“ప్రపంచ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పండుగ -10”

 

పత్రీజీ సందేశం

 

సెప్టెంబర్ 30

మనం ఇక్కడ ప్రతి క్షణం నేర్చుకోవడానికీ మరి ఉత్సాహంతో గడపడానికే ఉన్నాం. ఆ అనుభవజ్ఞానంతో మళ్ళీ మన స్వంత ఇంటికి అంటే మన స్వంత లోకానికి తిరిగి వెళ్ళిపోతాం.

నక్షత్రలోకవాసులం అయిన మనం అంతా ప్రస్తుతం మన ఇంటికి అంటే మన నక్షత్రలోకాలకు తిరిగి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే  ఇంటికి తిరిగి వెళ్ళే ప్రయాణం. ఈ ప్రయాణం అంతులేనిది .. మరి ఎన్నటికీ ముగియనిది .. ఇలా ఇంటికి తిరిగి వెళ్ళే ద్వారాన్ని తెరిచే మార్గాలు అనేకం. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో ద్వారాన్ని తెరవడం నేర్చుకున్నారు.

“మనమందరం నక్షత్రవాసులం. బహుముఖ తలాలకు చెందిన జీవులం అయిన మనం మన జీవిత పరిస్థితులకు ఎదుటివారిని నిందించడం మానేస్తే .. మన స్వీయ పరిణామక్రమంలో మరింత ముందుకు పురోగమిస్తాం” అన్నారు; ఆహూతులందరికీ పత్రీజీ దసరా శుభాకాంక్షలు అందజేయగా అతిథులందరూ తమ తమ ప్రారంభ సందేశాలను ఇచ్చారు.

 

అక్టోబర్ 1

 

మనకు మన శక్తిసామర్థ్యాలు తెలియవు. అందుకే మన గురించి మనం తక్కువగా భావించుకుంటూ ఉంటాం. ఇది చూసి ఇతర లోకాల మాస్టర్లు నవ్వుకుంటున్నారు.

మనం కేవలం శరీరాలం మాత్రమే కాదు. ‘రథం’లాంటి ఈ శరీరాన్ని నడిపించే సారధులం అయిన ఆత్మలం మనం. సారథి యొక్క విధి  రథాన్ని జాగ్రత్తగా గమ్యం చేర్చడమే. ఆత్మచైతన్యంతో జీవిస్తూ లక్ష్యంపట్ల ధ్యాసతో జీవిస్తే ఏ అనారోగ్యాలూ మన గమ్యం యొక్క దిశను మార్చలేవు” అని తెలియజేశారు.

 

అక్టోబర్ 3

 

“సత్యం శాశ్వతమైంది! అది ఎక్కడయినా, ఎప్పుడయినా ఒకేవిధంగా ఉంటుంది. ఆనాటి భగవద్గీత మొదలుకుని ఈనాటి థియోసాఫికల్ సొసైటీ .. డా|| లోబ్‌సాంగ్ రాంపా .. ఓషో .. మరి PSSM చెప్పే సత్యం ఒక్కటే! అదే ‘ఆత్మ’ సత్యం! అందుకే మనం మన ఆత్మతో సక్రమంగా వ్యవహరిస్తే చాలు మన అభివృద్ధినీ, భౌతిక ఆధ్యాత్మిక సంక్షేమాలనూ అన్నీ మన ఆత్మే చూసుకుంటుంది.” అంటూ ఆత్మవత్ జీవన విధానాన్ని విశేషంగా తెలియజేశారు.

అక్టోబర్ 4

‘మనం ఇతరులకు ఏం ఇస్తామో దానినే పదింతలుగా తిరిగి పొందుతాం’ అంటోంది కర్మసిద్ధాంతం. కర్మ అన్నది విశ్వనియమం. దానిని పరిపూర్ణంగా అర్థం చేసుకుని దానిపట్ల స్పష్టతను పొందనంత వరకూ మనం దానిని అతిక్రమించలేం.

“ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా మనం కోరుకున్న విధంగా ఉండదు. కనుక కేవలం ఆధ్యాత్మిక విజ్ఞాన పరిపుష్టితో ఉంటూ మరి బుద్ధుడు చూపించిన అష్టాంగ మార్గం నడుస్తూ ఉంటే మాత్రమే ఈ ప్రపంచంలో మనం హాయిగా జీవించగలుగుతాం” అంటూ కర్మసిద్ధాంతాన్ని విశేషంగా వివరించారు.