“ధ్యాన ఆధ్యాత్మిక వ్యవసాయ ప్రాజెక్ట్”

 

రైతులందరూ ధ్యానులుగా మారి తమ తమ ఆత్మశక్తిని ఇతోధికంగా పెంపొందించుకుంటే పంటలు ఇంకా బాగా పండుతాయి … వాతావరణం కూడా వారికి అనుకులంగా మారి సకాలంలో వర్షాలు పడతాయి.

గ్రామ ప్రజలకు పంటలే జీవనాధారం కనుక వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పిరమిడ్ క్రింద ఉంచిన విత్తనాలను వాడడం వలన వాటికి విశ్వశక్తి అంది తద్వారా విత్తన శక్తి పెరిగి పంటలో అధిక దిగబడులు వస్తాయి. వ్యవసాయ పనులు లేని ఖాళీ సమయాల్లో… పంట పొలాల్లో రైతు కుటుంబాలు ధ్యానం చేయడం వల్ల మొక్కల్లో అధిక శక్తి వస్తుంది.

వ్యవసాయంలో రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులనే వాడాలి… గ్రామాల్లో వున్న ఆలయాల్లో అందరూ విధిగా ధ్యాన అభ్యాసం చెయ్యాలి. గ్రామాలన్నీ పచ్చగా కళకళలాడుతూ… పట్టణ ప్రజలే గ్రామాలకు వలసపోయేట్టుగా మారాలి అన్నదే “ధ్యాన ఆధ్యాత్మిక వ్యవసాయం ప్రాజెక్ట్” మూల సిద్ధాంతాలు.

పంటలు సరిగ్గా పండక ఆత్మహత్యలు చేసుకునే రైతులకు ఆత్మజ్ఞానం అన్నది తప్పనిసరిగా అందివ్వాలి. “నేను అన్నది శరీరం కాదు… ఆత్మ” అని తెలుసుకున్నప్పుడు రైతులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు.

ఆర్థిక నిస్సహాయస్థితిలో ఒకానొక రైతు తాను చనిపోవడం వలన తన కుటుంబాన్ని కూడా చంపడం అన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మిగిలి ఉందంటే మనదేశంలో ఉన్న విద్యావంతులందరికీ మరి ఆధ్యాత్మికవేత్తలందరికీ ఇది సిగ్గుచేటు. ప్రతి ప్రాణం పవిత్రమైనది… ఆత్మహత్య కన్నా మహాపాపం లేదు… మరి ఆత్మజ్ఞానం కన్నా మించిన మహాజ్ఞానం లేదు.

  • గ్రామ ప్రజల దారిద్ర్యానికి… గ్రామప్రజలే బాధ్యులు.
  • పచ్చని వరి పొలాలను.. చేప/రొయ్యల చెరువులుగా మార్చి, నీటిలో ఆడుకుంటున్న చేపల్ని.. పట్టి పీడించడం.
  • అమ్మవారి జాతర పేర… మూఢ నమ్మకాలూ, మూఢవిశ్వాసాలూ మూఢాచారాలూ లోతుగా పాతుకుపోయి జంతుబలి కోసం ప్రేమగా పెంచిన కోళ్ళనూ, మేకలనూ కోసుకుతినడం వల్ల వాళ్ళు అనేక బాధలకు గురవుతున్నారన్న సత్యాన్ని వాళ్ళకు తెలియజేయడమే మౌలిక లక్ష్యం.