“ధ్యానం .. మౌలిక ఇంగితజ్ఞానాన్ని కలుగజేస్తుంది”

   

విద్యార్థి జీవనానికి కావలసినవి “ఏకాగ్రత” .. “పట్టుదల” .. “జ్ఞాపకశక్తి” .. “ఏకసంధాగ్రాహ్యత”. “చురుకుదనం” .. “ఉత్సాహం” .. “శక్తి” ..

ఇవన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి వుంటారు కనుక ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూంటే వారు తమలోనే నిక్షిప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు.

సాధారణంగా మనం విద్యార్థులను “ఏమిటి మీ కోరిక?” అని అడిగినప్పుడు, ప్రతి ఒక్కరూ “నేను బాగా చదవాలి; నాకు నూటికి నూరు మార్కులు రావాలి” అంటారు.

“క్లాసులో నేనే ఫస్టు రావాలి” అనుకోవటం సరైన పద్ధతి కాదు .. “నాకు నూటికి నూరు మార్కులు రావాలి” అని కోరుకోవాలి .. అది శాస్త్ర సమ్మతం.

క్లాసులో నూరు మంది ఉంటే నూరు మందికి నూరు రావాలి కానీ ఏ ఒక్కడికో నూటికి నూరు మార్కులు వచ్చి మిగతా వారికి పది వస్తే మనకేం ఆనందం? మనతో పాటు అందరికీ నూటికి నూరు వచ్చినప్పుడే మనకు ఆనందం!

చాలామంది ప్రాపంచిక తల్లిదండ్రులు “క్లాస్‌లో నువ్వే ఫస్ట్ రావాలి .. నువ్వే ఇంజనీయర్ కావాలి .. నువ్వే డాక్టర్ కావాలి .. నువ్వే కలెక్టర్ కావాలి .. నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి” .. అంటూ చిన్నప్పటి నుంచీ పిల్లలకు నూరిపోస్తూ వుంటారు!

ఆ పిల్లలు కూడా పాపం అవే వింటూ .. చిలుక పలుకుల్లా అలాంటి మాటలే నిత్యం పలుకుతూ తమ తమ జీవితాలలో అంతులేని అవమానాలకూ, అపజయాలకూ గురవుతూ ఉంటారు. కాబట్టి “నేను అందరి కన్నా ముందుండాలి” అన్న భావన కంటే “అందరూ పక్వంగా ఉండాలి. అందరిలో నేను కూడా పక్వంగా ఉండాలి!” అన్న సరైన భావనతోనే పిల్లలు పెంచబడాలి.

“గెలుపు” .. “ఓటమి” అన్నవి విద్యార్థులకూ, విద్యార్థులు కాని వారికీ ప్రకృతి సహజం; వాటివల్ల అహంకారం, దర్పం, నిరాశా నిస్పృహలకు లోను కాకుండా సమంగా వుండడమే “వ్యక్తిగత గెలుపు” .. ఈ విధమైన ఆత్మజ్ఞానం పిల్లలకు అలవడాలంటే వారికి ధ్యానవిద్య లో ప్రవేశం ఉండాలి.

“ధ్యానవిద్య” అన్నది ఏ ఒక్క మతానికో ప్రత్యేకంగా సంబంధించినది కాదు. అది ఒక శాస్త్రం. ధ్యానం ద్వారా మనస్సును శాంతంగా వుంచుకోవడం అన్నది ఒక మౌలిక ఇంగితజ్ఞానం .. basic common sense.

నిర్ణీత సమయాల్లో నిర్ధేశింపబడిన నిరంతర ధ్యానాభ్యాసం ద్వారా .. విద్యార్థులలో ఒకవేళ ఏవైనా చెడు అలవాట్లు వుంటే .. ముఖ్యంగా అతిగా మాట్లాడటం, అతిగా తినటం, పనికిరానివి వినటం .. ఇలాంటివి ఏమన్నా వుంటే .. అవన్నీ కూడా అత్యంత సహజంగానే అదృశ్యమయిపోతాయి.

మన చేతికి ఐదు వ్రేళ్ళు వున్నాయి:

చిటికెన వ్రేలు Littele finger ఉంగరపు వ్రేలు Ring finger మధ్య వ్రేలు Middle finger చూపుడు వ్రేలు Index finger బొటన వ్రేలు Thumb finger

ఈ అయిదు వ్రేళ్ళ పరంగా విద్యార్థులు ఏం చేస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా విలసిల్లుతాయో తెలుసుకుందాం.

మొదటి వ్రేలు .. చిటికెన వ్రేలు: ఇది “ఆటల” కు సంబంధించింది. విద్యార్థి జీవితంలో ఆటలు చాలా ముఖ్యం. వారి భౌతిక శరీర ఎదుగుదలకూ మరి వారి మానసికోల్లాసానికీ ఆటలు తప్పనిసరి కనుక .. విద్యార్థులందరూ రకరకాల ఆటలు ఆడాలి.

రెండవ వ్రేలు .. ఉంగరపు వ్రేలు: ఇది “పాటల”కూ, “కళల”కూ సంబంధించింది. పిల్లలు పాటలు చక్కగా గొంతెత్తి పాడాలి; భజనలూ, ప్రార్థనలూ, బృందగీతాలు, ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తూంటే వాళ్ళల్లో చక్కటి సామాజికస్పృహ ఏర్పడుతుంది; రకరకాల కళల్లో వాళ్ళు నిష్ణాతులు కావాలి.

మూడవవ్రేలు .. మధ్యవ్రేలు: ఇది “చదువు”కు సంకేతం. మొట్టమొదటి వ్రేలు చదువు, రెండవ వ్రేలు చదువు, మూడవ వ్రేలు చదువు, నాల్గవ వ్రేలు చదువు, ఐదవవ్రేలు చదువు అంటూ అన్ని వ్రేళ్ళూ చదువులకే సంకేతాలయితే ఆ పిల్లలు, ఆ విద్యార్థులు సర్వనాశనం అవుతారు! “Too Much is Too Bad” కనుక “పిల్లలు చదువుకునే మరయంత్రాలు కారు; చదువు అనేది ఒకానొక పూర్ణ విద్యార్థి జీవనంలో ఒకానొక చక్కటి భాగం మాత్రమే” అనీ పెద్దలు తెలుసుకోవాలి.

బాగా చదువుకుంటూ పెద్దగా అవుతున్న కొద్దీ వారు చదువులో ప్రత్యేకతను సంపాదించాలి .. చదువులో చురుకుదనం ఉండాలి మరి మేధస్సు బాగా ఉపయోగింపబడాలి.

నాలుగో వ్రేలు .. ఉంగరపు వ్రేలు: ఇది “పనులు” అన్నదానికి సంకేతం!

ప్రతి విద్యార్థినీ, విద్యార్థి కూడానూ ఎన్నో పనులు చేసుకోవాలి. వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చూసుకోవాలి .. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సేవించాలి. ఇంటి పనులు చేయగలిగినన్ని చేసి స్కూలుకూ, కాలేజీలకూ రావాలి. కనుక ఈ నాల్గవ వ్రేలు “పనులు” అన్నదానికి సూచన.

ఐదవ వ్రేలు .. బొటన వ్రేలు: ఇది “ధ్యానం” అన్నదానికి సంకేతం. ప్రతిరోజూ ఆటలు, పాటలు, చదువులు, పనులు ఉన్నట్లు ప్రతిరోజూ ధ్యానం ఉండాలి.

ధ్యానం లేకపోతే .. ముఖ్యంగా విద్యార్థులకు .. ఏ రోజు కూడా పూర్తి కాజాలదు. ఈ ఐదు వ్రేళ్ళల్లో చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైంది బొటనవ్రేలు కనుక విద్యార్థి జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ధ్యానం. “ధ్యానం” అన్నది ఎంత బాగా ఉంటే మన ఆటలు అంత బాగుంటాయి; “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన పాటలు అంత బాగుంటాయి; “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన చదువులు అంతగా బాగుంటాయి. “ధ్యానం” అన్నది ఎంత అద్భుతంగా వుంటే అంత అద్భుతంగానూ మన పనులలో ప్రావీణ్యత సిద్ధిస్తుంది.