క్రాంతి అంటే ఆత్మ యొక్క వెలుగు

 

“అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! ” ‘క్రాంతి’ అంటే ఆత్మ యొక్క వెలుగు! సూర్యుని వెలుగును ‘కాంతి’ అయితే, ఆత్మ యొక్క వెలుగును కలిగి ఉంటే ‘క్రాంతి’ అంటాం. క్రాంతి అంటే దివ్యజ్ఞానప్రకాశం. ఎక్కడయితే ధ్యానం ఉంటుందో, ఆత్మజ్ఞానం ఉంటుందో .. అక్కడ ఆత్మ దివ్యజ్ఞాన ప్రకాశంలో ధగ ధగా మెరిసిపోతూ ఉంటుంది.

“ఆత్మ ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. చీకటిలో స్తబ్ధుగా ఉండకూడదు. ఒక పశువులా ఊరికే తినడం, పడుకోవడం కాదు. నిరంతర ధ్యానసాధన ద్వారా ఆత్మ సదా వెలుగుతూనే ఉండాలి. ఆత్మ ఎప్పుడూ సంబరాలలో మునిగి తేలుతూనే ఉండాలి. ఎక్కడ క్రాంతి ఉంటుందో .. ఎక్కడ ఆత్మకి ఎన్‌లైటెన్‌మెంట్ ఉంటుందో .. అక్కడ సంబరాలే సంబరాలు. అసలు మనిషికి కావలసింది .. సంబరాలే! ఏడ్పులూ .. రోగాలూ .. రొష్టులూ .. కష్టాలూ కావు. రకరకాల ఆటలూ, పాటలూ, సంగీతాలూ, నృత్యాలూ, చిత్రాలూ, విచిత్రాలూ .. ఇవే ఆత్మకు కావలసిన సంబరాలు. ‘క్రాంతి’ ఉన్నచోటే ఈ సంబరాలు ఉంటాయి. సంక్రాంతి పండుగ యొక్క అంతరార్థం ఇదే!