“శతకోటి సూర్యనమస్కారాలు”

 

“జ్ఞానం” అన్నది రెండు విధాలు

“పరోక్ష జ్ఞానం” మరి “అపరోక్ష జ్ఞానం “

“పరోక్ష జ్ఞానం” అంటే “ఇతరుల అనుభవాల ద్వారా పొందే జ్ఞానం”

“అపరోక్ష జ్ఞానం” అంటే “స్వీయ అనుభవాల ద్వారా పొందే జ్ఞానం”

“పరోక్ష జ్ఞానం” అన్నది “పరుల ప్రకాశం ద్వారా పొందే జ్ఞానం”

“అపరోక్ష జ్ఞానం” అంటే “స్వీయప్రకాశం ద్వారా పొందే జ్ఞానం”

చంద్రుడు “స్వయంప్రకాశకుడు” కాదు

సూర్యుడి యొక్క ప్రకాశం ఆధారంగా అప్పుడప్పుడూ మాత్రమే ప్రకాశించే వాడు

అలాంటి ప్రకాశానికి “అమావాస్య” మరి “పౌర్ణమి” మరి “చంద్రకళలు” ఉంటాయి

అలాంటి పరిస్థితులలో ఒకప్పుడు జీవితం బాగానే ఉంటుంది .. మరి ఒకప్పుడు జీవితం బాగా ఉండదు

జీవితంలో ధ్యానాభ్యాసం ఇంకా ప్రారంభం చెయ్యని వాళ్ళనూ, మరి

స్వాధ్యాయ సజ్జనసాంగత్యాదులలో మాత్రం అధికంగా వెలిగే వాళ్ళనూ

“చంద్రవంశీకులు” గా చెప్పుకోవచ్చు

అయితే

స్వాధ్యాయ సజ్జనసాంగత్యాదులను అధికంగా ఆలంబనలుగా చేసుకుంటూ

మరి స్వీయధ్యానాభ్యాసానికి అత్యధికంగా అంకితం అయినవారు

“స్వయంప్రకాశకులు” గా మారుతారు .. మరి వాళ్ళే “సూర్యవంశీకులు”

సరియైన “థియరీ/సిద్ధాంతం” తెలుసుకున్నవారు “చంద్రవంశీకులు” అయితే

సరియైన “ప్రాక్టీస్/అభ్యాసం” కూడా చేసేవాళ్ళు “సూర్యవంశీకులు”

“ఆనాపానసతి” అభ్యాసంతో అందరూ సూర్యవంశీకులుగా వెలిగి తీరుతారు

“అవగింజంత విశ్వాసం ఉన్నా ..

పర్వతాలను సైతం కదలించగలం” అన్నారు ఏసుప్రభువు

“ఆవగింజంత విశ్వాసం” …

మన పట్ల మనకు, మన ధ్యానం పట్ల మనకు, మన శ్వాస పట్ల మనకు ఉంటే

అనేకానేక ఆధ్యాత్మిక పర్వతాలను నిశ్చయంగా అధిరోహించగలుగుతాం ..

మరి “స్వయంప్రకాశకులు” గా పరిమారుతాం

స్వయంప్రకాశకులయితేనే మరి “గురువులు” గా వెలుగుతాం

పరుల ద్వారా క్రాంతి పొందిన వారంతా “శిష్యలు” గానే మిగిలిపోతారు

అయితే పరప్రకాశంతో కూడా జీవించనివాళ్ళు .. అంధకారంలో మ్రగ్గుతున్నవాళ్ళు

“శిష్యరికం” అన్నది కూడా ఎంతమాత్రం తలపెట్టనివాళ్ళు!

మానవాళి అంతా “గురువులు” గా మరి “స్వయంప్రకాశకులు” గా

పరిపూర్ణులవ్వాలన్నదే PSSM యొక్క ప్రధాన సిద్ధాంతం/లక్ష్యం

స్వాధ్యాయ సజ్జనసాంగత్యాదుల ద్వారా .. “పరోక్షజ్ఞానం”

అకుంఠిత ధ్యానసాధన ధ్యానం ద్వారా .. “అపరోక్షజ్ఞానం” మరి “స్వీయప్రకాశం”

ప్రప్రథమంగా, అందరూ “చంద్రవంశీకులు” గా అవుదురు గాక

  స్వాధ్యాయ సజ్జనసాంగత్యాదులను విశేషంగా చేపడుదురు గాక

మరి అకుంఠిత ధ్యానసాధన ద్వారా

క్రమక్రమంగా “సూర్యవంశీకులు” గా ఎదుగుదురు గాక

“చంద్రవంశీకులు” అయిన వారికి “అభినందనలు”

“సూర్యవంశీకులు” అయిన వారికి “శతకోటి సూర్యనమస్కారాలు”