జీవన విజ్ఞాన శాస్త్రం

 

ప్రతి ఒక్క విషయంలోనూ నిర్దిష్టమైన “శాస్త్రం” ఉంటుంది.
“సంగీత శాస్త్రం” ఉంది “నాట్య శాస్త్రం” ఉంది
అదే విధంగా సరియైన జీవనం విషయంలో కూడా నిర్దిష్టమైన శాస్త్రం ఉంటుంది, ఉంది
దీనినే “జీవన విజ్ఞాన శాస్త్రం” అనవచ్చు
ఈ జీవన విజ్ఞాన శాస్త్రంలో తొమ్మిది అంశాలు ఉన్నాయి:
“ఆహార విధానంలో” లో “మూడు అంశాలు”.
“వాక్ విధానం” లో “మూడు అంశాలు”
“యోచనా విధానం” లో “మూడు అంశాలు”
***
ఆహార విధానంలో ఉన్నవి మూడు అంశాలు; అవి:
“యుక్తాహారం” * “మితాహారం” .. * నిరాహారం”
“మొదటి అంశం” : “యుక్తాహారం”
శాకాహారం మాత్రమే యుక్తాహారం కనుక యుక్తమైన వృక్షజాతి ఆహారాన్నే తీసుకోవాలి
మాంసాహారం అన్నది అత్యంత అయుక్తమైన ఆహారం అనబడుతుంది
అసలు అది `ఆహారం’ కానే కాదు, అది `విషం`!
అంతేగాక మరి శాకాహారమైనా ఆ ఆహారం శుచిగా, రుచిగా వుండాలి;
మరి యుక్త వ్యక్తులు వండినదే “యుక్తాహారం” అనబడుతుంది
అంతేకాక యుక్త సమయంలో తీసుకునేదే “యుక్తాహారం”!
కడుపులో “కర”, “కర”, “కర” అంటూ ఉన్నప్పుడే భోజనం మొదలుపెట్టాలి
ఇంకా ఒక “కర” మిగిలి ఉన్నప్పుడే భోజనం ముగించాలి
“రెండవ అంశం” : “మితాహారం”
పీకలదాకా భోజనాన్ని దట్టించకూడదు
అవసరమైన దానికంటే ఎక్కువ ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళకూడదు!
ఎంత ఆకలి ఉంటే అంతే ఆహారం స్వీకరించాలి
“మూడవ ప్రధాన అంశం” .. “నిరాహారం”
వారానికి ఒక రోజయినా తప్పనిసరిగా “నిరాహారం” అన్నది ఉండాలి
ఈ విషయంలో “మహాత్మా గాంధీజీ”ని స్ఫూర్తిగా తీసుకోవాలి
మహాత్మా గాంధీజీ వారంలో ఒకరోజు విధిగా నిరాహారిగా ఉండేవారు
“లంఖణం పరమ ఔషధం” అన్నారు కనుక
మిగతా ఆరు రోజులలో ఏ కొంచెం అమితాహారం వున్నా సరే
అది వారానికి ఒక్కరోజు సంపూర్ణ నిరాహారంతో చక్కగా సవరించబడుతుంది
***
ఇకపోతే వాక్ విధానంలో మూడు అంశాలు .. అవి:
“యుక్త భాషణం” .. * “మిత భాషణం” .. * “నిర్భాషణం”
“యుక్తభాషణం” అంటే .. అవసరం అయిన మాటలే మాట్లాడటం
ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు .. ఇంట్లో విషయాలు ఆఫీస్ లో మాట్లాడకూడదు
ఏ విషయాలను మాట్లాడుకోవాలో .. అవే విషయాలను మాట్లాడుకోవాలి
ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు పదిమందిలో ఉన్నప్పుడు మాట్లాడరాదు
వాక్కులలో ఒక్క “అపస్వరం” కూడా ఉండరాదు
ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి
“వాక్ విధానంలో రెండవ అంశం” .. “మిత భాషణం”
ఎంత మాట్లాడాలో .. అంతే మాట్లాడాలి .. అతి సర్వత్ర వర్జయేత్ కదా!
“వాక్ విధానంలో మూడవ అంశం” .. “నిర్భాషణం” అంటే “మౌనం”
మహాత్మా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని .. వారానికి ఒకరోజు మౌనాన్ని విధిగా పాటించాలి
అయితే ఏదైనా అత్యంత అవసరం వస్తే .. మరి చక్కగా వ్రాసి చూపించవచ్చు
***
చివరిగా యోచనా విధానంలో ఉన్నవి మూడు అంశాలు; అవి:
“యుక్త యోచనం” .. * “మిత యోచనం” .. * “నిర్ యోచనం”
“యుక్త యోచనం” అంటే .. ఆచి తూచి ఆలోచించాలి
ఎలా పడితే అలా .. ఎక్కడ పడితే అక్కడ .. ఏది పడితే అది ఆలోచించరాదు
అంతేకాక .. యోచనలు పరిమితంగానే ఉండాలి .. అతిగా మెదడుకు పనిపెట్టకూడదు
ఇదే “మిత యోచనం”
ఇక “నిర్ యోచనం” .. అంటే ..
మనస్సును శూన్యం చేసుకోవడం .. అంటే “ధ్యానం చేయడం”
“లంఖణం పరమ ఔషధం” అన్నారు
నిరాహారం ప్రథమ మౌలిక లంఖణం
నిర్భాషణం మరింత గొప్ప లంఖణం
నిర్ యోచనం .. అన్నింటికంటే గొప్ప పరమ లంఖణం
“లంఖణం పరమ ఔషధం” అన్నప్పుడు
అన్నింటికంటే పరమ లంఖణం అయిన “ధ్యానం”
మరి .. “పరమ, పరమ ఔషధం” అవుతుంది కదా!
అందుకే ధ్యానం “సర్వరోగనివారిణి” .. “సర్వరోగహారిణి” అయ్యింది
సర్వరోగాలూ అదృశ్యం అయిపోతే .. మిగిలేవన్నీ భోగాలే కదా!
అందుకే ధ్యానం “సర్వభోగకారిణి”
ధ్యానం “సత్యజ్ఞానప్రసాదిని” కూడా ..
ఎందుకంటే
“ధ్యానం” మనకు ఆత్మ – సత్యం పట్ల అనుభవజ్ఞానాన్ని కలుగజేస్తుంది కనుక!
***
ఈ తొమ్మిది అంశాల జీవన శాస్త్రంలో
మకుటాయమైనది “నిర్ యోచనం” అంటే “ధ్యానం”!
ఎక్కడ “ధ్యానం” అన్నది ఉంటుందో .. అక్కడ మిగతా ఎనిమిది అంశాలు
తమంతట తామే .. సహజంగానే వచ్చి చేరతాయి
ఇతి సమ్యక్ జీవన విజ్ఞాన శాస్త్రః
అందరూ జీవన విజ్ఞాన శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసెదరు గాక
మరి శాస్త్రోక్తంగా జీవించెదరు గాక
లోకాస్సమస్తా సుఖినోభవంతు

ఓం తత్ సత్