ముక్తిమార్గం

 

ఈ భూమి మీద జన్మతీసుకున్న వాళ్ళంతా కూడా ప్రతిక్షణం ఆనందంగా జీవించాలి అన్నదే సృష్టి నియమం! అలా జీవించాలి అంటే మన శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా, తేజోవంతంగా వుండాలి ; మన మనస్సు ఎప్పుడు హాయిగా, శాంతంగా వుండాలి; మన బుద్ధి ఎప్పుడూ సునిశితంగా, సత్యాన్ని చూపేదిగా వుండాలి.

ఎప్పుడైతే మన బుద్ధి సునిశితంగా వుండదో .. సత్యాన్ని చూపేదిగా మనలేదో .. అప్పుడు మన మనస్సు మలమై, అశుభ్రమైపోతుంది. అలా మలమైన, అశుభ్రమైన మనస్సు ప్రభావం శరీరం పై పడి .. శరీరం అనేక రోగాలకు నిలయంగా మారి .. మనకు అనేకానేక దుఃఖాలను కలుగజేస్తుంది. జన్మ జన్మలుగా జరుగుతోన్న తంతు ఇదే ..

ఇలాంటి అనేకానేక దుఃఖాల బారినుంచి మనం తక్షణం విడుదల కావాలి మరి ఆ విడుదలనే ముక్తి అంటాం. ముక్తి అన్నా మోక్షం అన్నా, నిశ్రేయస్సుఅన్నా, సాల్వేషన్ అన్నా అపవర్గం అన్నా అర్థం తక్షణం విడుదల కావడం.

మనం శారీరక పరమైన రోగాల నుంచి విడుదల కావాలి ; మానసిక పరమైన రుగ్మతల నుంచి విడుదల కావాలి; బుద్ధి పరమైన మాంద్యం నుంచి విడుదల కావాలి. ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికన జరగాలి. అలాంటి శాశ్వత ముక్తి మాత్రమే దుఃఖంలో పడి కొట్టుకుంటోన్న మనల్ని జన్మ పరంపర చట్రం లో నుంచి బయటికి తేగలుగుతుంది.

ప్రాచీన భారత సాంప్రదాయానికి చెందిన కపిల మహాఋషి త్రివిధ దుఃఖం అత్యంత నివృత్తి : అత్యంత పురుషార్థ అన్నారు. అంటే .. చతుర్విధ పురుషార్థాలైన కామ, అర్థ, ధర్మ, మోక్షాల్లోని నాలుగవ పురుషార్థం అయిన మోక్షం అన్నది మనల్ని త్రివిధ దుఃఖాల నుంచి పూర్తిగా విడుదల చేస్తుంది కనుక అదే అత్యంత శ్రేష్టమైన పురుషార్థం అని వారి ప్రభోధం

భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముల వారు కూడా త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యోభవార్జున అంటూ ” అర్జునా, నువ్వు మూడు గుణాలతో కలిసివున్నావు కనుక ముందు గుణాతీతుడువు కా .. తమోగుణం నుంచి విముక్తి పొందు ; రజోగుణం నుంచి విముక్తిపొంది గుణాతీతుడవి కా, అప్పుడే నువ్వు .. మూడు రకాల దుఃఖాల నుంచి బయటపడతావు. ” అంటూ అర్జునుడి ద్వారా సకల మానవాళికి దివ్యసందేశాన్ని ఇచ్చారు.

కాబట్టి మనమంతా కూడా మూడు రకాల గుణదోషాలతో కూడిన దుఃఖాలు అంటే .. శారీరక పరమైన తమోగుణదోష దుఃఖాల నుంచీ, మానసిక పరమైన రజోగుణ దోషదుఃఖాల నుంచీ మరి బుద్ధిపరమైన సత్వగుణ దోషదుఃఖాల నుంచీ బయటపడాలి.

శారీరకపరమైన దుఃఖాలు అంటే .. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు వచ్చే రోగాల నుంచి బయటపడాలి. మానసిక పరమైన దుఃఖాలు అంటే .. ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం ; ఎవరైనా అవమానిస్తే కృంగిపోయి బి.పి లు తెచ్చుకోవడం వంటి సకల మూర్ఖత్వాల నుంచీ బయటపడాలి. బుద్ధిపరమైన దుఃఖాలు అంటే బుద్ధిమాంద్యత అన్నది లేకుండా చక్కటి ఏకాగ్రతా శక్తితో కూడుకున్న అద్భుతమైన జ్ఞాపకశక్తితో వుండాలి. మన గత జన్మలను గురించిన సమాచారం అంతా మనం తెలుసుకుని ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మనం అర్జునుడు వంటి త్రిగుణాతీతుల్లా పరిమార్చబడి .. సకల గుణదోష విముక్తలమై దుఃఖరాహిత్యస్థితిని పొందగలుగుతాము.

జీసస్‌క్రైస్ట్ కూడా ” దేవునిరాజ్యం వెతకండి ; ఆ యొక్క ధర్మంలో జీవించండి ; అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి ” అని సెలవిచ్చారు. కావలసినవన్నీ అంటే .. శరీర ఆరోగ్యం .. మానసిక ప్రశాంతత .. బుద్ధి సునిశిత .. ఇలా మనకు కావలసినవన్నీ పొందినప్పుడే మనం దుఃఖం నుంచి విడుదల అయ్యి ముక్తిని పొందుతాం.

 

నిర్వాణం – పరినిర్వాణం – మహాపరినిర్వాణం

 

గౌతమ బుద్ధుడు ఈ ముక్తిని .. నిర్వాణం అని వివరణ ఇస్తూ ఇందులో మళ్ళీ మూడు దశలు వున్నాయి అన్నారు.

నిర్వాణం : మనం మన స్వంత జీవితంలో శారీరకపరమైన దుఃఖాలు ఏవీ లేకుండా, మానసిక పరమైన దుఃఖాలు ఏవీ లేకుండా, బుద్ధిపరమైన అస్పష్టతలు ఏవీ లేకుండా ఉంటేనే మనం ముక్తిని లేదా నిర్వాణాన్ని పొందగలుగుతాం.

పరినిర్వాణం : అయితే కేవలం మనం ఒక్కళ్ళం నిర్వాణం పొందితే లాభం లేదు. మన చుట్టుప్రక్కల వున్న వాళ్ళు కూడా నిర్వాణం పొందాలి. మన చుట్టు ప్రక్కల వున్న వాళ్ళు దుఃఖిస్తూ వుంటే మనకు ఎంత మాత్రం బాగుండదు పైగా వాళ్ళంతా దుఃఖంగా వుంటే వాళ్ళ దుఃఖం మన దుఃఖంగా పరిణమిస్తుంది. కనుక .. మనం మన చుట్టు ప్రక్కల వాళ్ళ దుఃఖరహిత్యం కోసం పాటుపడాలి. నిర్వాణం పొందిన మనం ఇతరుల నిర్వాణం కోసం పనిచెయ్యడాన్ని పరినిర్వాణం అంటాం. దానినే పరిముక్తి అని కూడా అంటాం.

మహాపరినిర్వాణం : మన చుట్టు ప్రక్కలవాళ్ళు అంటే కేవలం కొంత పరిధిమేరకు వున్నవాళ్ళు మాత్రమే దుఃఖరాహిత్యంలో వుంటే సరిపోదు. మన ప్రక్కదేశం వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళ ప్రక్కదేశం వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళు కూడా సకల దుఃఖాల నుంచి విముక్తం కాబడాలి.

ఇలా ప్రపంచం మొత్తంలో నుంచి కూడా దుఃఖాన్ని తీసివెయ్యాలి అని పరితపిస్తూ ఎవరైతే కంకణం కట్టుకుంటారో వాళ్ళు మహాపరినిర్వాణం లో .. మహాపరిముక్తస్థితి లో ఉన్న గొప్ప యోగులు. సదా మహాపరినిర్వాణంలో ఉండే వాళ్ళకి ప్రపంచం యొక్క దుఃఖమే తమ దుఃఖంగా మారుతుంది మరి మొత్తం ప్రపంచం దుఃఖం నుంచి విముక్తం పొందిననాడే వారు కూడా దుఃఖం నుంచి విముక్తి పొందుతారు. దీనినే తీర్థంకర గోత్ర బంధం అంటాం.

తీర్థంకరుడు అంటే టీచర్. ఈ టీచర్ కు టీచింగ్ చేయకపోతే దుఃఖం వస్తుంది మరి బోధనచేస్తే .. అతని దుఃఖం పోతుంది. అయితే అతడు ఏ కోద్దిమందికో బోధన చేసేసి చేతులు దులిపివేసుకోకుండా మొత్తం ప్రపంచానికే తన బోధనలను విస్తృతం చేసే సర్వ వ్యాపకత్వాన్ని కలిగివుంటాడు.

 

అరిహంత్ – బోధిసత్వుడు – బుద్ధుడు

 

మొట్టమొదట మనం మన దుఃఖం నుంచి విడుదల అయ్యి అరిహంత్ లుగా మారాలి. అరి అంటే శత్రువు .. హంత్ అంటే హతమార్చినవాడు. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలపై పట్టును సాధించడానికి .. అడ్డుపడుతూన్న మనలోని మూడు శత్రువులను హతమార్చాలి.

ఆ మూడు శత్రువులే .. మనలోని సోమరితనం అనే తమోగుణం ; అహంకారం అనే రజోగుణం మరి అతి మంచితనం అనే సాత్వికగుణం. ఈ మూడు గుణాలు కూడా మనకు శత్రువుల్లాంటివి కనుక వీటిని హతమార్చి నిర్గుణస్థితి లో విలసిల్లుతూ అరిషడ్వర్గాలపై పట్టు సాధించాలి. జీవితాన్ని ఒక ఆటలా ఆడుతూ ఆనందంగా ముందుకుసాగాలి.

ఇలా మనం అరిహంత్‌గా మారిన తరువాత మన చుట్టు ప్రక్కల వున్న వాళ్ళు కూడా అరిహంత్ లుగా మారడానికి సహాయం చేయాలి. తద్వార మనం బోధిసత్వులు గా ఎదుగుతాం. బోధిసత్వులుగా ఉంటూ ప్రపంచంలో ఉన్న అరిహంత్‍లందరినీ బోధిసత్వులుగా మారేట్లు మార్గదర్శనం చేస్తూ వారందరి ఆత్మోన్నతికి కూడా సహాయంపడుతూ ఉండాలి. అలాంటివాడే బుద్ధుడు మనం ఆ బుద్ధస్థితే మహాపరినిర్వాణ స్థితి, మహా పరిముక్తస్థితి.

 

ధ్యానసాధన

 

నిర్వాణస్థితి మనకు కేవలం ధ్యానసాధన వల్లే వస్తుంది. నిరంతర ధ్యానసాధనలో మాత్రమే మనం మనలోని సకల అనర్థాలను గురించి తెలుసుకుంటాం. మనకు జరుగుతోన్న నష్టాలను బేరీజు వేసుకుంటూ మనకు మనమే వాటిని సరిచేసుకోగలుగుతాము.

ధ్యానసాధనతో పాటు చక్కటి ఆత్మజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలను చదువుతూ స్వాధ్యాయం చేయాలి. వేదవ్యాసుడు, వాల్మీకి .. ఓషో .. రాంపా .. అనీబిసెంట్ .. యోగానంద పరమహంస .. స్వామిరామా వంటి గొప్ప గొప్ప యోగులు, విజ్ఞులు వ్రాసిన స్వీయ అనుభవాలతో కూడిన పుస్తకాలను చదవడం ద్వారా అద్భుతమైన జ్ఞానసాధన జరుగుతుంది. అలా ధ్యాన జ్ఞాన సాధనలు చేసే వారితో నిరంతరం మెలుగుతూ సజ్జనసాంగత్యం చెయ్యాలి.

ఈ మూడు రకాల సాధనల ద్వారా మనకు ఎలా మాట్లాడాలి? .. ఎలా తినాలి ?.. ఎంతవరకు నిద్రపోవాలి ? ఎంతవరకు నిద్రపోకూడదు ? .. ఎలా ఆలోచించాలి .. ఎలా ఆలోచించకూడదు ? .. కుటుంబంలో మరి సమాజంలో ఎలా జీవించాలి ? ఎలా జీవించకూడదు ? .. అన్న విషయాలన్నింటిపై సహజమైన పట్టువస్తుంది. ఈ మూడు రకాల సాధనల వల్లనే మన శరీరం నుంచి అన్ని రకాల రుగ్మతలు దూరం అవుతాయి. తలనొప్పి మొదలుకుని క్యాన్సర్ వరకు ఏ రోగాలూ ఎప్పటికీ రావు. ఎందుకంటే రోగాలకు కారణం అయిన అపరిశుభ్రమైన నాడీమండల వ్యవస్థ అంతా కూడా ధ్యాన – స్వాధ్యాయ – సజ్జనసాంగత్య సాధనల వల్ల పరిశుద్ధం కాబడుతుంది.

పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే అన్నట్లు .. మన అనేకానేక జన్మల నుంచి మోస్తోన్న కర్మఫలితాలన్నీ శారీరక వ్యాధుల రూపంలో బయటికి వస్తూంటాయి. అవన్నీ కూడా ధ్యానశక్తివల్ల ప్రక్షాళన అయిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరడం ద్వారా అన్ని రకాల మానసిక రుగ్మతలనుంచి బయట పడి .. మానావమానాలను సమంగా స్వీకరించే అధిమానస స్థాయికి మనం చేరుతాం. మన గత జన్మల సమాచారం అంతా కూడా అద్భుతంగా మన కళ్ళముందే సాక్షాత్కరించడంతో .. ఆత్మ సత్యాన్ని అవగతం చేసుకుంటాం.

సజ్జన సాంగత్యాదుల్లో…బుద్ధిపరమైన జ్ఞానం పెరుగుతుంది. దానివల్ల మనకన్నా గొప్ప వాళ్ళు కూడా అతి సామాన్యుల్లా మనముందు తిరుగుతూ వుండడం చూసి వినమ్రత అన్నది విశేషంగా అర్థం చేసుకుంటాం. వినమ్రత అన్నది లేని చోట గర్వం వచ్చేస్తుంది!

పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడూ ధ్యానం చేస్తూ నిరంతర స్వాధ్యాయం చేస్తూ, సజ్జనసాంగత్యాలు చేస్తుంటారు. తాము అలా చేస్తూ, ఇతరులతో కూడా చేయిస్తూ ఎల్లప్పుడూ మహాపరిముక్తస్థితిలో ఉంటారు. ఇలా ఈ భూమ్మీద పుట్టి తమ పనిని సంపూర్ణంగా పూర్తిచేసుకునే వాళ్ళకు ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం వుండదు.

అరిహంత్‌గా చనిపోయినా మళ్ళీ పుట్టాల్సిందే; బోధిసత్వుడిగా చనిపోయినా మళ్ళీ పుట్టాల్సిందే; బుద్ధుడిగా ఎదిగే వరకు ఆ జన్మపరంపర అలా కొనసాగుతూనే వుంటుంది. జన్మరాహిత్యస్థితిని పొందిన జగద్గురువులు బుద్ధత్వపు స్థితిని పొంది ఆ స్థితిలోనే జీవిస్తూ అదే స్థితిలో తమ తుది శ్వాసను వదిలిపెట్టేస్తారు! జీసస్ క్రైస్ట్ స్థితి .. శ్రీకృష్ణుడి స్థితి .. మహావీరుడి స్థితి .. మరి జొరాస్టర్ స్థితి .. అన్నీ కూడా బుద్ధత్వపు స్థితులే!

భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్ములవారు…

“బహూని మే వ్యతీతాని జన్మానితవ చార్జున
తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప”

… (భ, 4-5)

అర్జునా! నువ్వూ-నేను ఎన్నో జన్మలు ఎత్తాం! అయితే నాకు నా జన్మలతోపాటు నీ జన్మలను గురించి కూడా తెలుసు! నీకే ఏమి తెలియదు” అంటూ జన్మపరంపరా జ్ఞానం యొక్క గుట్టును విప్పి చెప్పారు.

ఈ జన్మపరంపరా జ్ఞానమే ముక్తి. ఈ జ్ఞానం వల్ల “నేను అశాశ్వతమైన దేహంలో నివసిస్తోన్న శాశ్వతమైన ఆత్మను” అన్న కర్మసిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకుంటాం. “నా వాస్తవానికి నేనే సృష్టికర్తను కనుక నా సంకల్పశక్తి ద్వారా నేను నా వాస్తవాన్ని మార్చుకుని ఈ జన్మకర్మపరంపరా చట్రంలోంచి బయటపడతాను” అన్న జ్ఞానాన్ని పొంది తక్షణం అందులోంచి విడుదల కావడానికి సాధన చేస్తాం.

ఇలాంటి ముక్తస్థితి మనకు ప్రార్థన ద్వారానో, భజనల ద్వారానో, తీర్థయాత్రలు చేయడం ద్వారానో, గురువుల పాదసేవనం చేయడం ద్వారానో విగ్రహారాధన ద్వారానో లేదా మంత్రోచ్ఛారణ చేయడం ద్వారానో రాదు. ఇది ధ్యానంలో మనం మన స్థూలశరీరం నుంచి బయటికి వచ్చి మన సూక్ష్మశరీరంతో విహరిస్తూ సూక్ష్మలోకాల అనుభావలు పొందడం ద్వారా వస్తుంది. సూక్ష్మశరీరం నుంచి కూడా విడివడి కారణశరీరంతో విహరిస్తూ కారణలోకాల అనుభవాలు పొందడం ద్వారా వస్తుంది. అటుపిమ్మట కారణశరీరం లోంచి కూడా బయటికి వచ్చి మహాకారణ శరీరంతో మహాకారణలోకాల్లో విహరిస్తూ అక్కడి అనుభవాలను కూడా పొందుతూంటే వస్తుంది. మహాకారణ లోకాల్లో మనకు ఈ సృష్టి యొక్క పూర్ణరూపం అనుభవపూర్వకంగా అవగతం అవుతుంది.

ఇంత తతంగం జరిగితే కానీ మనకు ముక్త స్థితి లభించదు కనుక.. నేను కేవలం శరీరాన్ని మాత్రమే అనుకుంటూ హే భగవాన్! నాకు మోక్షాన్ని ఇవ్వు! అనగానే ఇచ్చేయడానికి ..ఏ దేవుడూ దిగిరాడు!

“నన్ను ఎవరో పుట్టించారు ; నాకు ఎవరో మార్గం చూపిస్తారు; నన్ను ఎవరో కాపాడుతారు; నా స్థితికి తల్లితండ్రులో దేవుడో కారణం” అనుకున్నంతకాలం మనం దుఃఖంతో కూడుకున్న బంధంలోనే వుంటాం! ముక్తస్థితిలో వున్నవాళ్ళు తమ మీద తాము జాలిపడరు; ఇతరుల మీద కూడా జాలిపడరు. ఎవరికి ఏం కావాలో ఇవ్వడంలో నిమగ్నంలో నిమగ్నం అవుతూ.. తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వుంటారు.

జాలి పడడం అన్నది మన సమయంతో పాటు ఇతరుల సమయాన్ని కూడా వృధా చేస్తుంది.. కనుక ఒక మాస్టర్ ఇతరుల పట్ల జాలిపడుతూ ఉండడం మాని “ఊరికే ఎందుకు బాధపడతావు? ఊరికే ఎందుకు ఆలోచిస్తావు? కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాసపెట్టి ధ్యానం చెయ్యి. చక్కగా చిత్త నివృత్తి చేసుకుని విశ్వశక్తిని ఆవాహన చేసుకో.. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకో..పలానా పుస్తకం చదువుకో” అంటూ వారిచే సరియైన సాధన చేయిస్తాడు. అంతేకానీ “అయ్యో! ఇలా అయ్యిందా? అలా కాకూడదే” అంటూ పనికిమాలిన అపరిపక్వమైన మాటలు ఎప్పుడూ మాట్లాడడు.

నోట్లోంచి ఒక్క మాటైనా అపరిపక్వంగా వచ్చింది అంటే వాడికి ముక్తస్థితి లేదన్నమాటే! అలాగే ఇతరులు కూడా అశాస్రీయమైన, అపరిపక్వమైన మాటలు మాట్లాడుతూ వుంటే వింటూ ఊరుకున్నవాడు కూడా తనకు తానుగా ముక్త స్థితిలో ఉన్నప్పటికీ పరిముక్తస్థితికి ఎదగనట్లే! “సంఘంలో కుళ్ళు ఎలా వుంటే నాకు ఎందుకులే .. నా వరకు నేను ముక్త స్థితిని పొందేసాను” అనుకుంటే వాడు ఎప్పటికీ దుఃఖరాహిత్యాన్ని పొందలేడు. పరిముక్తి, మహాపరిముక్తి పొందేవరకు అతడు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే.

కుళ్ళును ఎప్పటికప్పుడు కడిగివేస్తూనే వుండాలి. ఎవరయినా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ వుంటే.. “నోరు మూసుకుని మౌనంగా కూర్చుని ధ్యానం చెయ్యి” అని చెప్పాలి. పనికిరాని పనులు అంటే మాంసాహార భక్షణచేస్తూంటే అది అశాస్త్రీయం అని చెప్పాలి. చెప్పినా వినకపోతే వాడి ఖర్మ తెలిసినా చెప్పకపోతే మన ఖర్మ.

“ముక్తాభిమానీ ముక్తో హి బద్ధాభిమానీ బద్ధోహి
కిం వదంతీహ సత్యేయం యా మతిః సా గతిర్భవేత్”

అని అష్టావక్రుడు చెప్పినట్లు.. ముక్తస్థితిని అభిమానించే వాడు శాస్త్రీయమైన పద్ధతిని అనుసరిస్తే ముక్తుడు అవుతాడు. బంధాన్ని అభిమానించే వాడు బద్ధుడె అవుతాడు.

యా మతిః సా గతిర్భవేత్.. అన్నట్లు మన మతిని బట్టే మన గతి వుంటుంది అన్న ఆర్యోక్తిని ఎరుకలో ఉంచుకుని ఇప్పుడేం చేస్తాంలే అనుకోకుండా తక్షణం ముక్తస్థితికోసం సాధన చేయాలి. పరిసాధన చెయ్యాలి.. మహా పరి సాధన చెయ్యాలి..ప్రపంచమంతా కూడా మనలాగే దుఃఖరాహిత్యస్థితిని పొందేంతవరకు అలా చేస్తూనే వుండాలి!!