కరుణా ధర్మం

 

“‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం’ అంటే నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోవడం .. నీ చేతులను నువ్వు ముద్దు పెట్టుకోవడం కాదు. నీ ఆత్మను నువ్వు నీ పూర్తి శక్తి యుక్తులతో ప్రేమించుకోవడం!”

“‘నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటే ఇతర జీవులను కూడా నువ్వు అంతగా ప్రేమించగలవు’ అని కరుణతో చెప్పారు ఏసుక్రీస్తు.

“‘పొరుగువాడు’ అంటే తన ప్రక్కన ఉన్నవాడు మరి తనను పొగిడేవాడే కాదు .. తనను ద్వేషించేవాడు కూడా! ‘పొరుగువాడు’ అంటే సకల జంతు, మత్స్య మరి పక్షిజాలం కూడా! తనను తాను ప్రేమించుకున్నంత అంకిత భావంతో వాటన్నింటినీ కూడా ప్రేమించాలి. అలా ప్రేమించాలంటే మనం సమస్త విశ్వంతో ఏకత్వం చెందగలగాలి. అది ఒక్క ధ్యానం వల్లనే సాధ్యం. ” ‘ దేవుని రాజ్యం లోనికి ప్రవేశించండి’ అని కూడా ఏసుక్రీస్తు ఎల్లెడలూ ప్రవచన ప్రచారం చేసారు! “‘ఎక్కడుంది దేవుని రాజ్యం?’ అని అడిగిన వారికి ‘నీ లోపలే ఉంది, అని చెప్పారు. ” ‘నా లోపలికి నేను ఎలా వెళ్ళాలి?’ అని అడిగిన వారికి ‘చిన్న పిల్లవాళ్ళలా మారితే వెళ్ళగలరు’ అని చెప్పారు.

” ‘నేను 40రోజులు ఉపవాసం ఉన్నాను; మీరు కూడా అలాచేస్తే దేవుని రాజ్యంలోకి ప్రవేశమార్గం సుగమం అవుతుంది’ అని చెప్పారు. ఉపవాసం అంటే భోజనం మానివేయమని కాదు .. మనస్సుకు ఉపవాసం అంటే .. ఆలోచనలను అరికట్టి ధ్యానం చేయాలి!

“అంతేకాదు .. ‘నేను చెప్పినట్లు చేస్తే ఆరోగ్యం, సంపద, సంతోషం, తృప్తి .. అన్నీ మీకు ఇవ్వబడతాయి’ అంటూ సుస్పష్టమైన అవగాహన కూడా ఇచ్చారు అపార కరుణామయుడయిన జీసస్ ప్రభువు.

” ‘నీ రెండు కళ్ళూ ఒక్కటవ్వకపొతే దేవుని రాజ్య ప్రవేశానికి అర్హుడివి కాజాలవు’ అని కూడా ఆయన అన్నారు. అంటే ‘ధ్యానంలో చర్మచక్షువులు రెండింటినీ మూసుకుని .. ధ్యానచక్షువు గుండా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి’ అని ఆయన చాలా చక్కగా విశ్లేషించారు.

” ‘జీసస్ క్రైస్ట్‌లాగే మనంకూడా తోటివారి జీవితాలనూ, వారివారి నిస్సహాయతలనూ గమనించి కరుణతో వారికి సహాయం చెయ్యాలి. జీవులను హింసించకుండా, భక్షించకుండా వాటన్నింటికీ రక్షణ కల్పించాలి.

“ఇదంతా కూడా మనకు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. అప్పుడే మనం ‘సర్వేజనా సుఖినోభవంతు .. సర్వేప్రాణి సుఖినోభవంతు’ అంటూ సకల ప్రాణికోటి సంక్షేమ సౌభాగ్యాల కోసం పాటుపడగలుగుతాం!!