శ్రీ బాలయోగీశ్వరులు

 

ముమ్మిడివరం సోదరులు శ్రీ బాలయోగుల జీవితాలు రెండు మహా అద్భుతాలు.

వారి స్వంత జీవితాల కన్నా యోగసాధన కూ, యోగ సిద్ధి కీ, సత్యప్రదర్శన కూ ఇంకా ప్రత్యక్ష నిదర్శనాలు ఏవి వుండగలవు?

ముమ్మిడివరం శ్రీ పెద్ద బాలయోగి నడచిన బాటలో ఆయన తమ్ముడు నడిచాడు.

తీవ్రాతితీవ్రమైన యోగసాధనార్ధం భౌతిక శరీరంతో ఎంతగా ఆడుకున్నారు ఆ ఇరువురు. చుట్టుప్రక్కల వున్న ప్రజలు ఎంతటి మూర్ఖులో, చుట్టుప్రక్కల ప్రపంచం ఎంత మూర్ఖమైనదో నోరు విప్పకనే ఎలుగెత్తి చాటి చెప్పారు.

దేహానికి ఆహారం అవసరం లేదు అన్నది వారి ప్రధానమైన జీవన సందేశం. ఇంకెక్కడి భౌతిక శాస్త్రం? ఇంకెక్కడి మెడికల్ సైన్స్?

అయినా అలాంటి యోగులతో తాము కూడా సమకాలీన యోగులు కావడానికి ఎవ్వరూ నడుము కట్టడం లేదు. ఎంత విషాదకరమైన విషయం.

శ్రీ పెద్ద బాలయోగి జీవితంలో ఒక్కటే ఒకసారి జ్ఞాన ప్రసంగం చేసారు. అదే ఆయన సూత్రాల పట్టిక. తెలుసుకోవలసిన సత్యం అంతా ఆ చిన్ని పట్టికలో ఇమిడి ఉంది.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్లకు ఆ ఇద్దరు యోగులూ అత్యంత ఆదర్శమూర్తులు.

ఎప్పటికైనా ముమ్మిడివరంలోని ఆశ్రమం దేశంలో అతి పెద్ద ధ్యానకేంద్రంగా రూపుదిద్దుకోవాలి.

ముమ్మిడివరంలో, ముమ్మిడివరం చుట్టుప్రక్కల గ్రామాల్లో, తూర్పు గోదావరి జిల్లా మొత్తంలో, ఆంధ్రరాష్ట్రం అంతా; యావత్ భారతదేశంలో అందరూ, ప్రతి ఒక్కరూ యోగ మూర్తులు కావాలి.

అదే పై లోకాలలో వున్న ఆ ఇద్దరు దివ్యమూర్తులు పంపే సందేశం.

కళ్ళు తెరుచుకుని వుండడాన్ని ఇకనైనా తగ్గిద్దాం; కళ్ళు మూసుకుని వుండడాన్ని ఇకనైనా మరి హెచ్చిద్దాం.

ఎప్పుడూ తింటూ వుండడాన్ని తగ్గిద్దాం, తినకుండా వుండడాన్ని ఒకింత హెచ్చిద్దాం.

శ్వాసాహారిగా ఎక్కువ పాళ్ళల్లో వుందాం.

శక్తి ఆహారి గానే అధిక శాతం విలసిల్లుదాం.