గురువు -లఘువు

 

 

“గురువు” అంటే, బరువయినవాడు” అని అర్థం 
అంటే, “జ్ఞానంతో, అనుభవంతో
బరువుగా, ఉదాత్తంగా అయినవాడు” అని.

‘గురువు’ అనే పదానికి విపరీత పదం ‘లఘువు’
“లఘువు”..
అంటే “తేలికగా వున్నవాడు” అని;
అంటే, “జ్ఞానం, అనుభవం లేకుండా,
తేలికగా అనుదాత్తంగా వున్నవాడు” అని.

“గురువు”, “శిష్యుడు” అనే పదాలలో
“నేర్పించేవాడు”-“నేర్పించబడేవాడు”
అనే అర్థం సామాన్యంగా స్ఫురిస్తుంది.
అయితే,

“గురువు” అంటే “నేర్పించేవాడు” కాదు!
శిష్యుడు” అంటే “నేర్పించబడేవాడు” కాదు!

నిజానికి ఎవ్వరూ, ఎవ్వరికీ ఏ విద్యనూ అందించలేరు!
అయితే, ఎవరంతట వారు తమ తమ సాధనా అవగాహనల ద్వారా
‘నేర్పు’ వున్న వారి ‘నేర్పరితనం’ చూసి నేర్చుకుంటూ వుంటారు!
తగిన సాధనాక్రమంలో, అనుభవక్రమంలో
‘లఘువు’ లు ‘గురువు’లుగా ఎప్పుడూ అవుతూనే వుంటారు!

కనుక,
“గురువు” అంటే “బోధకుడు” కాదు అని ఖచ్చితంగా తెలుసుకోవాలి.
“గురువు” అంటే “సాధన ద్వారా సిద్ధుడు అయినవాడు” అని అర్థం.
ఇది బోధపడినప్పుడు, “గురువు” అనే ఒకానొక ‘వ్యక్తి’ వెంటబడడం వుండదు
“‘సాధన’ అనే ‘కార్యక్రమం’ వెంటపడడం మొదలవుతుంది!

ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం ద్వారా, ధ్యాన యోగ సాధన ద్వారా,
సజ్జన సాంగత్యం ద్వారా నిష్కామకర్మల ద్వారా
“లఘువులు” క్రమక్రమంగా “గురువులు”గా అవుతారు!