“మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి”

 

“జీవితంలో ఎవరైనా సరే పరిపక్వతను సాధించాలి” అనుకుంటే మాత్రం .. వారు వెంటనే బుద్ధుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించడం మొదలుపెట్టాలి. అప్పుడే తమ తమ ఆత్మ ప్రగతిపథంలో అగ్రగామిగా వారు దూసుకెళ్తారు!

దుఃఖ నివారణా మార్గాన్ని కనుగొనడానికి సకల రాజ్యసంపదలనూ తృణప్రాయంగా వదిలి వేసి విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టిన గౌతముడు .. అనేకానేక వ్యయప్రయాసల తరువాత చివరికి బుద్ధగయకు చేరుకున్నాడు.

అక్కడ ఒక బోధివృక్షం క్రింద కూర్చొని “ఆనాపానసతి” ధ్యానమగ్నుడై .. ఒకే ఒక్క రాత్రిలో దుఃఖానికి కారణాన్ని మరి దుఃఖ నివారణోపాయాన్నీ కనుగొన్నాడు. అంతే .. ! ఇక తెల్లవారేసరికి దివ్యజ్ఞానప్రకాశం తో వెలిగిపోయాడు! బ్రహ్మానందం తో పులకించిపోయాడు !

కానీ ఆ వెంటనే ..

“ఇంత కఠినమైన దానిని సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డాను! ఇంత సహనంగా .. ఇంత నేర్పుగా .. మరి ఎంతమంది నాలా సత్యాన్ని తెలుసుకోగలుగుతారు? ఏదో ఒకనాటికి నేను ఈలోకం నుంచి నిష్క్రమిస్తాను ! అప్పుడు దీనిని నేనొక్కడినే తెలుసుకోవడం వల్ల లాభం ఏమీ ఉండదు కదా?! ” అంటూ కొంత నిస్పృహ చెందాడు.

వెంటనే అతనికి ఒకానొక దివ్యపురుషుడు దర్శనం ఇచ్చి “నిజమే! నీలాంటి వాడు ఉండడం కష్టమే! కానీ నువ్వు ఇలా నిస్పృహ చెందడం వల్ల లాభం ఏమీ ఉండదు. నీలో ఎంతో శక్తి వుంది. వెళ్ళి నువ్వు కనుగొన్న సత్యాన్ని లక్షమందికి చెప్పు!”

“అందులో ఒక్కడయినా నీలాంటి వాడు ఉంటాడు. నువ్వు చెప్పకపోతే ఆ ఒక్కడు కూడా సత్యాన్ని తెలుసుకోకుండానే పోతాడు. వాడు మళ్ళీ పుట్టి .. ఇదంతా స్వంతంగా తెలుసుకోవడానికి ఇంకా ఎంతో కష్టపడాలి. కనుక నువ్వు మరేమి ఆలోచించకుండా .. ధ్యాన ప్రచారానికి బయలుదేరు” అని చెప్పాడు!

అదే తన తక్షణకర్తవ్యంగా భావించిన గౌతమబుద్ధుడు “ఆనాపానసతి ధ్యానం” ద్వారా తాను సంపాదించుకున్న “దివ్యచక్షువు” తో తన తోటిశిష్యులు ఎక్కడెక్కడ వున్నారో చూసుకుని .. వారిని వెతికి పట్టుకుని వారికి ధ్యానం నేర్పి మరి వారితో కలిసి మరింత ఉత్సాహంతో ధ్యానప్రచారం చేస్తూ వెళ్ళడు! తన చిట్టచివరి శ్వాస వరకు కర్తవ్యదీక్షలోనే గడిపాడు!

“అప్పమత్తో హి ఝూయన్తో పప్పోతి విపులం సుఖమ్” .. అంటూ “అప్రమత్తుడై ధ్యానం చేసేవాడు విపులమైన సుఖం పొందుతాడు” అంటూ ” జీవితంలో ధ్యానసాధనకే పెద్ద పీట వేసిన బుద్దుడు .. “బుద్ధత్వం అంటే ఎప్పటికప్పుడు ‘నన్ను నేనే రక్షించుకోవాలి’ .. ‘నన్ను నేనే పరీక్షించుకోవాలి’ .. ‘నన్ను నేనే నడిపించుకోవాలి’ అన్న జాగరూకతను పెంపొందించుకోవడమే” అని విశేషంగా బోధించాడు.

‘మైత్రి’ .. ‘కరుణ’ .. ‘ముదితం’ .. ‘ఉపేక్ష’ అనే నాలుగు “బ్రహ్మవిహారాలను” బుద్ధుడు విశేషంగా ప్రవచించాడు.

ఒకానొక మహా బ్రహ్మజ్ఞాని అయిన బుద్ధుడు తెలిపిన సమాజంలో చరించే శాస్త్రీయ వ్యవహార పద్ధతులు అయిన ఈ బ్రహ్మవిహారాలను అంకిత భావంతో ఆచరించే వారెవరయినా .. ప్రతి క్షణం ఆనందంగా జీవితాన్ని గడుపగలుగుతారు.

తాను కనుగున్న “నాలుగు ఆర్యసత్యాలను” బుద్ధుడు సమస్త మానవాళికీ ఎరుకపరచాడు.

బుద్ధుడు చూపించిన “అష్టాంగమార్గం” ప్రపంచాన్నంతా ఊర్రూతలూపింది ; ప్రజలందరి జీవితాలలో వెలుగులను నింపింది. బుద్ధుడు తన చుట్టూ ఉన్న శిష్యపరిగణంతో కలిసి ధ్యానప్రచారం చేస్తూ “సంఘం శరణం గచ్ఛామి” అని ప్రబోధించేవాడు! “2500 సంవత్సరాల తరువాత మైత్రేయ బుద్ధిడిగా మళ్ళీ ఈ భూమ్మీద ‘నేను’ అవతరిస్తాను” అంటూ మైత్రీతత్త్వానికి ఉన్నతమైన స్థానాన్నిచ్చాడు!

“పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్” లో వున్న పిరమిడ్ మాస్టర్లందరూ తమ తమ గత జన్మల్లో ఒకప్పుడు ఆ బుద్ధిడితో ఉన్నవాళ్ళే!

అందుకే ఆయన జీవిత విధానమే .. మన జీవిత విధానం! ఆయనకు ఎంతటి జ్ఞా న పిపాస ఉందో .. ఎంతటి అకుంఠిత దీక్ష ఉందో .. మనకు కూడా అంత ఉండాలి. వేరెవరి సహాయం లేకుండానే ఆయన తనను తాను ఉద్ధరించుకున్నాడు.

1979 సంవత్సరంలో బుద్ధుడిలాగే జ్ఞానోదయం పొందిన తరువాత నాకు కూడా .. “ఈ ప్రపంచం అంతా మాయ! ఇక్కడ ఎందుకు? హిమాలయలకు వెళ్ళి పొదాం!” అని ఒక్క క్షణం వైరాగ్యం ఆవహించింది.

ఆ విధంగా అనిపించిన మరుక్షణమే .. మానసికంగా హిమాలయాలకు వెళ్ళిపోయి మరి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేశాను!

“తెలుసుకోవలసిందంతా ఇక్కడే వుంటే .. హిమాలయాలల్లో మనమేం చేస్తాం?! ఇక్కడే అందరికీ చెప్పాలి కానీ .. హిమాలయాలకు పోయి ఎవరికి చెప్తాం?” అని నాలో వివేకం ఉదయించింది.

ఇలా ఒక్క క్షణంలోనే నాకు పనికిమాలిన వైరాగ్యం ఆవహించి సన్యాసిని అయ్యాను .. మళ్ళీ అంతలోనే వివేకం ఉదయించి బుద్ధుడిని అయ్యాను!

ఇక అప్పటి నుంచి ఇంట్లో ఉన్నా .. ఆఫీసులో వున్నా .. ఎక్కడెక్కడ పనిచేస్తూన్నా అక్కడ ఉన్నవాళ్ళందరికీ ధ్యానవిద్యనూ, ఆత్మజ్ఞాన విధానాన్నీ మరి దుఃఖ నివారణోపాయాన్నీ ఎక్కడ ఉన్నానో .. అక్కడే నేర్పిచడం మొదలుపెట్టాను!

గౌతమబుద్ధుడు .. ఈ భూమండలం మీద జన్మించిన పురుషోత్తములలో కెల్లా పురుషోత్తముడు! గౌతమ బుద్ధుడిలా మన బుద్ధితో మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి : మన ధ్యానప్రచార ధర్మాన్ని మనం నిర్వర్తించాలి; మన సంఘాన్ని మనమే బాగుచేసుకోవాలి.

బుద్ధం శరణం గచ్ఛామి .. ధర్మం శరణం గచ్ఛామి .. సంఘం శరణం గచ్ఛామి ..