ప్రకృతి పుత్రులు

 

” ఎంత నేర్చినా .. ఎంత చూసినా
ఎంతవారలైనా .. కాంత దాసులే “

ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజస్వామి తమ అద్భుతమైన కీర్తన ద్వారా మనకు ఒకానొక గొప్ప సత్యాన్ని తెలియజేశారు. “కాంత అంటే “ప్రకృతి”! అంటే మన స్వంత సహజస్వభావం! “కాంత దాసులు” అంటే “ప్రకృతితత్త్వానికి వశులై వున్నవాళ్ళు.” అంటే “ఎవరి స్వంత ప్రకృతి స్వభావాలకు వారే వశులై వున్నవారు” అని అర్థం! అలా ఎవరికి వారు తమ తమ సహజ ప్రకృతిని అనుసరించి నడుచుకుంటూ ఉండడమే సరియైన జీవన విధానం!

ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ తమ జన్మపరంపరలో భాగంగా కొన్ని జన్మలు తమోగుణ ప్రకృతితో, కొన్ని జన్మలు రజోగుణ ప్రకృతితో, కొన్ని జన్మలు సత్వగుణ ప్రకృతితో అందులో మరి కొన్ని జన్మలు శుద్ధ స్వాతికగుణ ప్రకృతితో జీవించి చివరాఖరిగా నిర్గుణ ప్రకృతిలో జీవిస్తూ తమ తమ జీవన కార్యకలాపాలను చేపడుతూంటారు.

మహాభారతంలో పాండువులకూ, కౌరవులకూ మధ్య సంధిరాయబారాన్ని నెరపడానికి శ్రీకృష్ణుడు హస్తినకు వెళ్ళాడు. యుద్ధనివారణ మార్గానికి ఉన్న ధర్మాధర్మ విచక్షణా విశేషాలన్నింటినీ దుర్యోధనాదులకు స్పష్టంగా తెలియజేసాడు! శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకృతి ధర్మాలన్నింటినీ శ్రద్ధగా విన్న “కాంత దాసుడయిన” దుర్యోధనుడు …

“జానామి ధర్మః న చ మే ప్రవృత్తిః

జానామి అధర్మః న చ మే నివృత్తిః”

“నాకు ధర్మం అంటే తెలుసు .. అధర్మం అంటే ఏమిటో తెలుసు! ఆ రెండూ చేయడం వల్ల వచ్చే ఫలితాలు కూడా తెలుసు. అయినా నా సహజ ప్రకృతి నన్ను అధర్మం చెయ్యమనే చెబుతోంది కనుక నేను అదే చేస్తాను” అని చెప్పి కయ్యానికి కాలుదువ్వాడు!

కురుక్షేత్ర యుద్ధరంగం మధ్యలో కూర్చుని .. వైరి పక్షంలో వున్న తన బంధువర్గాన్ని చూసి విచలిత మనస్కుడైన అర్జునుడు ధనుర్భాణాలను క్రింద పడవేసి యుద్ధం చేయనని ఒక భీరువులా మాట్లాడాడు.

పలాయన వాదాన్ని వినిపిస్తున్న చింతాదాసుడయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు అతని సహజ ప్రకృతి అయిన క్షత్రియత్వాన్ని గుర్తుచేసి “పిరికివాడిలా యుద్ధరంగం నుంచి పారిపోవడం నీ ‘స్వంత ప్రకృతి’ ఎంతమాత్రం కాదుకనుక లేచి గాండీవం చేత బట్టి యుద్ధం చెయ్యి” అంటూ కర్తవ్యాన్ని బోధించాడు!

ఇలా మనం అంతా కూడా ఇలా అనేకానేక జన్మలకు చెందిన ఏ గుణసంచయాలతో పుడతామో .. అదే మన “స్వంత ప్రకృతి” మరి మన “స్వంత స్థితి” అవుతుంది. అలా స్వస్థితిలో జీవించే వారంతా కూడా “ప్రకృతి పుత్రులు” గా పిలవబడతారు.

పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అసలుసిసలైన “ప్రకృతి పుత్రులు”! వారి సహజ ప్రకృతి “ధ్యానం” చెయ్యడం .. “స్వాధ్యాయం” చెయ్యడం ..మరి “సజ్జన సాంగత్యం” చెయ్యడం! ఎదుటి వాళ్ళ సహజ ప్రవృత్తిని మార్చాలని వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించరు. తమలాగే వారు కూడా తమ సహజ ప్రకృతిలో జీవిస్తున్నారని సుస్పష్టంగా తెలుసుకుని మరీ ప్రవర్తిస్తూ వారు లోక కల్యాణార్థమే తమ జీవన వ్యాపారాలను చేపడుతూంటారు. అలాంటి వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఏ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉన్నా .. వారికి విజయమే సిద్ధిస్తుంది!