“మూడు సత్యాలు”

 

‘ఆధ్యాత్మిక జీవితం’ … అది ఎవరిదైనా నిజంగా ఎంత హాయిగా వుంటుంది. ఎప్పటికప్పుడు తనకు తాను ‘చెక్’ చేసుకుంటూ, తన గుణగణాలను మెరుగు పెట్టుకొంటూ, తానున్న పరిస్థితులలోనే శాశ్వత ప్రయోజనాలకై కృషి చేస్తూ సాగిపోయే ఆ జీవిత గమనం యొక్క రహదారి దివ్యంగా ఉండదూ, మరి.

సరే …, ఇప్పుడు ఓ సత్య సిద్ధాంతాన్ని చూద్దాం.

We Won’t Get What We Desire,

…We Will Get only What We Deserve.

“మనం కోరుకున్నది మనకు లభించదు, … మనకు అర్హమైనదే మనకు లభిస్తుంది.”

వేటినైతే మనం ఆశిస్తూ, కోరుకుంటూ ఉంటామో అవన్నీ మనవైపోవడం లేదు. వాస్తవానికి దేనిని పొందేందుకైతే మనకు అర్హత ఉంటుందో అది మాత్రవే మనదవుతోంది.

ఇంకొంచెం ముందుకు పోయి

… ఇంకొంచెం లోతైన రెండవ సత్యాన్ని తెలుసుకుందాం:

We Won’t Get What We Deserve,

…We will Get Only What We Need.

“అర్హమైనది దక్కక పోవచ్చు గానీ … మన నిజమైన అవసరం మాత్రం తప్పకుండా తీరుతుంది.”

“నేనంటే ఈ కనిపించే భౌతిక శరీరం మాత్రమే” అనిపించే భ్రమ నుంచి “నేనంటే ఈ దృశ్య ప్రపంచానికి ఆధారమైన ఆత్మ స్వరూపాన్ని” అన్న అవగాహన వచ్చిన తర్వాత ఆత్మ పరిణతిని మించిన శ్రేయస్సు ఇంకేముంటుంది? అంచేత ఇక అప్పటినుంచి అర్హత ఉంది కదా అని వర్తమాన ఆధ్యాత్మిక జీవితానికి అంతగా ఉపయోగించని భౌతిక జీవిత కోరికలు మనకు తీరవు. కేవలం, ఏవేవి లభిస్తే మన ‘ఆధ్యాత్మిక ఎదుగుదల’ మరింత ఎక్కువుగా సాధ్యపడుతుందో, అటువంటివి మాత్రమే మనవౌతాయి.

ఇకముందుకుపోయి అత్యంత లోతైన మూడో సత్య సిద్ధాంతాన్ని చూద్ధాం.

We Won`t Get What We Need,

… We Will Get Only Those Have That Are Needed For The Society Through Us.

“మన అవసరాలు తీరకపోవచ్చుగానీ … మన ద్వారా సమాజ ప్రగతికి అవసరాలేవేవైతే వున్నాయో అవి మటుకు తప్పకుండా తీరుతాయి.”

ధ్యానిగా, యోగిగా తన జీవిత వైచిత్రాన్ని అంతరంగంలోకి వీక్షించుకున్న ఒకానొక ‘ఆత్మజ్ఞాని’కి, ఏ భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలైనా ప్రత్యేకించి ఏముంటాయి? తనలోని బ్రహ్మ పదార్ధమే సకల జీవరాశిలోనూ స్థితమై భాసిల్లుతోందని గ్రహించిన బ్రహ్మజ్ఞాని కి ‘స్వంత పరిణితి’ అంటూ విడిగా ఏముంటుంది?

తన వాతావరణాన్నీ, సమాజాన్నీ అన్ని విధాలా ఉద్ధరించే కార్యక్రమంలో అంకిత భావంతో మునిగి ఉంటాడు నిజమైన జ్ఞాని. అప్పుడు “నా ద్వారా ఏం జరిగితే అది సమాజ ప్రగతికి తోడ్పడుతుందో అవి మాత్రమే నాకు లభిస్తూంటాయి.” అన్న సద్యోస్ఫూర్తి కలిగి వుంటాడు.