“ఒకానొక ఆత్మవిజ్ఞాన శాస్త్రజ్ఞుడిని నేను”

 

  నేను 1947, నవంబర్ 11 వ తేదీన నిజామబాద్ జిల్లా బోధన్ లో జన్మించాను. “మన జన్మను మనమే ఎంచుకుంటాం” అన్న ఆత్మప్రణాళికలో భాగంగానే నేను .. నా తల్లిదండ్రులనూ మరి నేను పుట్టవలసిన ప్రదేశాన్నీ ఎంచుకుని .. భిన్న భిన్న సంస్కృతుల మేళవింపుతో కూడిన బోధన్ పట్టణంలో పుట్టాను! నా జీవితంలో అనేక విషయాలను నేను మా అమ్మ సావిత్రీదేవి గారి నుంచి నేర్చుకున్నాను. ముఖ్యంగా కష్టాలను చిరునవ్వుతో స్వీకరించడంలో ఆవిడ చూపించిన ధైర్యస్థైర్యాలు నాకు ఎంతో స్ఫూర్తిదాయకాలుగా నిలిచాయి. ఆవిడ తన జీవితంలో ఎన్నెన్నో కష్టనష్టాలనూ, మరెన్నో ఇబ్బందులనూ చవిచూసారు. అయినా .. ఏ రోజు కూడా ఆవిడ జీవించే ధైర్యాన్ని కోల్పోలేదు. ఆవిడ ఏ క్షణంలో కూడా బద్ధకంగా ఉండేవారు కాదు. పిల్లల సంరక్షణ, చదువులు, సంగీతం, భర్త అనారోగ్యం, వచ్చేపోయే బంధువులు .. ఇలా అన్నింటినీ ఏకకాలంలో చూసుకుంటూ కుటుంబ సమస్యలన్నింటినీ అవలీలగా ఎదుర్కొన్నారు! ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆవిడ ఏనాడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు మరి తన కర్మలకు ఎవ్వరినీ నిందించలేదు! ఇరుగుపొరుగు కుటుంబాలకూ, స్నేహితులకూ తమ విశేషసహాయ సహకారాలను అందిస్తూ అపారమైన మైత్రీ తత్వాన్ని ప్రదర్శించేవారు! వారి ఆత్మీయ సంరక్షణలో పెరుగుతూ నేను నా అన్నగారైన “వేణువినోద్” గారి సహకారంతో నేను సంగీతం పట్ల అభిరుచిని పొందాను. ఫలితంగా 1963 నుంచి 1970 వరకు “శ్రీ చంద్రశేఖరన్” సికింద్రాబాద్, గారి దగ్గర వేణువు .. 1975 నుంచి 1978 వరకు కర్నూల్‌లో “పద్మభూషన్ డా||శ్రీపాద పినాకపాణి” గారి దగ్గర ఉన్నత స్థాయి కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. నా ప్రాథమిక మరి మాధ్యమిక పాఠశాల విద్యాభ్యాసం బోధన్‌లోనూ, మరి ఉన్నత పాఠశాల, డిగ్రీ చదువులు సికింద్రాబాద్‌‌లలోనూ పూర్తిచేసుకున్న తరువాత నేను .. 1966-1970 సంవత్సరాలలో B.SC.(అగ్రికల్చర్) .. పూర్తిచేశాను. అదే సమయంలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లో ఒక సంవత్సరం పాటు ‘రీసెర్చ్ ఫెలో’ గా పనిచేశాను. 1970 లో ఒక సంవత్సరం పాటు “ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్” గా తెనాలి లో పనిచేశాను. ఆ తరువాత “కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్” లో 1975 సంవత్సరం నుంచి 1992 సంవత్సరం వరకు ’సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్’ గా .. ’సీనియర్ అగ్రోనమిస్ట్’ గా .. ’రీజియనల్ మార్కెటింగ్ ఆఫీసర్’ గా మొత్తం మీద పెద్ధెనిమిది సంవత్సరాలపాటు ఆ కంపెనీలో పనిచేశాను. అయితే ఈ భౌతిక జీవితం మరి ఈ ప్రాపంచిక చదువులతో పాటు నాకు చిన్నప్పటి నుంచీ ‘ఆధ్యాత్మికత‘ పట్ల చాలా ఉత్సుకత వుండేది. చిన్నప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి “శాంతినికేతన్” గురించి విన్నప్పుడల్లా నా ఓళ్ళు పులకరించిపోయేది. నేను నా ఎనిమిదేళ్ళ వయస్సులో మొట్టమొదట చదివిన పుస్తకం మహాత్మాగాంధీ గారి “మైఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్”. అలాగే పదేళ్ళ వయస్సులో విశ్వనాధ సత్యనారాయణ గారి “వేయిపడగలు” .. పదిహేనేళ్ళ వయస్సు లో పండిత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వ్రాసిన ఇండియన్ ఫిలాసఫీ రెండు సంపూర్ణ సంపుటాలను రెండుసార్లు చదివాను! ఆ తరువాత పది సంవత్సరాలలో ఇంగ్లీష్ సాహిత్యం ఎంతో చదివాను; ఛాసర్, షేక్‌స్పియర్, మిల్టన్ ల నుంచి మొదలుపెట్టి డికెన్స్ వరకు .. టాల్‌స్టాయ్, డోస్టోవిస్కీల నుంచి మొదలుపెట్టి రవీంద్రుడి ‘గీతాంజలి’ వరకు కొన్ని వందల సాహిత్యపరమైన ఇంగ్లీష్ పుస్తకాలనూ మరి తెలుగులో కూడా చలం, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, అడివి బాపిరాజు మొదలైన వారు రచించిన పుస్తకాలను విస్తారంగా చదివాను. కొద్దిగా హిందీ పుస్తకాలను కూడా చదివాను. చదువుతో పాటు నా సంగీతసాధన, ఆటలూ, పాటలూ ఉద్యోగం, సంసారం అందరిలా అతి సాధారణంగా గడిచిపోతున్నా కూడా .. మరి నాలో ఏదో తపన నన్ను ప్రశాంతంగా వుండనిచ్చేది కాదు. “ఏదో చెయ్యాలి” అనిపించేది కానీ .. ” ఆ చెయ్యాల్సింది ఏమిటో” తెలిసేది కాదు! అన్నీ వున్నా కూడా ఏదో వెలితి .. ఏదో అయోమయం! అనేకానేక పుస్తకాలు చదివి కొద్దిగా “జ్ఞానయోగి” ని అయ్యాను. సంగీతం నేర్చుకుని కొద్దిగా “నాదయోగి” ని అయ్యాను .. మంచి పనులు చేస్తూ కొద్దిగా “కర్మయోగి” ని అయ్యాను. .. 1976 వరకు ఆ ‘మంత్రం’ అనీ ఈ ‘ఆసనం’ అనీ కొన్ని నేర్చుకున్నాను కానీ .. నాలోని అయోమయం మాత్రం తగ్గలేదు; అంతా అపసవ్యంగా తోచేది!! 1976 సంవత్సరం తరువాత కర్నూలులో తోటి కంపెనీ మిత్రుడు శ్రీ రామచెన్నారెడ్డి ద్వారా “ఆనాపానసతి” ధ్యానం గురించి తెలుసుకున్నాక వెంటనే అంతా సవ్యంగా మారిపోయింది! అప్పటివరకు జీవితం అనే కుర్చీలో .. ముందుకూ వెనుకకూ వంగి అటూ ఇటూ అయోమయంగా ఊగుతూ ఉన్నవాడిని తరువాత అదే కుర్చీలో రిలాక్స్‌డ్‌గా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను!! ధ్యానం చెయ్యకముందు ఇల్లు కట్టుకుంటాం .. పెళ్ళాం వుంటుంది .. మొగుడు వుంటాడు .. పిల్లలు వుంటారు .. “అన్నీ బావుంటాయి” కానీ .. “ఏమిటో బాగోదు”! ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో .. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రం గురించి అవగాహన చేసుకుంటామో .. అప్పుడు “అన్నీ బావుండటం” అన్నది నిజంగా ప్రారంభం అవుతుంది! అంతవరకు “బాగాలేని మొగుడు” కూడా కొద్దిగా బాగానే వుంటాడు. అంతవరకు “బాగాలేని పెళ్ళాం” కూడా ‘కొద్దిగా’ బాగానే వుంటుంది. అలాగే అంతవరకు “బాగాలేని పిల్లలు” మరి “బాగాలేని పక్కింటివాళ్ళు” కూడా ‘కొద్దిగా’ బాగానే వుంటారు. అప్పటివరకు ‘నాకు అది రాలేదు’ .. ‘నాకు ఇది ఇవ్వలేదు’ అని మనం తిట్టుకున్న .. “దేవుడు” కూడా కొద్దిగా బాగానే వుంటాడు కనుక “అంతా సవ్యంగానే జరుగుతోంది” అని తెలుసుకుంటాం. ఒకవేళ ధ్యానంలోకి రాకపోతే మాత్రం .. చివరి శ్వాస వరకూ చేసిందే చేస్తూ, విన్నదే వింటూ, తిన్నదే తింటూ, చూసిందే చూస్తూ సమయాన్ని గడిపేస్తూంటాం! అలాంటి జీవితంలో ఎటువంటి ఎదుగుదలా ఉండక పోవడంతో “నాది ముదనష్టపు జీవితం” అనుకుంటూ ఉంటాం! మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే .. ప్రాపంచిక చదువులు అందరికీ తప్పనిసరి కానీ దానికన్నా తప్పనిసరి అయినదే ‘ఆధ్యాత్మిక విద్య’ ! ఆధ్యాత్మిక విద్యతో కూడిన జీవితాలే పరిపూర్ణంగా ఉంటాయి కనుక నేను కూడా జ్ఞానపరంగా ‘ఆధ్యాత్మికత’ అన్నది క్షుణ్ణంగా తెలుసుకుని .. మరి అభ్యాసపరంగా ‘ధ్యానం’ అన్నది తప్పనిసరిగా అనుభవంలోకి తెచ్చుకున్నాకే పరిపూర్ణంగా జీవిస్తూవచ్చాను. ఇప్పటి వరకు నేను సుమారు పదివేలమంది ఆధ్యాత్మిక గురువులు వ్రాసిన సుమారు యాభైవేల ఆధ్యాత్మిక గ్రంథాలను చదివాను! అయితే ప్రప్రథమంగా నాలోని సువిశాల ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశేషంగా తట్టిలేపిన కారుణ్యమూర్తి మాత్రం .. డా|| లోబ్‌సాంగ్ రాంపా! 1979లో ఈ టిబెట్ మహాయోగి వ్రాసిన విజ్ఞానదాయకమైన పుస్తకం “You Forever ” ను నేను చదవడం జరిగింది. దివ్యచక్షువు గురించీ, సూక్ష్మశరీరయానం గురించీ, ఆకాశిక్ రికార్డు ల గురించీ, మరి మరణానంతర జీవితం గురించీ వారు తమ స్వానుభవాలను తిరుగులేని విధంగా అందించి నన్ను ఒకానొక ఆధ్యత్మిక శాస్త్రజ్ఞుడి లా మలిచారు. వారి నుంచి అపారమైన పరలోక జ్ఞానాన్ని అందుకున్న నేను ఒక ఆత్మవిజ్ఞాన శాస్త్రజ్ఞుడినై “ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే వుంటుంది” అన్న సత్యాన్ని తెలుసుకున్నాను! “ధ్యానం ద్వారా మనలో వున్న అశాస్త్రీయతను సరిచేసుకుని చూస్తే .. ప్రపంచంలో వున్న ప్రతి ఒక్కటీ మనకు అద్భుతంగా కనపడుతూ వుంటుంది.” అని అర్థం చేసుకున్నాను. ” మనలో ఎంత మార్పు వస్తుందో ప్రపంచంలో కూడా అంతే ,మార్పు సహజంగానే వస్తుంది మరి “మనలో ఎంత అభివృద్ధి కనిపిస్తుందో ప్రపంచంలో కూడా అంతే అభివృద్ధి మనకు సహజంగానే కనపడుతుంది” అన్న అవగాహనను పొందాను. ముళ్ళకంపలతో నిండిన అడవిలో మనం నడవాలి అంటే ఆ అడవిలో వున్న ముళ్ళకంపలన్నింటినీ ఏరవలసిన పనిలేదు. కేవలం మన కాళ్ళకు చెప్పులు వేసుకుని నడిస్తే చాలు .. క్షేమంగా నడిచి మన గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే “ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలి అంటే ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవలసిన పని లేదు” అని అర్థం చేసుకున్నాను. “మనం ఆనందంగా వుంటే అందరూ ఆనందంగానే వుంటారు కనుక మన దృక్పధాన్ని శాస్త్రీయంగా ఉండేట్లు సరిచేసుకుంటూ.. సృష్టిలో వున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత అభివ్యక్తీకరణలపట్ల గౌరవభావంతో మెలిగితే చాలు” అన్న దివ్య అవగాహనను పొందాను. ఇదంతా తెలుసుకున్న మరినిమిషంలోనే నాలోని ఆవేదనాభారం అంతా తగ్గిపోయి .. నా జన్మలక్ష్యం ఏమిటో నాకు అర్థం అయ్యింది! దాంతో నేను నా ఉద్యోగధర్మాన్ని మరింత నైపుణ్యంగా నిర్వర్తిస్తూనే .. ఎక్కడెక్కడ పనిచేస్తున్నానో అక్కడక్కడ అందరికీ ధ్యానాన్నీ మరి నేను తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్నీ, దుఃఖ నివారణోపాయాలనూ చెప్తూ వచ్చాను. ప్రతి ఒక్కరికీ నా స్నేహహస్తాన్ని అందిస్తూ .. ఒకానొక మైత్రేయ బుద్ధిడిలా “ధ్యానం చేయవోయ్! శ్వాస మీద ధ్యాస పెట్టవోయ్!” అనేవాడిని. “నీకు స్కూటర్ నడపడం నేర్పిస్తాను ధ్యానం చెయ్యి”. నీకు టేబుల్ టెన్నీస్ ఆడడం నేర్పిస్తాను, ధ్యానం చెయ్యి” అంటూ ధ్యానం నేర్పించేందుకు ‘లంచం’ ఇస్తూ ఒక్కొక్కరినీ పట్టుకుని ధ్యానంలోకి లాగాను! ఇంటికి కూరలు అమ్మే ‘అమ్మి’ గంప పట్టుకుని వస్తే .. “సరే .. మొత్తం గంపంతా నేనే కొంటాను; ఒక గంట వరకూ కూర్చుని ధ్యానం చేసుకో” అని చెప్పేవాడిని. ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్ళడానికి బస్‌స్టాండ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ బఠాణీలు అమ్ముకునేవాడితో “ఇదంతా అమ్మితే ఎంత వస్తుంది?” అని అడిగేవాడిని. “పదిహేను రూపాయలు సార్” అనేవాడు. “బస్సు రావటానికి ఇంకా ఒక గంట సమయం వుంది .. నీకు ఆ రూపాయలు నేను ఇస్తాను, అప్పటివరకూ ధ్యానం చేస్తూ కూర్చో” అనేవాడిని! అలా ఒక్కొక్కరికీ ధ్యానం నేర్పిస్తూ మొదలైన నా జీవితం ధ్యానప్రచారోద్యమంలో27 వసంతాలు పూర్తి చేసుకుని ‘ఇప్పుడు’ .. ‘ఇప్పడివరకు’ .. వచ్చింది. “చేస్తే చెయ్యి .. లేకపోతే చావు” అన్న నా పరమ గురువు శ్రీసదానందయోగి గారి అజ్ఞానుసారమే అంతా జరుగుతోంది! మానవ నాగరికతలో మాంసం తినడం అన్నది తరతరాలుగా వస్తోంది. అయితే “ఇది ఒక తప్పు పని” అని కానీ .. “దాని వల్ల మేము సాటి జీవిని హింసిస్తున్నాం” అన్న అవగాహన కానీ 80 శాతం మంది ప్రపంచ ప్రజలకు లేనే లేదు. ఇపటికీ కోడి, మేక, రొయ్య, చేప మొదలైన నిస్సహాయ జీవులను చంపి లాభాలను గడించడాన్నే జీవనాధారంగా ఎన్నో లక్షల కుటుంబాలు తమ దౌర్భగ్యపు వ్యాపారాలు చేసుకుంటున్నాయి. “తోటి ప్రాణులను పెంచి సంహరిస్తున్నాం” అన్న కనీస మానవత్వపు భావన లేకుండా వారు దానిని ఒక వృత్తిగా స్వీకరించడం మానవజాతి చేసుకున్న దౌర్భాగ్యం! తినేవారు కూడా .. “చనిపోయిన జంతువుల మృత కళేబరాలను తింటున్నాం” అన్న ఎరుక కూడా లేకుండా దానిని మామూలు ఆహారంలాగే తింటూ .. అనేకానేక రోగాల బారిన పడుతున్నారు. ఇలా సర్వదుఃఖాలకూ మూలకారణం అయిన ఈ మాంసభక్షన ను తక్షణం నిరసించాలి! జీవహింసను ప్రోత్సహించే సకల అనర్థాలనూ నిరోధించాలి. అప్పుడే ఉత్తమసమాజం రూపొందించబడి ఈ భూమిపై సకల శాంతి సౌభాగ్యాలు విస్తారంగా వెల్లివిరుస్తాయి. ఈ సత్యాలన్నీ తెలియజేస్తూ “సత్యయుగ కాంతి కార్యకర్తలు” గా చరిత్రలో ఇంతవరకూ ఎంతో మంది ఈ భూమి మీదకు వచ్చారు; ఇక ముందు కూడా వస్తారు! అందరిపట్లా స్నేహపాత్రులై వుంటూ, కరుణను కురిపించే ఈ సత్యయుగ కాంతి కార్యకర్తలంతా కూడా ఆ మైత్రేయబుద్ధుడి ప్రతిరూపాలే. ఆ మైత్రేయ బుద్ధుళ్ళందరికీ శతకోటి ధ్యానాభివందనాలు!!