సంగీతానికి శృతిలాగా ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం

 

“మనమంతా కూడా దేవుళ్ళం! “పైలోకాల నుంచి కొంచెం దిగి .. భూలోకానికి వచ్చి .. ఇక్కడ కొంచెం ఎదిగి .. మళ్ళీ పైలోకాలకు వెళ్ళిపోతాం! “ఆకాశంలో విహరించే ‘మేఘం’ క్రిందికి దిగివచ్చి ‘చెరువు’ లా మారుతుంది. అప్పుడు .. అక్కడ ‘మేఘంలో ఉన్నదీ నీరే .. ఇక్కడ చెరువులో ఉన్నదీ నీరే! అలాగే దైవత్వంతో నిండిన మనం పైలోకాలలోనూ ఉంటాం. భూలోకంలోనూ ఉంటాం! ఇక్కడ శరీరంలో ఉన్నా దేవుళ్ళమే .. అక్కడ పైలోకాలకు వెళ్ళినా దేవుళ్ళమే .. ఇక్కడ మానవుడే అక్కడి దేవుడు. అక్కడి దేవుడే .. ఇక్కడి మానవుడు. అందుకే చనిపోయిన వాళ్ళను చూసి ఎవ్వరూ ఏడవకూడదు.

“చని+పోవడం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇక్కడి నుంచి ఎవరయినా అమెరికాకు వెళ్తే ఏడుస్తామా? వెళ్లిన వాడు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు అన్న ధీమాతో ‘మావాడు అమెరికా వెళ్ళాడు’ అని గొప్పగా చెప్పుకుంటాం! అలాగే చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ భూలోకంలో పుడతారు. ఇక్కడ చెయ్యవలసినవన్నీ చేసేంతవరకూ వస్తూపోతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళను గురించి దుఃఖపడకూడదు. అలా దుఃఖపడేవాడు అపండితుడు, అజ్ఞాని మరి మూర్ఖుడు.

“గతాసూన్ అగతాసూన్ చ నానుశోచన్తి పండితా’ అన్నారు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో! అంటే చనిపోయిన వాళ్ళను గురించి కానీ, బ్రతికి ఉన్న వాళ్ళను గురించి కానీ ఏడ్చేవాడు పండితుడు కాజాలడు అని అర్థం. అందుకే ఎవరికైనా ఏడుపు ఉందంటే వాడు ఇంకా అసత్యంలోనే మరి అజ్ఞానంలోనే ఉన్నాడని అర్థం! మన చుట్టూ ఏడిపించే పరిస్థితులు ఉన్నాయి అంటే మనం ఇంకా అజ్ఞానానికి సంబంధించిన పరీక్షలను ఎదుర్కోవాలని అర్థం. అందుకే ‘ఇక్కడ చంపేవాడూ .. చంపబడే వాడూ ఎవ్వరూ లేరు .. కాబట్టి యుద్ధం చెయ్యి .. ఏడుపు మాను’ అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో!

“యుద్ధాలు చేస్తూనే ఉండాలి. హింస మీద, అజ్ఞానం మీద యుద్ధాలు చేస్తూనే ఉండాలి. ఏ జంతువూ చంపబడకూడదు; ఏ పక్షీ పంజరాన బంధింపబడకూడదు. ఏ చేపా చంపబడకూడదు. అలా చేస్తే మళ్ళీ మనం ఆ పాపకర్మలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మన దుఃఖాలకు మనమే కారణం అని తెలుసుకుని .. అసత్యంలోంచి సత్యంలోకి రావాలి. అజ్ఞానంలోంచి సుజ్ఞానంలోకి రావాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి; మన ధ్యానసాధన మనమే చేసుకోవాలి. మన ధ్యానసాధన మనమే చేసుకోవాలి. మన స్వాధ్యాయం మనమే చేసుకోవాలి; మన సజ్జన సాంగత్యం మనమే చేసుకోవాలి.

“ధ్యానం మన అజ్ఞానాన్ని హరించి వేస్తుంది కనుక మనం మన దుఃఖంలోంచి బయటికి వచ్చి హాయిగా జీవిస్తాం. అందుకే కష్టాలు ఎక్కువయినప్పుడు, రోగాలు ఎక్కువయినప్పుడు, మరి దుఃఖాలు ఎక్కువయినప్పుడు .. మరింత మరింత ఎక్కువగా ధ్యానం చెయ్యాలి. ధ్యానాన్ని హెచ్చించాలి. ఒక దగ్గర కదలకుండా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. పరుగెత్తాలంటె కష్టం కానీ .. కూర్చోవడానికి ఏం బాధ?

“ధ్యానంలో లేకపోవడమే నరకం .. మరి ధ్యానంలో ఉండడమే స్వర్గం కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం .. మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం!