జీవితానికి పరిపూర్ణత

 

” ‘చనిపోయిన తరువాత మనమంతా ఎక్కడికి వెళ్తాం? అక్కడి విశేషాలేంటి?’ అన్నవి మనం చనిపోయాక మనకు తెలుస్తుంది. అది సగటు మానవుడి జీవనశైలి.

“కానీ ఆ విషయాలన్నింటినీ బ్రతికి ఉండగానే తెలుసుకోవాలి. అంటే బొందిలో ప్రాణం ఉండగానే మనం స్వర్గారోహణ చెయ్యాలి. ఇది ఒకానొక బుద్ధుడు .. అంటే ఒకానొక దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన యోగి .. చెయ్యవలసిన పని!

“అందుకుగాను మనం మనకు ఒక రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల సమయంలో పన్నెండు గంటలను ప్రాపంచికంగా మిగతా పన్నెండు గంటలను ఆధ్యాత్మికంగా జీవించాలి. పగలు పన్నెండు గంటలపాటు ఉద్యోగ వ్యాపారాదులు చేసుకుంటూ .. సంగీతం వింటూ .. నృత్యాలు చేస్తూ .. వంటలు వండుకుని తింటూ .. భార్యాపిల్లలతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి.

“మిగిలిన రాత్రి పన్నెండు గంటలను ఆధ్యాత్మికంగా గడుపుతూ విశేషంగా ఆత్మశక్తినీ మరి విశ్వశక్తినీ కూడగట్టుకోవాలి. ధ్యానంలో సూక్ష్మశరీరాన్ని విడుదల చేసి గంటలు గంటలు పరలోక యాత్రలు చేసి అక్కడి విశేషాలన్నీ తెలుసుకోవాలి.

“సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎరుక లేకుండానే అయినా నిద్రలో .. పరలోక యాత్రలు చేస్తూనే ఉంటారు. అది వారికి ప్రకృతి ఇచ్చిన వరం! కానీ ధ్యానం ద్వారా ఎరుకతో మనం పరలోక యాత్రలు చేయడం వల్ల మనకు అక్కడి విశేషాలన్నీ గుర్తుండిపోతాయి. ‘నిద్ర’ అన్నది మనకు ప్రకృతి ఇచ్చిన వరం అయితే .. ‘ధ్యానం’ అన్నది మనకు మనమే ఇచ్చుకునే వరం!

“ధ్యానంలో మనం మెల్లిమెల్లిగా విశ్వశక్తిని గ్రహిస్తూ ఉంటాం. అది భౌతిక శరీరంలో ఒకానొక చోట కేంద్రీకృతం కాగానే అందులో నుంచి సూక్ష్మశరీరం విడుదలై బయటికి వచ్చి .. ముందు తన భౌతిక దేహాన్ని ఆశ్చర్యంగా చూసుకుంటుంది. ‘ఓహో! అది కేవలం శరీరమా? నేనా? ఈ శరీరంలో నేను ఉంటున్నానా?’ అని ఆశ్చర్యపోతుంది.

“ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని ఆ గోడలలో నుంచీ .. ఈ తలుపులలో నుంచీ .. ఆ పైకప్పులో నుంచీ ప్రయత్నించి చివరికి ‘జుయ్’ మంటూ బయటికి వెళ్ళిపోతుంది! ఎక్కడెక్కడో కొండలలో, గుట్టలలో, లోయలలో, నదులలో, సముద్రాలలో, మంటలలో, సూర్యుడిలో, చంద్రుడిలో అలా అలా స్వేచ్ఛగా ఎగురుతూ .. దూకుతూ .. మునిగి తేలుతూ .. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ..

“నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః” (భ||గీ||2-23)

” ‘ఆత్మను శస్త్రాలు ఛేదించజాలవు; అగ్ని దహింపజాలదు; నీరు తడుపజాలదు; వాయువు ఆర్పివేయ సమర్థము కాదు’అన్న శ్లోకానికి అర్థం ఇదా?!’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుని విస్తుపోతుంది!

“ముందు భౌతిక శరీరంలో నుంచి బయటికి వచ్చిన సూక్ష్మశరీరం .. ఇహలోక యాత్రలు .. అంటే ఎక్కడో అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికీ .. కెనడాలో ఉన్న కూతురి దగ్గరికీ వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు ఏమేం చేస్తున్నారో చూస్తుంది.

“హిమాలయాలూ, మక్కా మసీదూ, జెరూసలేం, ఈజిప్ట్ పిరమిడ్స్, నయాగరా, తాజ్‌మహల్, డిస్నీ వరల్డ్ ఇలా .. తనకు వెళ్ళాలనిపించిన ప్రదేశాలన్నీ తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ భౌతిక శరీరంలోకి దూరిపోతుంది. మళ్ళీ ధ్యానంలో ఇంకాస్త శక్తిని పుంజుకుని ఈ సారి ఇహలోక యాత్రలతో పాటు పరలోక యాత్రలకు .. కూడా పూనుకుంటుంది. ” ‘ఆ కైలాసం వెళ్ళి వద్దాం .. ఆ పాలపుంతలో ఏముందో చూసి వద్దాం .. ఆ స్వర్గం విషయం ఏమిటో కనుక్కుందాం .. ఆ అల్సియోన్ కథేంటో తెలుసుకుందాం .. ఆ సౌర కుటుంబాలు ఎన్ని ఉన్నాయో చూసి వద్దాం’ .. అనుకుని హాయిగా అవన్నీ తిరిగి తిరిగి పరలోక జ్ఞానమంతా పొందుతుంది.

“‘ఓయబ్బా! .. ఇంత ఉందా ఈ విశ్వంలో! ఇంత ‘కిక్’ ఉందా ఈ ధ్యానంలో?! మరి అదేంటీ నేను ఇన్ని రోజులూ ఏదో ‘బార్’లో కూర్చుని మందు కొడితేనే ‘కిక్’ వస్తుందని ఇల్లూ, ఒళ్ళూ గుల్ల చేసుకున్నాను?!’ అని పశ్చాత్తాప పడుతుంది.

“కాబట్టి మనిషి ఎంత అందంగా తయారయినా .. ఎంత డబ్బు సంపాదించినా .. ఇతరులకు చూపించుకోవలసింది మరి ఇతరులతో ముచ్చటించుకోవలసింది మాత్రం వాటిని గురించి కాదు. పరలోక విశేషాలను గురించి మాట్లాడుకోవాలి!

“లేకపోతే రోజులో పన్నెండు గంటలు పొట్టకూటికోసం కష్టపడడం .. మిగతా పన్నెండు గంటలు .. డాక్టర్లకోసం పడిగాపులు పడుతూ ఆస్పత్రులచుట్టూ తిరుగుతూ ముదనష్టపు బ్రతుకులు బ్రతకాల్సి వస్తుంది. అసలు ‘నేను భగవంతుడిని’ అని తెలుసుకున్నవాడు ఆస్పత్రులకు ఎలా వెళ్తాడబ్బా?! మందుల రూపంలోవున్న ఆ విషాలను తనలో ఎలా నింపుకుంటాడు??

“కాబట్టి జీవితానికి ‘ధ్యానం’ అన్నది తప్పనిసరి! ధ్యానం ద్వారా ఇహలోక యాత్రలు+పరలోక యాత్రలు సరిసమానంగా చెయ్యాలి. అప్పుడే ఆ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది!”