సత్య వాక్ పరిసాధన

 

వాక్కులనేవి మూడు రకాలుగా ఉంటాయి.

  • అశుభ వాక్కులు
  • శుభ వాక్కులు
  • సత్య వాక్కులు

“వాక్కులు” అంటే మన నోటిలో నుంచి వచ్చే మాటలే, జీసస్ క్రైస్ట్ అన్నారు “what goes into the mouth, that does not defileth a person. What comes out of the mouth … that defileth a person.” ఎంత చక్కగా చెప్పారో, సహస్రార స్థితిలో ఉన్న ఆ గ్రాండ్ మాస్టర్. అంటే మానవుడి నోట్లోకి ఏం వెళ్తుందో అది మానవుణ్ణి మలినపరచదు, మానవుని నోట్లో నుంచి ఏం బయటికి వస్తాయో అవే మానవుణ్ణి మలినపరుస్తాయి. మానవుడి నోట్లో నుంచి ఏదొస్తుంది ? వాక్కులొస్తాయి. ఈ వాక్కులు “అశుభ వాక్కులు” అనీ, “శుభ వాక్కులు” అనీ, “సత్య వాక్కులు” అనీ మూడు రకాలు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకలో ఉండేవారంతా అశుభవాక్కులనే పలుకుతూ వుంటారు. ఆజ్ఞా, సహస్రారలో ఉండేవాళ్ళ నుంచి, వారి నోట్లో నుంచి, అశుభ వాక్కులూ, శుభ వాక్కులూ రావు … ఎప్పుడూ సత్యవాక్కులే వస్తాయి.

కనుకనే శ్రీ కృష్ణుడు “శుభాశుభ పరిత్యాగీ” అన్నాడు. శుభం వద్దు ; అశుభం వద్దు. ఈ రెంటినీ పరిత్యజించండి. అశుభం అనేది ఇనుప సంకెళ్ళయితే, శుభం అనేది బంగారు సంకెళ్ళు. కానీ, మొత్తానికి సంకెళ్ళే. ఎవరు ” ఇంకొకనికి మంచి చేస్తాను ” అనుకుంటాడో, మంచి చెయ్యడానికి ప్రయత్నిస్తాడో … వాడు అసత్యంలో జీవిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ ఇంకొకరికి మంచి చేయలేరు, ఎవరి కర్మను వాళ్ళు అనుభవిస్తారు. ఒకడు ఇంకొకడికి చెడుపు చేయడం కానీ, మంచి చేయడం కానీ రెండూ అసంభవం.

ఒక తరగతిలో టీచర్ బాగా చెప్తూ ఉన్నాడంటే, స్టూడెంట్స్ ఎవరైతే బాగా వింటారో వారే బాగా నేర్చుకోగలరు. ఎవరైతే వినరో వాళ్ళు నేర్చుకోలేరు … టీచర్ ఎంత గొప్పవాడైనా సరే. కనుక టీచర్ వల్ల ఎవరూ నేర్చుకోరు. వారి వారి శ్రద్ధ, భక్తుల వల్ల, గురి వల్ల ఎవరికి వారు నేర్చుకుంటారు. ఎవరికి వారే అజాగ్రత్తతో కూడి ఉంటే మరి క్రిందికి జారిపోతూంటారు. ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు. ” ఉద్ధరేదాత్మ నాత్మానాం ఆత్మానమవసాదయేత్ … ” అన్న శ్రీకృష్ణుడి సత్యవాక్కు, పిరమిడ్ మాస్టర్లందరికీ ఆదర్శం.

కనుక, పిరమిడ్ మాస్టర్లందరూ కూడానూ నొట్లో నుంచి మాటలు వచ్చినప్పుడు “అశుభ వాక్కులొస్తున్నాయా ? వద్దు, వద్దు” అని వాటిని తీసేసుకుంటారు. “శుభ వాక్కులొస్తునాయా ? అవి కూడా వద్దు, వద్దు” అని తీసేస్తూంటారు. కేవలం సత్యవాక్కులే పలుకుతారు. “నేను నీకు గురువును ; నేను నీకు మంచి చేస్తాను; నేను నిన్ను ఆశీర్వదిస్తాను” అనే మాటలు వారి నుంచి రావు. ఎవరెవరో నన్ను ఆశీర్వాదం కోరుతూ ఉంటారు. ” ఆప్ కే ఆశీర్వాద్ చాహియే ” అంటూంటారు. కానీ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఎవడూ ఇక్కడ లేడు. ఎందుకంటే మీరు సత్య వాక్ పరిసాధకులు. నేను ‘ఆశీర్వాదం’ ఎలా ఇస్తాను ? మీ కర్మలే మీకు ఆశీర్వాదం, మీ సుఆలోచనలే మీ ఆశీర్వాదం. మీ యొక్క పరిశోధనే, మీ యొక్క పరిసాధనే మీ ఆశీర్వాదం. ఇదే సత్య వాక్ పరిసాధన.