గురువు..గురూపదేశం..గురుత్వాకర్షణ శక్తి

 

“గురువు” అంటే బరువైనవాడు” అని అర్థం

“గురువు” అనే పదానికి వ్యతిరేకమైన పదం ..”లఘువు”

“లఘువు” అంటే “తేలికైనవాడు” అని అర్థం

అధికమైన జ్ఞానం ఉంటే గురువు .. స్వల్పమైన జ్ఞానం ఉంటే లఘువు

లఘువులు అయినవారు గురువుల దగ్గరికి చేరి

క్రమక్రమంగా తమ లఘుత్వాన్ని అంతం చేసుకుంటూ గురుత్వాన్ని సాధించుకోవాలి

“కఠిన సాధన” ఉన్నప్పుడే గురుత్వం .. కఠిన సాధన లేనప్పుడు లఘుత్వం

“కఠిన సాధన” అంటే ప్రతి దిన, రోజువారీ సాధన

గురువులు ఎప్పుడూ లఘువులకు ఉదాహరణలుగా ఉంటారు

“ఒక వ్యక్తి సాధించింది ఏదైనా .. మరొక వ్యక్తి కూడా సాధించగలడు”

అన్న సత్యాన్ని ఎప్పుడూ నొక్కి చెప్పేవాడే గురువు

“ప్రతి ఒక్కరిలోనూ ‘క్షమత’ ఉన్నది” అని నొక్కి చెప్పేవాడే గురువు

“ఎప్పుడూ సాధనకు తహతహలాడాలి” అని నొక్కి చెప్పేవాడే గురువు

“గురువుగా తయారు కా” అని చెప్పేవాడే .. గురువు

సకల విద్యల్లో, కళల్లో, ఆటలో, పాటల్లో గురువులు ఎప్పుడూ వుంటారు

గురువులు కాదలచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు

గురువు యొక్క సాన్నిధ్యమే “గురుకటాక్షం” .. గురువు యొక్క చిరునవ్వే “గురుకృప”

గురువులు కాదలచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే గురువు దగ్గర కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది

భూ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి

భూమి యొక్క ఉపగ్రహం అయిన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు ..

సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి

భూగ్రహం, మరి ఇతర గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు ..

గురువులుగా కావాలని నిశ్చయించుకున్న లఘువులు ..

గురువు యొక్క గురుత్వాకర్షణ శక్తిక్షేత్రంలో సదా తిరుగుతూ ఉంటారు

గురువులు కావడానికి సంకల్పించిన వారికే గురువులు కనబడతారు కానీ..

గురువులు కావడానికి సంకల్పించని వారికి గురువులు ససేమిరా కనబడరు

చూసే చూపును బట్టే చూడబడేది ఉంటుంది

దృష్టిని బట్టే దృశ్యం సాకారాం అవుతుంది

“యతో దృష్టిః .. తథా దృశ్యం”

గురువులుగా కాదలచుకున్న లఘువులకే గురువులు కావాలి

గురువులుగా కాదలచుకున్న లగువులు చుట్టూ లేకపోయినా .. గురువులకు ఏమీ కొరత లేదు

గురువులుగా కాదలచుకున్న లఘువులు చుట్టూ ఉంటే .. గురువులకు సంతోషం మాత్రం ఉంటుంది

నిన్నటి కఠిన సాధనాపరుడయిన లఘువే .. నేటి గురువు

నేటి కఠిన సాధనాపరుడయిన లఘువే .. రేపటి గురువు

ఇదీ గురువుల, లఘువుల కథ ..

“గురుపౌర్ణమి” సందర్భంగా శ్రీగురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు

“వ్యాసపౌర్ణమి” సందర్భంగా ఆదిగురువులైన

శ్రీ వేదవ్యాసుల వారికిసాష్టాంగ ప్రణామాలు