మనవల్ల ఒక్కరు బాగుపడినా చాలు

 

“మన జీవితాలను మనమే ఎన్నుకున్నాం! ఎన్నుకుని ఇక్కడికి .. ఈ భూమండలం మీదకు వచ్చాం. మన తల్లితండ్రులను మనమే ఎన్నుకుని వచ్చాం. మన పిల్లలు కూడా మనల్నే తమ తల్లితండ్రులుగా ఎన్నుకుని వచ్చారు.

“ఇక్కడ ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, అన్నది కూడా మనమే ఎన్నుకున్నాం. భారతదేశంలో పుట్టాలా? అమెరికాలో పుట్టాలా అన్నది కూడా మన ఎంపికే!

“ఇక్కడ ఈ ధ్యానమహాచక్రానికి రావాలనీ .. వచ్చాక ప్రొద్దున్నే చలిలో ధ్యానం చేద్దామా వద్దా అన్నది కూదా మనమే ఎన్నుకున్నాం. ఇక్కడ ఇంట్లో ఉన్నంత సౌకర్యం ఉండదు. ఎంత అసౌకర్యంగా ఉన్నా సరే .. కష్టం అనిపించినా సరే .. ‘చక్కగా ధ్యానం చేసుకుందాం’ అనుకుని మరీ వచ్చాం.

“ఇక్కడ మన జీవితాలకు మనమే కర్తలం! ‘ఈ జన్మ తరువాత ఇంకో జన్మ కావాలా? వద్దా?’ అని నిర్ణయించుకునేదీ మనమే! అసత్యం నుంచి సత్యం వైపుకూ మరి అంధకారం నుంచి వెలుతురు వైపుకు మనల్ని నడిపించుకునేదీ మనమే.

“ఇలా జీవితంలో ఏమేం చెయ్యాలో అవన్నీ మనమే ఎన్నుకుని వచ్చాం కనుక ‘మన దగ్గరికి వచ్చేవన్నీ కూడా మన ఎంపికలే’ అని మరచిపోకూడదు. కోరుకోకపోతే ఏదీ రాదు. Everything is our will and desire. ఈ జన్మలో మనం ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్పాలనీ .. అన్ని చోట్లా పిరమిడ్‌లు కట్టాలనీ, అందరూ శాకాహారులు కావాలనీ, అందరూ యోగులు కావాలనీ ఎన్నుకుని ఈ భూమి మీదకు వచ్చాం. ఒకానొక పర్యాటక కేంద్రానికి వెళ్ళినట్లు ఊరికే ఈ భూలోకాన్ని ‘చూసి’ పోవడానికి రాలేదు. ఎంపికలు చేసుకున్నవన్నీ ‘చేసి’ పోవడానికే వచ్చాం.

“మన ఈ జీవన క్రమంలో మన వల్ల ఒక్కరు బాగుపడినా చాలు .. అదే మనకెంతో అదృష్టం!”