“ఏది నేనై వున్నానో .. అదే అంతటా వుంది”

 

 

“‘ఏది నేనై ఉన్నానో .. అదే అంతటా ఉంది’ అని తెలుసుకోవడమే ‘బ్రహ్మజ్ఞానం’. ‘బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి’ అంటే ‘బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే వాడూ .. తెలిపేవాడూ మరి తెలియజేయబడేదీ .. అంతా కూడా బ్రహ్మమే’” అంటోంది ముండకోపనిషత్!

బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్న బ్రహ్మర్షులంతా కూడా .. ‘ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా నశించి పోయేదే .. రకరకాల అనుభవాల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఇక్కడికి విచ్చేసిన ఆత్మ ఒక్కటే శాశ్వతం’ అన్న సత్యాన్ని తెలుసుకుని స్థితప్రజ్ఞులలా జీవిస్తూంటారు.

ఒకానొక భర్తగా, ఒకానొక భార్యగా, ఒకానొక బిడ్డగా, ఒకానొక తల్లిగా, ఒకానొక తండ్రిగా ఈ దృశ్యమాన ప్రపంచంలో తమ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూనే .. ఆత్మ విద్యా పారంగతులుగా ఆధ్యాత్మిక ఖగోళ సత్యాలను కూడా విస్తారంగా తెలుసుకుంటూ ఉంటారు.

“రకరకాల అనుభవజ్ఞానాలను పొందే ఈ క్రమంలో వారు తమలోనే నిక్షిప్తమై ఉన్న ఆత్మశక్తులను వెలికి తెచ్చుకుని .. శుద్ధచైతన్య స్వరూపాలలా వెలుగుతూ జీవితాన్ని ఒక కలలా గడిపేస్తూంటారు. ‘నిద్రనుంచి మేల్కొన్న తరువాత అక్కడ ఏమీ ఉండదు; కేవలం స్వీయ అనుభవజ్ఞానం మాత్రమే మిగిలి ఉంటుంది!’ అన్న సత్యం వారు తెలుసుకుంటారు” అంటూ బ్రహ్మజ్ఞాన విశేషాలను అతి సరళంగా వివరించారు.