“ఎవరి గీతలు వారివే”

 

“‘గీత’ అంటే .. ‘Code of conduct’”.  “భగవద్గీత”, “వశిష్ఠ గీత”, “అష్టావక్ర గీత”, “ఏసు గీత”, “బుద్ధ గీత” .. ఇలా ఎందరెందరో మాస్టర్లు వారి వారి గీతలను తమ తమ అనుయాయులకు అందించారు.

అయితే ప్రాపంచికంలో ఉన్నవారికీ మరి ఆధ్యాత్మికంలో ఉన్నవారికీ కూడా ఎవరి గీతలు వారికే ఉంటాయి! ఎక్కువస్థాయిలో ఉన్నవారూ మరి తక్కువస్థాయిలో ఉన్నవారు .. అందరూ కూడా ‘A’ నుంచి ‘Z’ వరకు వివిధ గ్రేడ్స్ ప్రకారం తమ తమ గీతలను, తమ తమ ఎన్‌లైటెన్‌మెంట్‌కు తగ్గట్లుగా తమ గీతలను తామే వ్రాసుకుంటూ ఉంటారు.

గీత దాటవద్దని లక్ష్మణుడు సీతకు ఒక “గీత” గీసాడు!! అయినా సీత ఆ గీతను దాటింది!

లక్ష్మణుడు కూడా ఎన్‌లైటెన్డ్ మాస్టరే కనుక నిజానికి సీత ఆ గీత దాటకూడదు. అయినా దాటింది. ఎందుకంటే .. లక్ష్మణుడి కంటే కూడా సీత ఎక్కువ ఎన్‌లైటెన్డ్ మాస్టర్! ఇది సీతకు తెలుసు కనుకనే తనకంటే తక్కువ ఎన్‌లైటెన్డ్ మాస్టర్ యొక్క గీతను ఆమె లోకకళ్యాణం కోసం దాటింది.

అయితే .. రాముడు సీతను “అగ్నిలో దూకు” అని గీసిన గీతను ఆమె శిరసావహించింది. ఆ గీతను దాటలేదు. ఎందుకంటే రాముడు తనకంటే ఎక్కువ ఎన్‌లైటెన్డ్ మాస్టర్ అని ఆమెకు తెలుసు!

అలాగే, కురుక్షేత్రంలో .. యుద్ధరంగం మధ్యలో కూర్చుని అస్త్రశస్త్రాలు పడవేసి “యుద్ధం చేయను” అని తన స్వంత గీత గీసుకుని భీష్మించుకున్న అర్జునుడికి “యుద్ధం చెయ్యి” .. అంటూ కర్తవ్యాన్ని బోధించే “గీత”ను గీసాడు శ్రీకృష్ణుడు.

“శ్రీకృష్ణుడు తన కంటే ఎక్కువ ఎన్‌లైటెన్డ్ మాస్టర్” అన్న సంగతి తెలుసుకున్న ఎన్‌లైటెన్డ్ మాస్టరే అర్జునుడు కనుక .. “Yes బాస్” అంటూ మారుమాట్లాడకుండా యుద్ధం చేసి మరీ విజయుడయ్యాడు.

అలాగే ఒకానొక రోగికి “మందులు తిను .. ఆపరేషన్ చేయించుకో .. శరీరం అంతా కోతలు పెట్టించుకో” అని ఒకానొక డాక్టర్ “ఆపరేషన్ గీత” గీస్తాడు!

“పిరమిడ్‌లో ధ్యానం చెయ్యి .. విశ్వమయ ప్రాణశక్తిని పొందు, రోగం తగ్గుతుంది” అని ఒకానొక పిరమిడ్ మాస్టర్ “ఆనాపానసతి గీత” గీస్తాడు.

ఇక్కడ “ఏ గీత దాటాలి? ఏ గీత దాటగూడదు?” అన్నది ఆ రోగి యొక్క ఎన్‌లైటెన్‌మెంట్‌ని బట్టి ఉంటుంది!

నాకు కూడా మా సంగీత గురువు గారు .. శ్రీపాద పినాకపాణి గారు .. “బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా” అనే త్యాగరాజ కృతి ని .. డెబ్బయి ఏళ్ళుగా వాడుకలో ఉన్న “సరి .. మప.. నిస.. సనిపమరిస” అనే హంసానంది రాగంలో అంతకంటే ముందున్న ‘ద’ .. ‘దైవతం’ కూడా కూర్చి నేర్పారు.

సంగీతపరంగా చేసిన పరిశోధనల ఆధారంగా .. మా గురువు గారు ఇతర గురువుల కంటే ఎన్‌లైటెన్డ్ మాస్టర్ కనుక ఆయన గీసిన ఆ గీతను నేను దాటలేదు! ఇది నా ఎన్‌లైటెన్‌మెంట్!

ఎందరెందరో పిరమిడ్ మాస్టర్లు ఇంతకు మునుపు ఎన్నో పూజలు చేసారు మరి ఎందరెందరో గురువుల చుట్టూ తిరిగారు. మరెన్నో ఆశ్రమాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఆ గీతలన్నీ దాటేసారు. చివరికి “PSSM గీతే అన్నింటికంటే ఉన్నతోన్నతమైన ఆధ్యాత్మిక మార్గం” అని తెలుసుకున్నారు.

ఇక్కడి “పిరమిడ్ గీత దాటకపోవడమే మన అద్భుత ఎన్‌లైటెన్‌మెంట్” అని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ పిరమిడ్ సొసైటీ గీతను దాటడం లేదు! ఇలా ప్రతిఒక్కరూ “ఏ గీత దాటాలి .. ఏ గీత దాటనవసరం లేదు” .. అన్న ఎరుక కలిగి ఉండటమే వారి వారి ఎన్‌లైటెన్‌మెంట్!