మన శాశ్వత స్థిరనివాసం .. పై లోకమే

 

“ఈనాటి పిరమిడ్ మాస్టర్లందరూ అలనాటి వారే. ఎన్నెన్నో జన్మలలో ఆత్మోన్నతి గురించి విశేష కృషి. ధ్యానం చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజుకు పిరమిడ్ మాస్టర్స్ కాగలిగారు. అలాకాకపోయి ఉంటే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి రాగలిగేవారు కాదు.

“ఎవరైతే మన సంస్థలో అడుగుపెట్టి ముందు ధ్యానులుగా .. ఆపై మాస్టర్సుగా కడవరకు కొనసాగుతూనే ఉంటారో .. వారందరూ ఇంతకు ముందు జన్మలలోనే ధన్యత పొంది ఉన్నారు. ఈ రోజు అవి అన్నీ ప్రత్యేకంగా నేర్చుకోవటం లేదు. కేవలం ఆ గత అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు!

“ `నఖశిఖ పర్యంతరం ఉన్న శరీరం మాత్రమే నేను’ అనీ `నా తల్లిదండ్రులు పేర్లు ఫలానా; అనీ, భావించేవారు కేవలం మానవులుగానే పరిగణింపబడతారు. `నేను ఆత్మను .. పూర్ణాత్మ నుంచి భూమి పైకి వచ్చిన అంశాత్మను’ అని గ్రహించగలిగిన వారే నారాయణులు”

“ఒకానొక రైలులో మనం హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు ప్రయాణం చేసి, గుంటూరులో దిగినంత మాత్రాన .. రైలు మన తల్లి కాజాలదు! మరి మనం రైలుకు జన్మించినట్లు కాదు. అది ఒక సాధనం మాత్రమే. అలాగే ప్రాపంచిక తల్లి గర్భంలో కొంతకాలం ఉండి భూమి మీదకి ప్రవేశించినంత మాత్రాన `ఆమె కుమారులం’ అనడం కుదరదు.

“జీసస్ 11 సంవత్సరాల వయస్సులో ఒకానొక చోట ప్రవచనం చెపుతూంటే మరో పిల్లవాడు వచ్చి `నీ తల్లి మేరీ మేడమ్ నిన్ను ఇంటికి రమ్మన్నది’ అన్నప్పుడు ప్రభువు’ ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? నీకయినా, నాకయినా కనిపెంచిన వాళ్ళు తల్లిదండ్రులు కారు. నేను దేవుని కుమారుడను మరి నువ్వు కూడా దేవుని కుమారుడివే’ అని ఉద్బోధించాడు.”

“జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు” వారు కూడా తమ భజగోవిందం మహాకావ్యంలో “తల్లి ఎవరు? తండ్రి ఎవరు? తాత ఎవరు? ముత్తాత ఎవరు? నువ్వు ఎవరు?మనమందరం ఆత్మ స్వరూపులం. మహాకారణ లోకాలలో ఉన్న పూర్ణాత్మ నుంచి జన్మించిన అంశాత్మలం మనం” అంటారు.

మహానుభావుడు “విలియమ్ షేక్ స్పియర్” గారు కూడా “ఇక్కడ బంధాలూ, అనుబంధాలూ తాత్కాలిక నాటకాలు, మనం వచ్చింది పైలోకాల నుంచి! మన శాశ్వత స్థిర నివాసం పైలోకమే తప్ప ఈ లోకం కాదు. వర్తమానంలో మనం ఉన్న లోకం మనకు ఒకానొక స్వల్పకాలపు మజిలీ మాత్రమే” అని చెప్పారు.

ఈ విధంగా “మన అసలు లోకం పై లోకమే!” అని ఎందరో ప్రవచించారు. జీసస్ చెప్పినా, ఆది శంకరాచార్యుల వారు చెప్పినా మరి షేక్ స్పియర్ గారు చెప్పినా సత్యం మాత్రం ఒక్కటే! ఆ సత్యంలో విరాజిల్లటమే మన పిరమిడ్ సొసైటీస్ మాస్టర్ల మౌలిక లక్ష్యం.