ధ్యానం అన్నింటికంటే గొప్పది

 

“నోటిని కట్టేస్తే మౌనం . . దానివలన మన శక్తిని ఆదా చేసినట్లు అవుతుంది.” “మహాత్మా గాంధీజీ వారంలో ఒకరోజు మౌనంగా ఉండేవారు.”

“మనస్సును మౌనంగా. . అంటే ఆలోచనలు లేకుండా . . ఉండటమే ధ్యానం; ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం, ప్రశాంతత, ఆధ్యాత్మికత, ఎదుగుదల కోసం చేయవలసింది ధ్యానమే.”

నలభై రోజులు ధ్యానం చేస్తే ‘ధ్యాని’ అవుతారు
మరో నలభై రోజులు ధ్యానం చేస్తే ‘యోగి’ అవుతారు
మరో నలభై రోజులు ధ్యానం చేస్తే ‘ఋషి’ అవుతారు
మరో నలభై రోజులు ధ్యానం చేస్తే ‘మహర్షి’ అవుతారు
మరో నలభై రోజులు ధ్యానం చేస్తే ‘బ్రహ్మర్షి’ అవుతారు

భౌతిక శరీరం చూపుడువ్రేలు
మాతాపితానుసారిణీ  అద్దంలో చూడవచ్చు.
మనస్సు ఉంగరపువ్రేలు
సమాజానుసారిణీ  చేసే కర్మలను బట్టి తెలుస్తుంది
బుద్ధి మధ్యవ్రేలు
కర్మానుసారిణీ  గురువుకి తెలుస్తుంది
ఆత్మ చూపుడువ్రేలు
సర్వాత్మానుసారిణీ  ధ్యానంలో దొరుకుతుంది
సర్వాత్మ బొటనవ్రేలు
ఏ ‘ అనుసారిణీ ‘ కాదు  చూడటానికీ ఏమీలేదు ..

 

“పరమాత్మలు అనేకం; సర్వాత్మ ఒక్కటే. నిస్వార్థంతో మహాత్ములు అవుతారు. ధ్యానంతో, ఆత్మానుభవంతో, బ్రహ్మాత్మానుభవంతో ‘పరమాత్ములు’ అవుతారు. కనుక అందరూ ధ్యానం చేయాలి.”

“మౌనం గొప్పది. భజన గొప్పది. అయితే ధ్యానం అన్నింటికంటే గొప్పది. ధ్యానం చేసే రోజు అతిగొప్పరోజు. ధ్యానం గురించి అందరికీ చెప్పి పుణ్యం మూటగట్టుకోవాలి. మాంసం మానమని చెప్తే పుణ్యం. మీ డబ్బు మీ మీ సంసారాలది. అయితే, మీ వాక్కు ప్రపంచానిది. కనుక ఈ వాక్కును ధ్యానం, జ్ఞానం గురించి చెప్పేందుకు ఉపయోగించుకుంటే ఎంత పుణ్యమో. ఈ పుణ్యాన్ని మాత్రమే మనం చనిపోయినప్పుడు మన వెంట తీసుకునివెళ్తాం.”

“ఆధ్యాత్మికత అంటే మనల్ని గురించి తెలుసుకోవటమే. ఎలాగైతే ఏనుగు తోక నుంచి తల వరకు తెలుసుకుంటేనే ఏనుగు గురించి తెలుస్తుందో అలాగే మన భౌతిక శరీరం కాక సూక్ష్మశరీరం గురించి తెలుసుకుంటేనే మన పూర్ణ స్వరూపం తెలుసుకున్నట్లు. కేవలం మన భౌతికశరీరం గురించి మనకు తెలిస్తే, కేవలం మన తోక గురించే మనకు తెలిసినట్లుగా వుంటుంది. ఈ రోజు నుంచి మనందరం మన పూర్ణస్వరూపాన్ని తెలుసుకునే లక్ష్యం పెట్టుకుందాం.

స్థూలశరీరం – ఏనుగు తోక
సూక్ష్మశరీరం – ఏనుగు కాళ్ళు
కారణశరీరం – ఏనుగు పొట్ట
మహాకారణశరీరం – ఏనుగు కుంభస్థలం

“జీవితంలో సఫలత పొందాలంటే మహాకారణ శరీరంలో విరాజిల్లాలి. మన విరాట్‌శరీరం బ్రహ్మాండం. ఇదే ‘ అహం బ్రహ్మాస్మి ‘ అంటే. స్థూలశరీరం నుంచి బ్రహ్మాండం వరకు అన్నీ అనుభవంలోకి రావాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఆకాశతత్వాన్ని పొందాలంటే వాయుతత్వమైన శ్వాసను పట్టుకోవాలి. అందుకే శ్వాసతో కలిసి వుంటే ముక్తిమార్గం. అదే తీర్థయాత్ర.. ముక్తిమార్గం కాశీలో, హిమాలయాల్లో లేదు. శ్వాసలో వుంది. శ్వాసానుసంధానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చేసి ముక్తులవ్వాలి.”