“చైతన్య పరంపరా క్రమం”

 

ప్రతి ఒక్క ఆత్మ కూడా తన నిరంతర పరిణామ క్రమంలో భాగంగా ఒక్కొక్క అనుభవ జ్ఞానం కోసం ఒక్కొక్క చైతన్య తలంలో జన్మ తీసుకుంటూ తనను తాను నిరంతరంగా పరిపుష్టం చేసుకుంటూ ఉంటుంది. అవి వరుసగా ..

1. మౌలిక మనుగడ చైతన్యతలం – Survival Consciousness: ఇది “ఆత్మప్రయాణం”లో ప్రాథమిక దశ!

ఇక్కడ స్వీయ స్పృహను బొత్తిగా కోల్పోయిన ఆత్మ .. తన సహజశక్తియుక్తులను మరచిపోయి కేవలం ఈ భౌతిక ప్రపంచంలో తన మనుగడకు మూలాధారాలైన “కూడు”, “గూడు”, “గుడ్డ” ల కోసమే నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. “నా ఇల్లు”, “నా ఉద్యోగం”, “నా తిండి” అంటూ కొన్ని జన్మలు గడిపాక ఆ అనుభవ జ్ఞానంతో ఆత్మ .. తనను తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా మలచుకుంటుంది.

2. ప్రత్యేక వ్యక్తిత్వపు చైతన్యతలం – one-up Consciousness: “ఆత్మ” ఈ తలంలో “ఈ ప్రపంచంలో కేవలం కూడు, గూడు, గుడ్డ సంపాదించడానికి మాత్రమే నేను పుట్టలేదు; ఇంకా ఏదో ప్రత్యేకతను సాధించాలి” అన్న ఆశయంతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది.

ఒకానొక రాజకీయ నాయకుడిగానో, ఒకానొక సామాజిక కార్యకర్తగానో .. ఒక సెలబ్రెటీ గానో ఎదుగుతూ “తలచుకుంటే నేను ఏదైనా సాధించగలను” అన్న ధీమాతో ఉంటుంది.

ఈ దశలో డబ్బు, వనరులు, స్నేహితులు, బంధువులు వారి చైతన్యం చుట్టూ తిరుగుతూంటాయి.

3. నిర్వేదపు వ్యక్తిత్వ చైతన్య తలం – Futulity Consciousness: ప్రత్యేక వ్యక్తిత్వ చైతన్యతలంలో అనేకానేక జన్మలు గడుపుతూ మరి “ఆత్మ” అనేకానేక క్రొత్త క్రొత్త కోణాలలో తన స్వీయ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకుంటూ డబ్బుతో పాటు కీర్తి శిఖరాలను చేరుతుంది. ఇక అక్కడ అది ఆపటాటోపాలన్నీ ఎంత తాత్కాలికమో .. మరి వాటికోసం జన్మలు తీసుకుంటూ సమయాన్ని నిష్ప్రయోజనం చేసుకోవడం ఎంత అవివేకమో .. అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది.

అంతవరకూ “నా వాళ్ళు” .. “నా సామ్రాజ్యం” అంటూ తాను కట్టుకున్న ప్రాపంచిక మేడలన్నీ పేకమేడలలా కుప్పకూలిపోవడంతో అది ఒక్కసారిగా నిర్వేదంలో పడిపోయి .. మానవ మూర్ఖ సంబంధ బాంధవ్యాలను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.

అలా చూస్తూ ఆత్మకు కొన్ని జీవిత కాలాలు గడిచిపోతాయి.

4. త్రికరణశుద్ధి చైతన్యతలం – Sincerity Consciousness: అప్పుడు “ఆత్మ” .. “ఈ భూమిపై జన్మ తీసుకునే లక్ష్యం .. కేవలం ప్రాపంచికంగా ఎదగడం మాత్రమే కాదు; అంతకంటే ‘ఆధ్యాత్మికమైనది’ మరేదో నిజంగా ఉంది” అన్న ఆలోచనలో పడుతుంది.

ఆ “మరేదో లక్ష్యం” కోసం త్రికరణశుద్ధిగా వెతుకులాడుతూ “ఆత్మ” మరిన్ని మరిన్ని జన్మలను గడుపుతుంది.

ఈ దశలో “ఆత్మ” తన కుటుంబంతో కలిసి ప్రాపంచికంగా ఎంత గొప్పహోదాలను కలిగి ఉన్నా .. మరి డబ్బూ, ఆస్తిపాస్థులూ దండిగా ఉన్నా .. వాటిని తృణప్రాయంగా ఎంచుతూ .. “ఆత్మాన్వేషణ”లో మునిగి తేలుతూ ఉంటుంది.

5. తీవ్రతర సాధనా చైతన్యతలం – Seriousness Consciousness: ఇది “ఆత్మ” యొక్క పరిణామక్రమ ఉన్నతికి “సింహద్వారం” వంటి తలం.

ఇక్కడ ఆత్మ తన అన్ని ప్రాపంచిక స్థాయిలకు అతీతంగా వ్యవహరిస్తూ నిరంతరం సత్యాన్వేషణలో నిమగ్నమై ఉంటుంది. ఈ దశలో ఆత్మకు “సరియైన ధ్యానం” లభిస్తే అది ఒక వరంలా మారి దాని పురోగతిని మరింత వేగవంతం చేస్తుంది.

అలా తీవ్రతర సాధనా చైతన్యతలంలో కొన్ని జన్మలు గడిపిన ఒకానొక “ఆత్మ” .. తన స్వస్థితిని గుర్తించి .. తనలో నిక్షిప్తమైన ఉన్న స్వీయశక్తులను ఎరుకలోకి తెచ్చుకుంటుంది. విశ్వనియమాలను అవగాహన చేసుకుంటూ అన్నీ తెలిసిన “నిండుకుండ” లా సాక్షీతత్వపు చైతన్య తలంలో ప్రవేశిస్తుంది.

6. సాక్షీతత్వపు చైతన్యతలం – Witness Consciousness: ఇక్కడ “ఆత్మ” తన విశ్వవ్యాపకత్వాన్ని అనుభూతి చెందుతూ .. కళ్ళముందు జరిగే ప్రతి ఒక్క సంఘటననూ ఒక “సాక్షి”లా గమనిస్తూ ఉంటుంది.

ఈ భూమి మీద జన్మ తీసుకోవడంలోని పారమార్థికతను ఎరుకలో ఉంచుకుంటూ జీవిస్తుంది. మామూలుగా బయటికి చూడడానికి అందరిలాగే ప్రాపంచిక జీవితం గడుపుతూ ఉన్నా అంతరంగంలో మాత్రం తీవ్రతరమైన సాధనలో మునిగి తేలుతూ తన పూర్ణాత్మతో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇందులో భాగంగానే ఒక్కోసారి ఆ ఆత్మ లోకోద్ధరణ నిమిత్తం తన స్వీయ నిర్ణయంతో క్రింది స్థాయి చైతన్య తలాలలో కూడా జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆ విశిష్టమైన ఆత్మ అత్యంత ఎరుకతో ఆయా జన్మల కర్తవ్య కర్మలను నిర్వహిస్తూ మరింత ఉత్తమ అనుభవజ్ఞానాన్ని పొందుతూ మరింత ఉన్నత చైతన్యతలాలకు చేరుకుంటూ ఉంటుంది.

7. నిర్గుణ – మందస్మిత చైతన్యతలం – Smiling Consciousness: జీవిత చక్ర తత్త్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని అంతరంగ ప్రపంచపు జ్ఞానంతో పరిపుష్ఠమైన “ఆత్మ” .. భూత భవిష్యత్ వర్తమాన కాలాల పట్ల సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉంటూ బాహ్యప్రపంచపు కార్యకలాపాలన్నింటిని “చిరునవ్వు” తో నిర్వహిస్తూ ఉంటుంది.

ఈ స్థితిలో ఆత్మ ..ఒక్కోసారి క్రిందిస్థాయి చైతన్యతలాలలో ఉండి పై స్థాయికి ఎదగడానికి కృషి చేస్తూన్న ఇతర విధేయ ఆత్మలకు సహాయం చెయ్యడానికి అనివార్యంగా క్రింది స్థాయిల ఆత్మల కుటుంబాలలో జన్మ తీసుకోవడం కూడా జరుగుతుంది. దీనినే “జోకర్ చైతన్య తలం” అంటాం.

8. నిర్గుణ – జోకర్ చైతన్యతలం – Joker consciousness: ఇది చైతన్యతలాలన్నింటిలో అత్యున్నతమైన “గ్రాండ్ మాస్టర్” తలం.

ఈ తలంలో ఆత్మకు తన జీవితంతో పాటు అందరి జీవితాలలోని అన్ని కోణాలపట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంటుంది.

పేకాటలో “జోకర్” అన్ని సీక్వెన్స్‌లలో ఒదిగిపోయి వాటి విలువను పెంచి ఆటను “షో” చేయించినట్లు .. “నిర్గుణ – జోకర్” చైతన్య తలంలో వెలిగే ఉన్నతోన్నతమైన ఆత్మ .. ఈ ప్రపంచంలోని ఏ సీక్వెన్స్‌లో తన పాత్రను పోషించాల్సి వచ్చినా .. అందులో నిర్గుణ జోకర్‌లా ఉండి అసంపూర్ణమైన సీక్వెన్స్‌ను పరిపూర్ణం చేసి దాని విలువను పెంచి “జీవితం అనే ఆటను” 100% రక్తి కట్టిస్తూ ఉంటుంది.

ఒకానొక గొప్ప ‘ప్రేమికుడి’గా తన ప్రేమ పట్ల .. ఒకానొక ‘గొప్ప తండ్రి’గా తన పిల్లల పట్ల .. ఒకానొక ‘రాజనీతిజ్ఞుడి’లా రాజకీయాల పట్ల .. ఒకానొక మంచి ‘ఉపాధ్యాయుడి’లా విద్యార్థుల పట్ల ఈ నిర్గుణ జోకర్ ఆత్మ తన అత్యున్నతమైన పాత్రను పోషణ చేస్తూ బహుజన శ్రేయోదాయకంగా వెలుగుతూ ఉంటుంది.

శ్రీకృష్ణుడు, జీసస్‌లాంటి వారు ఈ శిఖరాగ్ర చైతన్య తలానికి మూర్తీభవించిన ప్రతీకలు.