“మహాకరుణ మహాయాగం”

 

పత్రీజీ సందేశం

 

“ధ్యాన సాధనలో ఉండే ప్రాధమిక ప్రతిబంధకాలు మూడు: ‘సోమరితనం’ .. ‘అహంకారం’ .. ‘పట్టుబట్టి మళ్ళీ పట్టును విడిచిపెట్టడం’:

“సోమరితనం”: ధ్యాన సాధనకు ప్రధానంగా ప్రతిబంధకంగా ఉండేది సోమరితనం. ‘ధ్యానసాధన రేపు చేద్దాం, తర్వాత చేద్దాం’ అని వాయిదా వేస్తూ ఉండడమే సోమరితనం! బద్ధకం మరి సోమరితనం ఎటువంటి పరిస్థితులలో కూడా ఉండరాదు. అది తమోగుణం ..!

“అహంకారం”: ‘నేను చాలా గొప్పవాడిని. నువ్వు నాకు చెప్పేదేంటి?!’ .. అని విర్రవీగుతూ ధ్యానం వాయిదా వేస్తూ అహంకారంతో ఉండేవాడి స్థితి రజోగుణ స్థితి!

“పట్టుబట్టి మళ్ళీ పట్టును విడిచిపెట్టడం”: ఒక మంచి లక్ష్యం పెట్టుకుని దానిని పట్టుదలగా సాధనచేస్తూ గట్టిగా పట్టుబట్టి చివరిక్షణంలో జారవిడుచుకోవడం. దీనినే ‘యోగభ్రష్టత్వం’ అంటారు. అయితే వీరు మరో జన్మలో యోగుల ఇళ్ళల్లో పుట్టి ఆ స్థితిని దాటి ముందుకు పోతారు .. కాకపోతే పట్టు జార విడుచుకోవడం వలన యోగభ్రష్టత్వం పొంది ఈ జన్మ మాత్రం వృధా అవుతుంది” అని తెలియజేశారు.

 

నవంబర్ 11th

పత్రీజీ సందేశం

 

ఈ సృష్టిలో అనేకానేక దివ్యలోకాలు వున్నాయి. అందులో మనం ఒకానొక భూలోకంలో ఉన్నాం. ఈ సకల లోకాలనూ పాలించడానికి సకల లోకపాలకులు ఉన్నారు. అలాగే ఈ భూలోకాన్ని కూడా ఒక తల్లి తన బిడ్డను రక్షించినట్లు భూలోక పాలకులు రక్షిస్తూ ఉంటారు. ఇలా ‘సకల లోకాలన్నీ దివ్యపాలకుల సంరక్షణలో ఉన్నాయి; ఇక్కడ సంరక్షణలో లేని ఆత్మలు లేనేలేవు’ అని గ్రహించడమే ‘ఆధ్యాత్మికత’! “PSSM అందరికీ ఈ ఆధ్యాత్మికత శాస్త్రపరిజ్ఞానాన్ని అందించడానికే ప్రయత్నిస్తోంది.

రేపో మాపో శరీరం వదిలివేసి ఈ భూలోకం నుంచి దివ్యలోకాలకు వెళ్ళిపోయాక మనం కూడా క్రింద ఉన్న ఈ భూలోకాలను రక్షించే పనినే చేస్తాం. ఇక్కడ మనం భూలోకవాసులం .. అక్కడికి వెళ్ళాక దివ్యలోకవాసులం. ఇక్కడ మనం సంరక్షణలో ఉంటాం .. మరి అక్కడికి వెళ్ళాక మనం ఇతరులకు సంరక్షణ గావిస్తాం!

ఇలా మన ఆత్మప్రయాణం అన్నది నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణం చెయ్యాలి అంటే మనకు ఎంతో ఆత్మశక్తి ఉండాలి. ఆత్మశక్తిని ఇతోధికంగా పొందాలి అంటే మరి మనం నిరంతరం ధ్యానం చెయ్యాలి. దుఃఖం ఉన్నప్పుడే ధ్యానం చేద్దాం అనుకుంటే లాభం లేదు.

సుఖం ఉన్నప్పుడు ఎవ్వరికీ ‘ధ్యానం చెయ్యాలి’ అని అనిపించదు కానీ ‘సుఖం ఉన్నప్పుడే ధ్యానం చేస్తే మరి దుఃఖం ఎందుకు వస్తుంది?” అంటారు పరమయోగి ‘కబీర్‌దాస్’గారు.

అంతా బాగున్నప్పుడే మరి ధ్యానం చెయ్యాలి. దుఃఖాలు వచ్చినప్పుడే ధ్యానం చేసేవాళ్ళూ అధములు; దుఃఖాలు వచ్చినప్పుడే ధ్యానం చేసి సుఖాలు వచ్చినప్పుడు చెయ్యని వాళ్ళు మధ్యములు; సుఖాలు వచ్చినప్పుడూ మరి దుఃఖాలు వచ్చినప్పుడూ కూడా ధ్యానం చేసేవాళ్ళు ఉత్తములు. అసలు సుఖదుఃఖాలతో సంబంధమే లేకుండా నిరంతరం ధ్యాన సాధనలో మునిగేవాళ్ళు పురుషోత్తములు!

“అటువంటి పురుషోత్తములకే అన్ని సిద్ధులూ వశమవుతాయి .. మరి అలాంటి వారినే ‘సిద్ధపురుషులు’ అంటాం!” అంటూ శ్రేష్ఠతరమైన మానవ జీవన విధి విధానాన్నిగురించి వారు విశేషంగా తెలియజేశారు.