గతం..అవగతం..విగతం

 

“గతం” అంటే, మన “భూతకాల స్థితి”

పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు చేసిన కార్యకలాపాల చిట్టా

ఇంకా వెనక్కిపోతే వెనకటి జన్మల గాధలు కూడా

“అవగతం” అంటే “అర్థం కావడం”

“అవ” అంటే “వెనక్కి రావడం” అని కూడా

ఉదాహరణకు పదాలు “అవరోహణం” .. “అవతారం”

“వెనక్కి రావడం” అంటే, “రివర్స్ గేర్ వేయడం” అన్నమాట

గతాన్ని “రివర్స్ గేర్”లో పరిలోకించినప్పుడే

ఆ గతం పూర్తిగా ‘అవగతం’ అయి ఇక విగతం’ అవుతుంది

“విగతం” అంటే “మాయమైపోవడం”

‘గతం’ అన్నది ‘అవగతం’ అయి ‘విగతం’ అయినప్పుడే

వర్తమానం అన్నది భవిష్యత్తుకు బంగారుబాట కాగలదు

గతం అన్నది పూర్తిగా అవగతం కాకపోతే

ఆ గతమే పదే పదే మరి పునరావృతమవుతూ ఉంటుంది

చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండడం జరుగుతూ ఉంటుంది

మన జీవితం చర్విత చర్వమవుతూనే ఉంటుంది

కనుక, ఎప్పుడూ “ఫార్వ‌ర్డ్ గేర్” లోనే కాకుండా

అప్పుడప్పుడూ “రివర్స్ గేర్” లో కూడా జీవించాలి

అంటే, ప్రతిరోజు కొంత సమయాన్ని

“ఊరికే కళ్ళు ముసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోడానికి” కేటాయించాలి

అప్పుడు గతంలోని ప్రతి సన్నివేశం మొదట మన “మనోఫలకం” లోనూ,

తరువాత మన “దివ్యచక్షువు” లోనూ, పునః పునః ప్రత్యక్షమయి

సత్యం అంతా సంపూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది

అర్థమయినదంతా ‘విగతం’ అవుతూ తుడిచివేయబడుతూ ఉంటుంది

పూర్ణంగా తుడిచివేయబడని గతం పదే పదే వర్తమానం లోకి వచ్చి

పునఃపీడిస్తూ ఉంటుంది

* ధ్యానంలో ఉండడమే “రివర్స్‌గేర్” లో సమయం కేటాయించడం అంటే

* అప్పుడే గతం అవగతమై విగతం అవుతుంది