చతుర్విధ పురుషార్థాలు

“కామం + అర్థం = ధర్మం + మోక్షం”

 

వేదాంత పరిభాషలో ప్రతి జీవాత్మను `పురుషుడు’ అనీ .. విశేష లోకాలతో కూడిన శక్తిక్షేత్రాన్ని .. `ప్రకృతి’ అనీ అంటాం! ఇలా పురుషుడు `ఆత్మక్షేత్రంగా’ మరి ప్రకృతి `శక్తిక్షేత్రం’గా .. ఒక శుద్ధ చైతన్యం లేదా మహామూల చైతన్యం నుంచి బయటకు వచ్చి రెండుగా విభజింపబడ్డాయి. ఇది సృష్టి యొక్క రచనా కార్యక్రమంలోని మూలరచనా సిద్ధాంతం.

అంటే ఒకానొక మూలచైతన్యం నుంచి ఒక శక్తిక్షేత్రంగా బయటికి వచ్చిన “ప్రకృతి శక్తి” అనేక డైమెన్షన్స్‌‌లోని .. అనేక లోకాలుగా మారుతూ .. అతల, వితల, సుతల, కుతల, పాతాళ, తలాతల .. మరి భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, మహర్లోక, తపోలోక మరి సత్య లోకాలుగా విరాజిల్లుతూ ఉంటుంది.

అలాగే మూల చైతన్యం నుంచి ఒక ఆత్మక్షేత్రంగా విడివడి బయటికి వచ్చి అనేక అంశాత్మలుగా విడివడి ఖనిజలోకంలో ఉన్నప్పుడు ఖనిజాత్మగా, వృక్షలోకంలో వృక్షాత్మగా, జంతులోకంలో ఉన్నప్పుడు “జంతు ఆత్మ”గా మానవలోకంలో ఉన్నప్పుడు “మానవాత్మ”గా దైవలోకంలో ఉన్నప్పుడు “దైవాత్మ”గా మరి ప్రకృతి లోకంలో ఉన్నప్పుడు “ప్రకృతి ఆత్మ”గా .. ఇలా రకరకాలుగా జీవాత్మలు తయారవుతాయి.

ఇలా మొత్తం ప్రకృతి క్షేత్రాన్ని .. “ప్రకృతి” అన్నట్లే మొత్తం ఆత్మక్షేత్రాన్ని “పురుషుడు” అంటారు.

 

***

ఇలా ఆత్మపరిణామంలో భాగంగా మానవలోకంలోకి ప్రవేశించిన “పురుష ఆత్మకు” నాలుగు విధాలైన ధర్మాలుంటాయి. వీటినే 1) ధర్మ 2) అర్థ 3) కామ 4) మోక్షాలనే “చతుర్విధ పురుషార్థాలు” అంటారు.

 

“చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|”

(భ| 4 అ|| 13 శ్లో||)

“బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారిని వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమానికి నేనే కర్తనైనా, శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను వాస్తవంగా `అకర్త’గా తెలుసుకొనుము.”

జీవుల గుణకర్మ విభాగాలను బట్టి వాటి అంతరంగం “జీనోటైప్ –Genotype” అనీ, బహిరంగం, “ఫీనోటైపు – Phenotype” అన్నీ విభజించబడ్డాయి. కొంచెం బయాలజీ పరిజ్ఞానం ఉన్నవాళ్ళెవరికైనా ఈ పదాలకు అర్థం తెలుస్తుంది. ఇక్కడ “జీనోటైప్ –Genotype” అంటే జీవుడి కర్మకు సంబంధించిన `గుణసముదాయం’ అనీ “ఫీనోటైపు – Phenotype”.. అంటే బహిరంగంగా కనిపించే ఆ కర్మయొక్క `రూపురేఖలు’ అనీ చెప్తాం.

 

“ యథా గుణః తధా కర్మ
యథా అంతరంగః తథా బహిరంగః”

 

అంటే నీ లోపల ఏదుందో అదే బయటికి వస్తుంది మరి నీవు చేస్తున్న కర్మలు నీ గుణాలను బట్టే ఉంటాయి.. అని అర్థం. సృష్టిక్రమంలో గుణాలు సదా మారుతూనే ఉంటాయి. ఇలా మారుతూన్న గుణాలను బట్టి మారే కర్మలనే `చతుర్వర్ణాలు’ అంటారు.

అలాగే ఆ “మూలచైతన్యం” నుంచి ఒకానొక పురుషక్షేత్రం .. ఒకానొక ప్రకృతి క్షేత్రం వచ్చి ఒకదానితో ఒకటి లీనం అయి పుంఖానుపుంఖాలుగా లోకాలు ఏర్పడి రకరకాలు గుణాల కారణంగా రకరకాల జీవాత్మలు పుట్టుకొచ్చాయి. “వీటన్నింటికీ నేను అవ్యయుడిలా, అకర్తగా మరి సాక్షిలాగా మాత్రమే ఉన్నాను సుమా! అవి నాలో నుంచి వచ్చినా కూడా .. నేను మాత్రం వ్యయం కాలేదు .. `అవ్యయం’ గానూ మరి `అకర్త’ గానూ మాత్రమే ఉన్నాను” అని అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో.

అంటే .. ఒకానొక తల్లి బిడ్డను కన్నప్పుడు ఆ తల్లి తన శరీర భాగాన్ని కోసుకుని తను వ్యయం అయ్యి పిల్లలను పుట్టించిందా? లేదే?! తల్లి తల్లిగానే ఉండి తన స్వంత ఇచ్ఛానుసారం బిడ్డను పుట్టించిందంతే! ఆ పిల్లలు కూడా తమ స్వంత ఇచ్ఛానుసారమే ఆ తల్లికి బిడ్డలుగా జన్మించారు. ఇక్కడ ఎవరికి ఎవరూ కర్తలు కారు. ఎవరూ వ్యయం కాబడలేదు.

కనుక ఇలాంటి మూలసూత్రాల సారాన్నంతా అవగాహన చేసుకున్న యోగీశ్వరులంతా కూడా ధ్యానంలో కూర్చుని కళ్ళు రెండూ మూసేసుకుని ఏంచేస్తూంటారయ్యా అంటే .. “తమ తమ దివ్యనేత్రాలతో కోటానుకోట్ల లోకాలనూ .. మరి పుంఖానుపుంఖాలుగా జన్మలు తీసుకుంటూన్న జీవులనూ చూసి విస్మయంతో ఆ సృష్టి యొక్క రచనను తిలకిస్తూంటారు”.

ఇలాంటివన్నీ ఆత్మక్షేత్రంలోనే వీక్షించగలుగుతారు. కనుక వాళ్ళను “ఋషులు”, “ద్రష్టలు” అంటారు. వాళ్ళు తమ తమ అనుభవాలను విశ్లేషించినప్పుడు .. వ్యాఖ్యానం చేసినప్పుడు .. వాటిని మనం శ్రద్ధగా వినాలి. దానినే మనం “శ్రుతి” అంటాము. అలా శ్రుతిచేసి .. వాటిని చక్కగా మననం చేసి “స్మృతి”లో ఉంచుకోవాలి.

 

***

నాలుగు గుణాలు నాలుగు రకాలైన కర్మలకు కారణభూతాలు అవుతూ ఉంటాయి. అవే “తమోగుణం”, “రజోగుణం”, “సాత్త్వికగుణం” మరి “శుద్ధసాత్త్వికం”. మిగతా గుణాలన్నీ అలాగే ఉన్నా కూడా ఈ చివరి శుద్ధసాత్త్విక గుణమే మరి “నిర్గుణం” గా కూడా అయిపోతుంది.

తమోగుణ కర్మలు చేసేవారిని `శూద్రులు’ అనీ, రజోగుణ కర్మలు విశేషంగా చేసేవారిని `వైశ్యులు’ అనీ, సాత్త్విక గుణం విశేషంగా కలిగి ఉండి కర్మలనాచరించే వారిని `క్షత్రియులు’ అనీ సదా శుద్ధసాత్త్విక గుణాలతో కర్మలనాచరించే వారిని `బ్రాహ్మణులు’ అనీ అంటాము.

ఇలా తమోగుణ ప్రధానమైన కామ్యక ప్రవృత్తి మాత్రమే ఉంటే “శూద్రుడి” గానూ, కామప్రవృత్తి + అర్థప్రవృత్తి ఉంటే “వైశ్యుడి” గానూ, కామప్రవృత్తి + అర్థప్రవృత్తి + ధర్మప్రవృత్తి, ఈ మూడూ కలిసి ఉంటే ఒకానొక “క్షత్రియుడి” గానూ, కామ + అర్థ + ధర్మ + మోక్ష ప్రవృత్తులు నాలుగు కలిసి ఉంటే ఒకానొక “బ్రాహ్మణుడి” గానూ జన్మలు తీసుకుంటూ .. నాలుగంచెలుగా వ్యవహారం నడుపుతూ ఉంటాం! చివరిస్థితి అయిన బ్రాహ్మణవర్ణంలో మోక్షస్థితిలో .. నిర్గుణస్థితిలో సదా ఉండగలిగితే ఇక మళ్ళీ మానవ జన్మలో జన్మించాల్సిన అవసరం రాదు. అక్కడి నుంచి పైలోకాలైన దేవలోకాలకే వెళ్తాము.

మనం ఆ “బ్రాహ్మణ ప్రవృత్తి” అంటే .. “బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణః” అన్న స్థితిలోనే ఉన్నట్లయితే .. “నేను దేహమే” అన్న స్థితి నుంచి అహం బ్రహ్మాస్మి .. అంటే “నేనే మొత్తం సృష్టికర్తను” .. అనే స్థితికి అంటే ఒక రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త వంటి బ్రాహ్మణోత్తములుగా ఎదిగి మరి నిర్గుణస్థితికి లేదా జన్మరాహిత్యస్థితికి చేరుకుని .. ఆ మూలచైతన్యంలోకి మళ్ళీ చేరుకుంటాం .. పూర్ణజ్ఞానంతో!!

ఒకానొక “పురుషాత్మ” మొదట తామసప్రవృత్తితో కూడిన శూద్రవర్ణంలో జన్మ తీసుకున్నప్పుడు “అహం దేహోస్మి” అంటూ “నేను దేహమే” .. “నేను ఈ శరీరమే .. ఇంతకన్నా మరేమీ కాదు” అనుకుంటాడు. వాళ్ళకు కామం కావాలి. ఇంకా బాగా తినాలి, ఇంకా బాగా పడుకోవాలి అనుకుంటూ భౌతికపరమైన సౌఖ్యాల కోసమే జన్మంతా వినియోగిస్తారు. ఇది ఆత్మయొక్క “శైశవస్థితి”.

అయితే ఇలాంటి శైశవాత్మ స్థితి నుంచి .. “నేనొక దేహమే కాదు .. ఒక మనస్సుని కూడా” అని తెలుసుకుంటూ ఒక్కోజన్మలో ఒక్కోమెట్టు ఎక్కుతూ క్రమంగా వైశ్యవర్గంతో జన్మ తీసుకుంటుంది ఆత్మ. ఇలా మనస్సుని ఉపయోగిస్తూ మెల్లిగా “మంచి ఏమిటి? చెడు ఏమిటి?” అనే అనుభవాలు గడిస్తూ “బాలాత్మ స్థాయికి” చేరుకుంటుంది!

ఇక అక్కడ నుంచి మెల్లిగా “బుద్ధిని” ఉపయోగించి మంచి, చెడుల ధర్మనిర్ధారణ చేసుకుంటూ మెల్లమెల్లగా దేహం + మనస్సు + బుద్ధి కలిసి పనిచేసే స్థాయిలోని క్షత్రియవర్గంలో జన్మ తీసుకుంటుంది. మరి ఇదే “యౌవనాత్మస్థాయి”.

ఇలా క్రమక్రమంగా కొన్ని జన్మల్లో అనుభవాన్ని గడించిన పురుషాత్మ “నేను శరీరమే కాదు .. మనస్సు + బుద్ధి + ఆత్మ” అని కూడా తెలుసుకుని నేను అంతర్జ్యోతిని .. నేను బ్రహ్మను .. “మమాత్మ సర్వభూతాత్మా” అని తెలుసుకుని ఆత్మ క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. “బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణః” అన్నట్లుగా “నేనొక బ్రాహ్మణుడిని” అని తెలుసుకుంటుంది. అదే “ప్రౌఢాత్మ” స్థాయి.

ఇలా అంటే 100% కామ ప్రవృత్తిలోనే ఉంటూ `అహం కామోస్మి’ అన్న స్థితి నుంచి క్రమక్రమంగా `అహం కామోస్మి + అర్థోస్మి’ 50% + 50% చొప్పున ఉంటూ అనుభవాలు గడిస్తూ క్రమంగా “అహం కామోస్మి + అర్థోస్మి + ధర్మోస్మి” అంటూ 25% + 25% + 50% చొప్పున ఉంటూ అనుభవాలు గడిస్తూ క్రమంగా “అహం కామోస్మి + అర్థోస్మి + ధర్మోస్మి + మోక్షోస్మి” అంటూ చివరికి అన్ని గుణాలకూ అతీతంగా 100% మోక్షస్థితిలో ఉండి నిర్గుణుడిగా మారుతుంది.

కామం నుంచి తమోగుణం, అర్థం నుంచి రజోగుణం, ధర్మం నుంచి సాత్త్వికగుణం మరి మోక్షం నుంచి శుద్ధ సాత్త్వికగుణం ఉద్భవించాయి. కనుక ఇలా మనిషి యొక్క వివిధ గుణాలను బట్టే అంతరంగం `జీనో – టైపు’ మరి బహిరంగం `ఫినో – టైపుగా’ ఉండి ఆ రెంటిని బట్టే అతడు చేసే వివిధ కర్మలుంటాయి. కనుక మనిషి పరిపూర్ణంగా పరిణితి చెందాలంటే కామం + అర్థం + ధర్మం + మోక్షం నాలుగూ కావాలి.

 

***

కొందరు “కామం అసలే ఉండకూడదు” అంటారు. ప్రతి ఒక్క వ్యక్తికీ మాట్లాడే హక్కు ఉంది! అయితే మాట్లాడే మాటలో పట్టు ఉండాలి! తెలియనివాళ్ళూ మాట్లాడుతారు; కొద్దిగా తెలిసినవాళ్ళూ మాట్లాడుతారు; సంపూర్ణంగా తెలిసినవాళ్ళూ కూడా మాట్లాడతారు. అయితే ఒకానొక బుద్ధుడు మాట్లాడితే .. అది సరిగ్గా ఉంటుంది .. మరి వినడానికి హాయిగా ఉంటుంది. అది “సత్యయుతంగా” మరి “సృష్టిగతంగా” ఉండి లోకకళ్యాణానికి కారణభూతమవుతుంది. అదే ఒక ఏమీ తెలియనివాడు లేదా తెలిసీ తెలియనివాడు మాట్లాడితే .. అది వ్యక్తిగతంగానే ఉంటుంది కానీ సృష్టిగతంగా మాత్రం ఉండదుగాక ఉండదు. అది అసలు సరిగ్గా ఉండే ప్రశ్నేలేదు.

కనుక “మోక్షం కావాలంటే కామానికి, అర్థానికి, ధర్మానికి దూరంగా సంసారాన్ని వదిలిపెట్టేసి ఏ హిమాలయాలకో వెళ్ళాలి” అంటూ చెప్పేవాళ్ళంతా కూడా ఏమీ తెలియనివాళ్ళు మాత్రమే! తను ఏ స్థితిలో జన్మ తీసుకున్నాడో ఆ సహజ స్థితిని “ప్రకృతి” అనీ మరి ఆ స్థితిని తృణీకరించే అసహజస్థితిని “వికృతి” అని అంటాం! ఇలా ప్రకృతిని ఎవరైతే ఎదుర్కొంటూ మరి విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ వికృతంగా ఉంటారో వారికి ప్రగతి ఉండదు.

***

“కామం” అనే తప్పనిసరి పురుషార్థాన్ని ప్రకృతి పరంగా అనుభవిస్తూ సుఖంగా ఉంటూ క్రమక్రమంగా ఆత్మప్రగతి పథంలో ముందుకువెళ్ళి “మనస్సు స్థితి” లోకి ప్రవేశిస్తూ “అర్థం” అనే ఇంకొక తప్పనిసరి పురుషార్థాన్ని చేరుకుంటాము.

అక్కడ కామ ప్రవృత్తి క్రమంగా తగ్గుతూ వైశ్యస్థితిలో ఉన్న మానసిక కోరికలు .. అంటే ప్రక్కవారిపై ఆధిపత్యం చెలాయించాలి. “సర్పంచ్ కావాలి, ఒక IAS కావాలి, ఒక IPS కావాలి, MLA కావాలి” అనేవి మానసికపరమైన కోరికలు వస్తాయి. అంటె శరీరంపై ధ్యాస తగ్గి మనస్సుపై ధ్యాస కేంద్రీకరించబడి కామపరమైన కోర్కెలతో పాటుగా మానసికమైన కోర్కెలు 50% +50% గా ఉంటాయి. ఇది ఇదే “అర్థపరమైన పురుషార్థం”.

ఇలా కొన్ని జన్మలు గడిపేస్తూ, దేహం + మనస్సు + బుద్ధి ని కూడా ఉపయోగించుకునే “ధర్మం” స్థితికి వస్తాయి. ఇంతవరకు ఉన్న దేహ + మనస్సు స్థితుల్లో “భౌతికమైన సైన్స్” ఉపయోగపడుతుంది. ఇక ఇక్కడ దీని అవసరం ఎంతమాత్రం ఉండదు. అక్కడ అంతా ఆధిభౌతికత మరి “ఆధ్యాత్మికత” పనిచేస్తాయి. మంచి చెడు విచక్షణ చేసే బుద్ధి ప్రవేశించి క్షత్రియత్వం.. అంటే ధర్మాన్ని ప్రతిబింబించే ప్రజాక్షేమనికి సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతూంటాయి. కామపరంగా, అర్థపరంగా 25% + 25% చొప్పున ఉంటూ కూడా మరి ధర్మపరంగా 50% జీవనం గడుపుతూ క్రమంగా ప్రగతి పథంలో ముందుకు వెళ్తాడు.

అలా కొన్ని జన్మలు గడిపేస్తే దేహం + మనస్సు + బుద్ధి ఉపయోగించి కామపరంగా అర్థపరంగా మరి ధర్మపరంగా పనులు చేస్తూ “అహం బ్రహ్మాస్మి” అనే నిజ ప్రకృతిని అవగాహనలోకి తెచ్చుకుంటూ .. అక్కడి నుంచి సాక్షీతత్త్వం మొదలై .. “అయమాత్మా బ్రహ్మ” అని నిజ విరాట్ స్వరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఆ మూలచైతన్యం వద్దకు చేరుకుంటారు. ఇక్కడే అతనికి ధ్యానం కావాలి. మెడిటేషన్ కావాలి. స్వాధ్యాయం కావాలి .. మరి సజ్జన సాంగత్యం కావాలి.

ఇలా ఇవన్నీ నేను నా స్వానుభవంతో తెలుసుకున్నాను. ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ లేవు. నేను స్వయంగా అనుభవించింది మీకు తెలియజేస్తున్నాను. నా జీవిత సత్యాలను నేను ప్రకటించడం నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. మీరు దీన్ని స్వీకరించాలా లేదా, .. అవగాహన చేసుకున్నారా లేదా, .. అన్వయించుకున్నారా లేదా అన్నది మీ ఇష్టం, మీ ధర్మం.

 

***

ఇలా కామాన్ని, అర్థాన్ని, ధర్మాన్ని మరి మోక్షాన్ని గురించిన నేను తెలుసుకున్న సత్యాలన్నీ చెప్పకపోతే నాకు అసంతృప్తి. నా ముందు ఒక్కళ్ళు కూర్చున్నా .. లక్షలమంది కూర్చున్నా .. నేను చెప్పే సత్యంలో మార్పు ఉండదు .. మరి నా ధర్మాచరణలో మార్పు ఉండదు. ఇలా నన్ను నేను ప్రతి క్షణం ఎదిగించుకుంటూ మీ అందరినీ ఎదిగిస్తూ ప్రగతిమార్గంలో ప్రయాణిస్తూ నా యొక్క అసలు విరాట్ స్థితి .. నా యొక్క మూలచైతన్య ప్రకృతి .. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పోవడమే నా `మోక్ష స్థితి’. ఇదే ఒకానొక పిరమిడ్ మాస్టర్ స్థితి.

25% కామం, 25% అర్థం, 25% ధర్మం, 25% మోక్షం! పర్ ఫెక్ట్ లీ బ్యాలెన్స్‌డ్ స్థితి! పర్‌‍ఫెక్ట్ మాస్టర్ యొక్క జీవితం!

శ్రీకృష్ణుడి జీవితాన్ని చూడండి! కృష్ణుడు తన కామాన్ని తను చూసుకున్నాడు; హాయిగా అష్టభార్యలతో ఎంజాయ్ చేసాడు! తన అర్థాన్ని తను పాటించాడు; చక్కగా రాజై రాజ్యాన్ని పాలించాడు, ఎన్నో సంపదలను కూడగట్టుకున్నాడు! తన ధర్మాన్ని తాను పాటించాడు; చెప్పవలసిన వాళ్ళకు చెప్పాల్సినవన్నీ చెప్పి జగద్గురువయ్యాడు! మరి పుట్టినప్పటి నుంచీ సదా మోక్షస్థితిలో ఉన్నాడు; భగవంతుడయ్యాడు.

కనుక ఇలా చతుర్విధ పురుషర్థాలను సమంగా ఆచరించే వాడినే “పురుషోత్తముడు” అంటాం!!