జీవితమనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్ గా వుండాలి

 

జీవితమంతా ఒకే ఒక విద్య మీద ఆధారపడి వుంటాడు సగటు మానవుడు. ఏ ఇతర విద్యలూ నేర్చుకోడు వాడు. ‘ఎకనమిస్ట్’ అయితే జీవితమంతా ఒక్క ‘ఎకనామిక్స్’ నే చదువుతూంటాడు. వాడింక సంగీతం నేర్చుకోడు. డాన్స్ నేర్చుకోడు. కబడ్డీ నేర్చుకోడు. పేక ఆడడు. అవన్నీ తనకి సంబంధించినవి కాదనుకుంటాడు. ‘ఎకనామిక్స్ ‘ లోనే పుడతాడు, ‘ఎకనామిక్స్’  లోనే ఛస్తాడు.

జీవితమనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్ గా వుండాలి. అంతేగాని యూనీ డైమెన్షనల్ గా వుండకూడదు. అంటే, ‘ఏకసూత్రపథం’ గా వుండరాదు. ‘బహుసూత్రపథం’ గా వుండాలి. అప్పుడే వినూత్న ఆనందం విస్తరిస్తుంది.

“లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్… law of diminishing returns” అని ఒక సిద్ధాంతం వుంది. ఒక ఆపిల్ తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. రెండో ఆపిల్ తిన్నామనుకోండి బావుంటుంది. మూడో ఆపిల్ దగ్గరకొచ్చేసరికి ఇంక తినకూడదు అనుపిస్తుంది. నాలుగో ఆపిల్ తింటే ఇక డోకు వచ్చేస్తుంది.ఏం చేయాలప్పుడు ?

మొదట ఆపిల్ తినలి ; ఇంకోటి సీతఫలం తినలి. తర్వాత మామిడి పండు తినాలి. అనంతరం జామపండు తినాలి. వెరైటీగా తింటే అప్పుడు డోకు రాదు. అన్నీ తినొచ్చు గానీ తిన్నవే తింటూంటే వాంతి వచ్చేస్తుంది. మొట్టమొదట వున్న ఆనందం చివరికి ఆవిరైపోతుంది. కనుక ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపాలి.

అనేక విద్యలను నేర్చుకుంటూ వుండాలి. అప్పుడు ఆనందం మల్టిపుల్‍గా వుంటుంది. బహుముఖంగా వెల్లివిరుస్తుంది. అప్పుడు అది “లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్స్” కాదు. అది “లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్”. తద్వారా మనం అనేకానేక లాభాలు పొందుతాం. ఇవన్నీ కూడా ఆనంద శాస్త్రం మూల సూత్రాలు.

చాలామంది కాలేజీ అయిపోతూనే, ఇంక పుస్తకాలకి గుడ్ బై కొట్టేస్తారు. “ఇంక పుస్తకాలు చదివే స్టేజీ దాటిపోయింది” అని అనుకుంటారు. పాపం పిచ్చోళ్ళు. పుస్తకాల్లో వున్నంత ఆనందం మరేందులోనూ లేదు. అందులో ఎంత ఆనందం వుందో, ఎంత విజ్ఞానం వుందో, ఎంత విశ్రాంతి వుందో, ఎంత హయి వుందో.

మహానుభావుల పుస్తకాలు చదువుతూంటే, గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు చదువుతూంటే ఎంత విశ్రాంతి, ఎంత వినోదం, ఎంత ఆనందం, షేక్స్‌స్పియర్ చదవకపోతే అసలు జీవితమే వృధా.

“సినిమాలకు పోయి మాత్రమే ఆనందాన్ని పొందగలం. ఇంట్లో కూర్చుని ఆనందం పొందలేం” అని కొందరు అనుకుంటారు. సినిమాకు పోతేనే ఆనందం, టీవి ముందు కూర్చూంటేనే ఆనందం. టీవి అద్భుతమైన ఆనందాన్నిస్తుంది; కానీ టీవీ ఒక్కటే ఆనందం కాదు. పుస్తకాలు అద్భుతమైన ఆనందాన్నిస్తాయి;కానీ ‘పుస్తకాలొక్కటే’ ఆనందం కాదు. పుస్తకాలూ చదవాలి, టీవీ కూడా చూడాలి.ఇవి రెండే ఆనందం కాదు. క్రికెట్ కూడా ఆడాలి. వంట కూడా నేర్చుకోవాలి. ధ్యానం కూడా చేయాలి. ఆత్మజ్ఞానం కూడా అలవరచుకోవలి. అప్పుడు అంతా, ఎంత ఆనందమో.

జీవితంలో ఏ ప్రత్యేక ఆనందానికీ మనం దూరం కాకూడదు. అన్ని ఆనందాలనూ పుష్కలంగా పొందాలి. భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా ఆత్మపరంగా.