ప్రకృతి వికృతి

‘ప్రకృతి’ కి వ్యతిరేకమవ్వడమే ‘వికృతి’.

‘ప్రకృతి’ తో వుంటే ‘వికృత బుద్ధి’ లేకుండా వుంటాం. వికృతి మనస్సు లేకుండా వుంటాం.

‘ప్రకృతి’ తో వుంటే ఒక రకంగా వుంటాం ; ప్రకృతిలో జీవించకపోతే, మరోరకంగా, అంటే అధ్వాన్నంగా తయారవుతాం.

‘ప్రకృతి’ అంటే కొండలు, చెట్లు, పక్షులు – ఇవన్నీ స్థూల ప్రకృతి – చర్మచక్షువులతో చూసేది.

అయితే “ప్రకృతితో జీవించడం” అంటే “స్థూలప్రకృతితోనే జీవించడం” కాదు.

రకరకాల ప్రకృతులున్నాయి – 1) చర్మచక్షువులతో చూసే ప్రకృతి, 2) దివ్యచక్షువు తో చూసే ప్రకృతి – అది బ్రహ్మాండమైంది.

ఎన్నెన్నో లోకాలు కలది – ‘సూక్ష్మ’ , ‘కారణ’ , ‘మహాకారణ’ లోకాలతో కూడి వుండే ప్రకృతి – దివ్యచక్షువుతో చూసేది.

“ప్రకృతితో జీవించడం” అంటే మన కంటికి కనబడే ప్రకృతితోనే కాకుండా కంటికి కనబడని సూక్ష్మ, కారణ, మహాకారణ ప్రకృతితో కలిసి వుండటం. అప్పుడే సరైన శాస్త్రీయ పురుషులుగా, సరియైన విశ్వజీవులుగా పరిణమిస్తాం. అంతేకాకుండా, ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్న మన ‘భావసంపద’ , ‘మనోవికాసం’ మొదలైన వాటితో కూడా చక్కగా జీవించాలి. మనలో వున్న న్యూనత్త్వ ఔన్నత్యాలతో కూడా చక్కగా జీవించడం అంటాం. మనల్ని మనం కించపరచుకోకూడదు. అలాగే మనిషి కూడా ప్రకృతిలో భాగమే. అలాగే ఇతర ప్రాణికోటితో కూడా సహృదయతతో జీవించాలి.

రకరకాల ప్రకృతులకు మూలమైనది మూల ప్రకృతి – ‘మూల చైతన్యం’ – అక్కడ ‘అధ్వైతం’ గా జీవించడం, వేరొకటి లేకుండా జీవించడం ; ‘అధ్వైతానుభూతి’ పొందడం అనేది కేవలం ‘ధ్యానం’ ద్వారానే సాధ్యం ; అది ‘మహాప్రకృతి’ తో కలిసి జీవించడం లాంటిది, ఇక్కడ కేవల పురుషులుగా, ‘పరమాత్ములు’ గా మనం జీవిస్తాం అన్నమాట.

మిగతా ప్రకృతి అంతా చక్కగానే వుంది – మానవుడొక్కడే ‘వికృతం’ గా తయారయ్యాడు. కనుక, మనం అన్ని రకాల ప్రకృతులతోనూ కలిసి జీవించాలి. అప్పుడే మనం ‘ప్రకృతి పురుషులం’ అవుతాం. లేకపోతే ‘వికృత పురుషులం’ అవుతాం. వికృత రూపాలు ధరిస్తాం. ప్రకృతితో మనం జీవించలేకపోతే మనం వికృతంగా తయారవుతాం. ఎంతవరకూ మనం ‘ప్రకృతి పురుషులం’ కామో అంతవరకూ మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ వుండాల్సిందే.