకల రాజ్య సంపదలూ

అన్నింటినీ వదిలి పెట్టేసి మరి గౌతమబుద్ధుడు

“ఆనాపానసతి ధ్యానాన్నే” శరణు వేడాడు!

ఆ విధంగా గౌతమబుద్ధుడు తన కర్తవ్యకర్మలను విడిచి పెట్టేసినా

“ధ్యానశరణు” వలన అతనికి ఏ పాపమూ అంటలేదు!

గౌతమబుద్ధుడిలాగానే మనం కూడా

మన సకల ధర్మాచరణలనూ కాస్సేపు ప్రక్కన పెట్టి

ప్రతిరోజూ ధ్యానసాధనలో విధిగా మునుగుదాం!

రోజుకి ఉన్న ఇరవై నాలుగు గంటలలో కనీసపక్షంగా

ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలపాటు

తప్పనిసరిగా – “భగవద్గీత సాక్షి” గా

సమస్తకర్తవ్యకర్మలనూ/ సకలధర్మాలనూ పరిత్యజించి ధ్యానయోగులం అవుదాం

ధ్యానం ఏవం శరణం వయం! ఇదే “PSSM” యొక్క సంపూర్ణ ఫిలాసఫీ||