సత్యం – శివం – సుందరం

 

“‘సత్యం’ .. ‘శివం’ .. ‘సుందరం’ అన్న మూడు అత్యంత శక్తివంతమైన పదాలు .. మనం అంతా కూడా తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక జీవన ముఖ్యసూత్రాలు! “‘A thing of beauty is a joy for ever’ అన్నారు John Keats! అన్న మహాకవి.”

“జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరి” రచించారు. “ఇలా జీవితం ఎంత ‘సుందరం’ అయినదో తెలుసుకోవాలంటే ముందు మనం ‘సత్యం’ తెలుసుకోవాలి .. ‘శివం’లో జీవించాలి!

“‘నేను ఆత్మను; భౌతికంగా చనిపోయిన తరువాత కూడా నాకు విస్తారమైన మరణాంతర జీవితం ఉంది; నాకు చావు లేదు’ అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ భూమి మీద పుట్టడానికి ముందే పైలోకాలలో ఉన్నప్పుడు ఈ సత్యాలన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చే ముందు ‘మరుపు’ అనే ‘చిప్’ను మన బుర్రలో పెట్టుకుని వచ్చి .. ప్రాపంచికంలో పడిపోయి అక్కడి మరణానంతర జీవితం గురించి అంతా మర్చిపోయి ‘ఇదే నిజం’ అనుకుని దుఃఖిస్తూంటాం.”

“ధ్యానం చేసి .. మన ఆత్మస్వస్వరూపాన్ని గుర్తించుకుని .. ఆ ‘ఎరుక’ తో మనం వచ్చిన పనిని పూర్తిచేసుకుని తిరిగి మన స్వంత లోకాలకు చేరుకుంటాం. ‘మరపు’తో వచ్చి ‘ఎరుక’తో తిరిగి వెళ్ళిపోవడమే అద్భుతమైన జన్మ!

“‘సత్యం తెలుసుకున్న వాడికి జీవితం ఉభయకుశలోపరిగా సాగుతుంది. సమస్త జీవకోటి సంక్షేమమే. అంటే ‘Well-Being’ అన్నదే .. పరమావధిగా అతడు ప్రతిక్షణం ‘శివం’లో జీవిస్తాడు .. శివం అంటే ‘Well-beingness’!

“ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండానే .. చనిపోయాక .. శరీరం మట్టిలో కలిసిపోయాక ఇంకా జీవితం ఏం ఉంటుందండీ! అనే వాళ్ళంతా కూడా పరమమూర్ఖులు!

“కఠోపనిషత్తులో నచికేతుడు ‘చనిపోయిన తరువాత ఏం జరుగుతుందన్న  సత్యం నాకు తెలియాలి’ అని యమధర్మరాజు దగ్గర గొప్ప పట్టు పట్టాడు!

“‘ఈ విషయాలన్నీ నీకు ఎందుకు? దానికి బదులుగా గొప్ప గొప్ప రాజ్యాలూ, మణులూ, మాణిక్యాలూ, లక్షలాదిగా గోవులూ, నౌకర్లూ, అందమైన స్త్రీలూ ఎన్నో ఇస్తానని యముడు ప్రలోభపెట్టినా .. ‘ససేమిరా’ అన్నాడు ఆ పదకొండేళ్ళ చిన్ని బాలుడు!

“రాముడు కూడా అంతే! పధ్నాలుగేళ్ళ చిరుప్రాయంలోనే మరణాంతర జీవితం గురించిన సత్యాలను తెలుసుకోవాలని పట్టిపట్టి మరీ .. 21 రోజుల పాటు రాజగురువైన వశిష్ఠుల వారి దగ్గర కూర్చుని .. ‘యోగవాసిష్ఠం’ చెప్పించుకున్నాడు. అది వినడానికి ఎన్నెన్నో లోకాల నుంచి గొప్ప గొప్ప మాస్టర్లు దిగి వచ్చారట!

“గౌతమబుద్ధుడు అయితే .. ఏకంగా రాజ్యాన్నీ, భార్యాబిడ్డలనూ వదిలేసి మరీ సత్యం తెలుసుకోవాలని వెళ్ళిపోయాడు. ‘ఆనాపానసతి ధ్యానం’ చేసి ‘ఆత్మ అనాత్మ జ్ఞాన’ ప్రకాశాన్ని పొందాడు.

” ‘దుఃఖం అంతటా ఉంది .. దానికి కారణం తృష్ణ .. అది అవిద్య వలన కలుగుతోంది .. ఆత్మజ్ఞానం తో అవిద్య అంతమైపోతుంది.’ అన్న నాలుగు ఆర్యసత్యాలను కనుగొన్నాడు.

“సరియైన ఆలోచనలు .. సరియైన వాక్కులు .. సరియైన బుద్ధి .. సరియైన కర్మలు .. సరియైన జీవనోపాయం .. సరియైన శ్రద్ధ .. సరియైన ఏకాగ్రత .. మరి సరియైన ధ్యానం అన్న అష్టాంగ మార్గాన్ని లోకానికి అందించాడు.

“బుద్ధుడు చూపిన ఈ అష్టాంగ మార్గంలో మనం జీవించినప్పుడు .. అమంగళంగా గడుస్తోన్న జీవితం అంతా కూడా మంగళదాయకం అవుతుంది. అప్పుడు మన ఆత్మకు సౌందర్యోపాసన చెయ్యాలన్న కోరిక పుడుతుంది.

“సోక్రటీస్ భార్యగా పరమగయ్యాళి! ఆమె అతడిని ఎప్పుడూ తిట్టి పోస్తూ ఉండేది. అయినా అతడు ఆమె ఆత్మ సౌందర్యాన్ని ప్రేమిస్తూ .. ఆమెను తిరిగి ఒక్క మాట కూడా అనేవాడు కాదు. సౌందర్యోపాసన అంటే అది!

ఆత్మ సత్యం తెలుసుకుని శివంలో మునిగి తేలే ఒకానొక యోగి మాత్రమే సౌందర్యం కోసం చూస్తాడు. అతడికి ఈ సమస్త ప్రకృతి .. మరి తాను అంతా కూడా సుందరంగానే కనబడుతుంది!

అందుకే ఒకానొక ‘యోగి’ మాత్రమే చక్కగా వంటలు చేసుకుని తింటూ .. అందమైన ప్రదేశాలు దర్శిస్తూ .. సంగీత నాట్యాలలో మునిగి తేలుతూ .. సకల కళలను ఔపోసన పడుతూ .. సౌందర్యోపాసనలోనే తన జీవితాలన్నీ ధన్యం చేసుకుంటాడు!