“మరణానంతర జీవితం”

 

ఆత్మకు ‘చావు’ అన్నది లేదు!

ఈ సత్యాన్ని ఆత్మస్వరూపులమైన మనం అంతా కూడా ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి.

ఈ సత్యం తెలుసుకోలేని సగటు మానవుడు .. ఏ కడుపు నొప్పితోనో .. ఏ క్యాన్సర్ జబ్బుతోనో చనిపోయిన తరువాత .. తాను పోయాడనుకుని తన శవం ప్రక్కనే కూర్చుని ఏడుస్తూన్న భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. “నేను ఇక్కడే ఉన్నాను కదే! .. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకు కడుపు నొప్పీ లేదు .. క్యాన్సర్ జబ్బూ లేదు చూడు” అంటూ .. అటూ ఇటూ ఖంగారుగా తిరుగుతూ ఆమెను ఓదర్చడానికి ప్రయత్నిస్తూంటాడు.

“అసలు నా వాళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు?” అని వాడికి పెద్ద సంశయం! అందరివైపు చూస్తూంటాడు కానీ .. వాడిని ఎవ్వరూ పట్టించుకోరు! “అయ్యో పోయాడు” అంటూ వాళ్ళ ఏడ్పులే వాళ్ళు ఏడుస్తూంటారు! ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు బ్రతికి ఉన్నవాళ్ళంతా బేషుగ్గా కనపడతారు. కానీ బ్రతికి ఉన్నవాళ్ళ కళ్ళకు మాత్రం చనిపోయిన వాళ్ళు కనబడరు.

చనిపోయిన వాళ్ళకు బ్రతికి ఉన్నవాళ్ళంతా దృశ్యం అయితే .. బ్రతికి ఉన్న సగటు మానవులకు చనిపోయిన వాళ్ళంతా కూడా అదృశ్యులు! అందుకే చనిపోకముందే ధ్యానం చేసి “మన దివ్యనేత్రాన్ని తెరిపించుకుని” ఆ యా లోకాలన్నీ తిరిగి .. అక్కడి విశేషాలన్నీ ముందే తెలుసుకుని రావాలి. అలాచేస్తే భౌతిక నేత్రాలకు అదృశ్యులుగా ఉన్న వాళ్ళంతా మనకు బ్రతికి ఉన్నప్పుడే దృశ్యులుగా కనబడతారు! వాళ్ళంతా ఏ స్థితిలో ఉన్నారో అర్థం అవుతుంది. ఇదంతా కూడా “సరస్వతీ జ్ఞానం” అని పిలువబడుతుంది.

“సరస్వతీ నది” కంటికి కనిపించదు. అలాగే మరణానంతర జీవిత విజ్ఞానం కూడా మామూలు కంటికి గోచరించదు. ధ్యానం చేసి దివ్యచక్షువుతో తెలుసుకోవాలి. లేకపోతే చనిపోయిన తరువాత కూడా ఎర్త్‌బౌండ్ సోల్స్‌గా తమ పార్థీవశరీరం చుట్టూ .. తమవాళ్ళ చుట్టూ .. అయోమయంగా తిరిగాల్సి వస్తుంది. జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న ఇళ్ళనూ, వాకిళ్ళనూ పట్టుకుని వ్రేళ్ళాడుతూ తమ సమయాన్ని .. బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తరువాత కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు.

కనుక, ఎవ్వరు నవ్వినా .. ఎవ్వరు ఏడ్చినా .. తనకేమీపట్టనట్లు చనిపోకముందే సరస్వతీ జ్ఞాన సముపార్జన చెయ్యాలి. అలా చేసినవాళ్ళే .. ఇక్కడి తమ ప్రాపంచిక కర్తవ్యాలను చక్కగా నెరవేర్చుకుని .. చనిపోయాక హాయిగా నవ్వుకుంటూ పై లోకాలకు వెళ్ళిపోతారు!

ఆ తరువాత అక్కడ వారు భూలోకంలో వేటికోసమైతే నానా అగచాట్లు పడ్డారో అవన్నీ క్షణాలలో పొందేస్తారు. డబ్బూ, బంగళాలూ, బంగారం, వజ్రాలూ, వైఢూర్యాలూ, నాట్యాలూ, గానాలూ, భజనలూ, పంచభక్ష్య పరమాన్నాలూ .. ఇలా ఏది తలచుకుంటే అది వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతూ ఉండడంతో .. వాళ్ళకు కొంత కాలానికే అక్కడి జీవితం వెగటు పుడుతుంది.

అప్పుడు మళ్ళీ ఉన్నత లోకాల మాస్టర్లను తలుచుకుని “ఇంకా ఇంతకంటే గొప్పవైన లోకాలు ఏవైనా ఉన్నాయా!? అక్కడ ఇంతకంటే గొప్ప విశేషాలు ఉంటాయా!? అంటూ ‘ఆరా’ తీస్తారు!

దానికి వాళ్ళు “ఓ యబ్బ! మీరు చూడనివి ఇంకా లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి! ఇంకా క్రొత్త క్రొత్త లోకాలు పుడుతూనే ఉంటాయి. కాకపోతే నువ్వు సంపాదించిన ఆత్మజ్ఞానానికి ఈ లోకం వరకే రాగలిగావు! ఇంతకంటే పైలోకాలకు వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ భూలోకానికి వెళ్ళీ .. అక్కడే కొన్ని ఛాలెంజ్‌లను ఎదుర్కొని ఇంకొంచెం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని రావల్సిందే” అని తేల్చి చెబుతారు.

అలా భూలోకం (౩-D Universe ), భువర్లోకం (Lower Astral Universe), సువర్లోకం(Higher Astral Universe), జనాలోకం, మహాలోకం(Causal Universe) తపోలోకం(Supra Causal Universe) అన్నీ దాటుకుంటూ వాళ్ళు సత్యలోకం చేరుకోవాలి. అదే ఆత్మ యొక్క గమ్యం!

ఇదంతా తెలుసుకోకుండానే భూలోకంలో తమ జన్మలను గడిపేసిన వాళ్ళంతా కూడా తాపీగా భువర్లోకానికి చేరుకుంటారు.

అక్కడ తాము చేసిన తప్పులను గుర్తించుకుని .. “ఈసారైనా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను” అనుకుని మళ్ళీ భూమి మీదకు వస్తారు. భూలోకంలో ‘అన్నదానం’ .. ‘గోదానం’ .. ‘భూదానం’ వంటి కాస్త గొప్ప గొప్ప పనులు చేసి సువర్లోకానికి వెళ్ళిపోతారు!

అక్కడ తమ జన్మకారణాలను మరింత విస్తారంగా తెలుసుకుని మళ్ళీ భూలోక జన్మల ద్వారా జనాలోకానికి చేరుకుంటారు.

“ఇప్పుడేం చెయ్యాలి?” అని ఆలోచించుకుంటూ సత్యలోకం నుంచి వెలుగు రూపంలో వచ్చిన మాస్టర్ల నుంచి గొప్ప గొప్ప బోధనలు అందుకుంటారు. అప్పుడు తాము మళ్ళీ భూలోకానికి వెళ్ళి చెయ్యాల్సిన పనులను గురించి తెలుసుకుని మళ్ళీ ప్రయాణానికి సన్నద్ధం అవుతారు.

చదువు పూర్తి అయ్యాక బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోన్న ఒకానొక గుమస్తా .. ఒకానొక ‘ఆఫీసర్’ గా ప్రమోషన్ పొందడానికి మళ్ళీ మళ్ళీ ఇన్‌సర్వీస్ పరీక్షలు వ్రాసినట్లు వీళ్ళు .. తాము ధ్యానం చేసుకుంటూ అనేక మందికి ధ్యానం నేర్పించి .. ఇతర పైలోకాలకు అంటే మహాలోకాలకు వెళ్ళిపోతారు.

అక్కడ ఇంకా గొప్ప జీవిత ప్రణాళికలను రచించుకుని .. మళ్ళీ భూలోకానికి వచ్చి అన్ని లోకాల వాళ్ళతో కలిసి సమన్వయంతో పని చేస్తూ వారి ఆత్మ పరిణామాన్ని ఉన్నతీకరిస్తూ .. క్రమక్రమంగా సత్యలోకానికి చేరుకుంటారు. ఇలా అనేకమార్లు రకరకాల లోకాల వాళ్ళతో కలిసి సమన్వయంతో పని చేస్తూ వారి ఆత్మ పరిణామాన్ని ఉన్నతీకరిస్తూ .. క్రమక్రమంగా సత్యలోకానికి చేరుకుంటారు.

అలాంటి వాళ్ళకు ‘అవసరం’ అనుకుంటే తప్ప ఇక మళ్ళీ భూలోకానికి దిగి రావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వచ్చినా .. వారు నిర్గుణస్థితిలోనే ఉంటూ అతి ఖచ్చితంగా విశ్వకళ్యాణంలో నిమగ్నమై క్రొత్త క్రొత్త ఇతర లోకాలను సృష్టిస్తూ ఉంటారు! ఒక్కోసారి వాళ్ళు అక్కడే కూర్చుని కూడా ఇక్కడి కార్యక్రమాలను చక్కబెడుతూనే .. ఇంకా ఇంకా క్రొత్త క్రొత్త లోకాలను సృష్టిస్తూ ఉంటారు!

పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఇలా సత్యలోక వాసులుగా ఉంటూ సృష్టికి ‘ప్రతిసృష్టి’ చేస్తోన్న విశేష ఆత్మలు! వాళ్ళందరికీ నా అభినందనలు!!”