“భజగోవిందం అంటే ధ్యానమే”

 

శ్రీ ఆదిశంకర విరచిత భజగోవిందం శ్లోకాలకు బ్రహ్మర్షి పత్రీజీ చే ధ్యాన ఆత్మజ్ఞాన వివరణ మనందరి కోసం …

“భజగోవిందం భజగోవిందం గోవిందమ్ భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్‌కరణే||”

“ఓ మూర్ఖమైన మనస్సా! ‘గోవిందుణ్ణి’ భజించుకో! .. ‘గోవిందుణ్ణి’ భజించుకో! ఎంచేతనంటే తప్పనిసరి అయిన మృత్యువు వచ్చి పట్టుకునేటప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు!”

” ‘గో’ అంటే ఇంద్రియాలు! ‘గోవిందం’ అంటే ఇంద్రియాలకు ఇంద్రియమైన, మరి ఇంద్రియాలకు విందు చేసే ‘ఆత్మ’! ఇంద్రియాలను నియంత్రించేదే, అంటే పరిపాలించేదే ‘ఆత్మ’! ప్రతి బ్రహ్మజ్ఞానీ, ప్రతి ఆత్మజ్ఞానీ గోవిందుడే! ఆత్మజ్ఞానమే, బ్రహ్మజ్ఞానమే, ‘గోవిందం!’”

ఆత్మజ్ఞానాన్ని ఎరుగని మతి ఎప్పుడూ మూఢమే! మూఢమైన మతి ఎంత త్వరగా ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటే అంత త్వరగా చక్కబడుతుంది. జీవితకాలపు చరమదశలలో మేల్కొనడం అతి కష్టం. పిన్నవయస్సులోనే పిన్నత్వాన్ని పోగొట్టుకోవాలి. ఎలా? ‘ఆత్మ యొక్క భజన’ ద్వారా! ‘ఆత్మకోసం భజన’ ద్వారా! ‘ఆత్మచే చేయబడిన భజన’ ద్వారా! ” ‘ఆత్మభజన’ అంటే ధ్యానం.”

“మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్! యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం||”

“ఓయీ మూఢుడా! ‘ధనం రావాలి’, ‘రావాలి’ అన్న దురాశను విడిచిపెట్టు .. సత్యంతో నిండిన బుద్ధితో మనస్సును తృష్ణారహితంగా చేసుకో! నీ నిజకర్మల ద్వారా లభించిన విత్తంతో తృప్తిపడి మనస్సును ఆనందింప చేసుకో!”

“ఎంతసేపూ ‘డబ్బు’ .. ’డబ్బు’” ..! అదే మూఢుల ‘పరిజ్ఞానం’. ఈ మూఢుల పరిజ్ఞానాన్ని వెంటనే వదిలిపెట్టేయాలి. ఈషణత్రయంలో ధనేషణ అన్నిటికన్నా దారుణమైనది. ఈ ధన తృష్ణను సత్యమైన బుద్ధితో వధించాలి. కష్టపడి చెమటోడ్చి, నిజాయితితో సంపాదించిన ధనంతో చక్కగా వినోదంలో ఓలలాడవచ్చు. అంతేకానీ అన్యాయార్జితమైన, అక్రమమైన ధనం మనిషి మానసిక ఆధ్యాత్మిక పతనానికి రాచబాట వేస్తుంది. సద్భుద్ధి అనేది ‘ధ్యానం’ ద్వారానే, అంటే ‘భజగోవిందం’ ద్వారానే సాధ్యం.”

“నారీ స్తనభర నాభీదేశం దృష్ట్యా మా గా మోహావేశమ్! ఏతన్మాంస వసాది వికారం మనసి విచిన్తయ వారం వారమ్||”

“యువతుల స్థనాలను, నాభీ స్థలాన్ని చూసి అధికంగా మోహాన్ని చెందవద్దు. అవన్నీ కూడా మాంసం మరి కొవ్వు పదార్థాల వినిర్మితాలే గానీ మరేమీ కాదు. ఈ సత్యాన్ని ప్రతిరోజూ మనస్సులో విచారణ చేసుకుంటూనే ఉండాలి.”

“‘మోహం’ అంటే ‘అతి’! ‘మితి’ అనేదే సర్వదా వాంఛనీయం. సర్వదా కళ్యాణకరం. సర్వదా ఆనందదాయకం. ‘అతి’ అనేదే సర్వవేళలా దుఃఖాన్ని కలిగించేది.

“అతి సర్వత్ర వర్జయేత్. స్త్రీ సౌందర్యోపాసన అన్నది సృష్టిలోని ఒకానొక అద్భుత విషయం! అయితే అది వెర్రితలలు వేయడమే శోచనీయమైన విషయం! అయితే అది వెర్రితలలు వేయడమే శోచనీయమైన విషయం. ఆ వెర్రిని తీసివేయడమే’ మా గా మోహావేశమ్’. అంటే ఒక గీత మరొక పెద్ద గీత వల్ల తాను చిన్నదయినట్లు ‘భోగలాలసత’ అన్నది ‘ధ్యాసలాలసత’ ముందరే తన యొక్క చిన్నతనాన్ని తెలుసుకోగలదు. ‘ధ్యానలాలసత’ అంటే ‘భజగోవిందం’ అన్నమాట!”

“నళినీ దళ గత జల మతితరళం తద్వజ్జీవిత మతిశయ చపలమ్| విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్||”

“తామరాకు మీద నీటిబొట్టులాగా జీవితం కూడా అతి చంచలమైనది. ప్రపంచమంతా రోగాలతో .. అభిమానాలతో .. శోకాలతో పరితప్తమై ఉందని తెలుసుకో.”

“సగటు మానవుడి జీవితం శారీరక వ్యాధులతో, మానసిక మూర్ఖాభిమానాదులతో శాపగ్రస్తమై ఉంది. తామారాకు మీద నీటిబొట్టు ఎంత నిలకడ లేకుండా ఊగిసిలాడుతూ ఉంటుందో, ప్రశాంతంగా సుస్థిరంగా ఉండవలసిన మానవజీవితం కూడా వ్యాధ్యాభిమానాదులతో నిలకడ లేక ఏ మాత్రం స్థిరం లేకుండా అస్తవ్యస్తమయి ఉంది. వ్యాధ్యాభిమానాదులు వర్జ్యం చేసుకోవాలంటే ధ్యానంలో కేళి తప్పదు!

“యావద్విత్తోపార్జన సక్త స్తావన్నిజపరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహె||”

“నువ్వు సంపాదనపరుడవై వున్నంత వరకు ‘నీ వారు’ అనబడే పరివారమంతా నిన్ను ఆశ్రయించే వుంటారు. వృద్ధాప్యంలో నీ దేహం శిథిలమై శక్తి హీనమైనప్పుడు నీ ఇంటిలోని వారు కూడా నిన్ను కుశలం అడుగరు.”

“రక్తసంబంధాలు అన్నీ నూటికి 99 పాళ్ళు ఆర్థిక సంబంధమైనవిగానే ఉన్నాయి. ఒకానొక మనిషి ధనాన్ని సంపాదిస్తున్నంత వరకే అతనికి కుటుంబంలో గౌరవం ఉంటుంది. శరీరధారుడ్యం తగ్గి డబ్బులు సంపాదించలేనప్పుడు అతనికి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ కించిత్ మాత్రమైనా విలువలేకుండా ఉంటుంది.

“కనుక, మనిషి కేవలం తన సంపాదనలోనే ఆమరణ పర్యంతం నిమగ్నం అయి ఉండాల్సి వస్తోంది. అలానే జీవించేస్తున్నాడే కానీ, ‘మరణం తరువాత ఏమిటి?’ అని ఆలోచించలేకపోతున్నాడు. ‘ధనలేమి’ లో కూడా విలువనిచ్చేది ఒక్క ‘జ్ఞాన బలమే‘. కనుకనే శంకరాచార్యుల వారు ‘ధ్యానం’ అంటున్నారు.”

“యావత్పవనో నివసతి దేహి తాపతృచ్ఛతి కుశలం గేహె! గతవతి వాయౌ దేహాపాయే భార్యా భిభ్యతి తస్మిన్‌కాయే||”

“శరీరంలో ప్రాణమున్నంత వరకు ఇంటిలోని వారు నిన్ను కుశలమడుగుతారు. ప్రాణం పోయి దేహం నశించే అపాయస్థితికి గురియైనప్పుడు ఆ శరీరాన్ని చూసి భార్య కూడా భీతి చెందుతుంది.”

“దేహంలో వాయువు ఉన్నంతసేపే కుటుంబీకులు కుశలం అడుగుతూ ఉంటారు. ఆ ప్రాణవాయువు కాస్తా నిష్క్రమించినప్పుడు, అంతవరకూ కౌగలించుకున్న ‘శివం’ అయివున్న దేహం ‘శవం’ గా మారినప్పుడు, భార్య కూడా భయభీతురాలు అవుతుంది. మరి అది అత్యంత సహజమే కదా! కనుక, శరీరం యొక్క తత్త్వం తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు.

“ప్రాణవాయువు ఉన్నంత వరకూ అది ‘శివం’ అది లేనప్పుడు ‘శవం’! పిన్నవయస్సులోనే శరీరం దృఢంగా ఉన్నప్పుడే ప్రాణవాయు రూపమైన శ్వాసను గమనించడం అన్నది అభ్యాసం చేయడం ద్వారా మనిషి శాశ్వత శివరూపుడు అవుతాడు. మరి అప్పుడే మానవుడి మౌఢ్యత మాయమవుతుంది. కనుక, త్వరపడాలి ధ్యాన సాధనకు. అంటే ‘గోవింద భజన’ కు ‘రేపు’ కాదు ఇప్పుడే త్వరపడాలి!”

“అర్థ మనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యమ్ పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః|”

“ధనమెప్పుడూ దుఃఖహేతువని మరిచిపోకు. దానిలో కొద్ది సుఖం కూడా లేని మాట వాస్తవం. ధనవంతునికి తన కుమారుడి నుంచి కూడా భయం కలుగుతూ ఉంటుంది. ఎక్కడైనా పరిస్థితి ఇంతే.”

“‘డబ్బు సంపాదన’ అన్నది కేవలం కనీస నిత్యావసరాల మేరకే ఉండాలి. అంతకు మించి జమీందారుగా ఉండాలనో, ‘షాహుకారు’ లా ఉండాలనో కోరుకోవడం అన్నది మితిలేని అనర్థాలకు దారి తీస్తుంది. జమీందారీ స్థితిలో కానీ, షాహుకారు స్థితిలో కానీ నిజమైన సుఖం లేశమాత్రమైనా, అణుమాత్రమైనా లేదు. జమీందారులకూ, షాహుకారులకూ నిజమైన శత్రువులు కుటుంబంలోనే ఉంటారు.

‘సంపదల ధని’ గా కాకుండా ‘ఆత్మజ్ఞాన ధని’ అవ్వాలి. దానికి మార్గం నిరంతర ధ్యానభ్యాసమే. అంటే నిరంతర ‘భజగోవిందమే’.”

“బాలస్తాపత్క్రీడాసక్తః స్తరుణలస్తావత్తరుణీ సక్తః వృద్ధస్తావచ్చింతాసక్తః పరసే బ్రహ్మణి కోపి న సక్తః|”

“బాల్యమంతా ఆటలలో గడిచిపోతుంది. యౌవనంలో కామ సంబంధమైన విషయాసక్తిలో మునిగి ఉంటాం. ముసలితనంలో అనేకానేక చింతలతో కుమిలిపోవడం మామూలే. పరబ్రహ్మం మీద ఏ ఒక్కరూ ఆసక్తిని చూపడం లేదు గదా!”

“మనిషి యొక్క జీవిత దశలు ముఖ్యంగా మూడు. 1. బాల్యం, 2. యౌవనం. 3. వార్థక్యం. బాల్య యౌవ్వన దశలలో ఉండేవి ‘ముచ్చట్లు’ అయితే వార్థక్యంలో ఉండేవి ప్రధానంగా ‘ఇక్కట్లు’. ముచ్చట్లలో పూర్తిగా మునిగితే, ఆ తరువాత ఇక్కట్లలో పూర్తిగా కొట్టుకునిపోక తప్పదు. ఎంత ముచ్చట్లలో ఉన్నా ముచ్చట్లతోపాటు ప్రజ్ఞ కూడా పెంచుకుంటూ పోతేనే జీవితం చరమదశలో ‘ఇక్కట్లు’ ఉండవు.

“‘శుభస్య శీఘ్రం!’ .. ‘ఆలస్యం అమృతం విషం!’ వార్థక్యదశ ఇంకా మీద పడనప్పుడే, మరణ సమయం ఆసన్నం కాకమునుపే బాల్యంలోనే, యౌవ్వనంలోనే ప్రజ్ఞను సంపాదించుకుని తీరాలి. ఏ విధంగా వస్తుంది ప్రజ్ఞ? కేవలం ‘ధ్యానం’ ద్వారా .. అంటే ‘ఆత్మభజన’ ద్వారా, అన్యధా శరణం నాస్తి!”

“కా తే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత అయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః”

“నీ భార్య ఎవరు? నీ కుమారుడెవరు? చాలా విచిత్రమైనదీ సంసారం. నీవెవరివాడవు? ఎక్కడ నుండి వచ్చావు? సోదరా! ఈ లోకంలో ఇప్పుడైనా తత్త్వచింతన చేయి.”

“‘ఎవరు భార్య?’, ‘ఎవరు పుత్రుడు?’ ఈ సంసారం ఎంత విచిత్రమైనదో! తనది కాని దానిని ‘తనది’ అనుకుంటూ ఉంటారు. గోతుల్లో పడుతూ ఉంటారు.”

“‘అసలు మనం ఎక్కడ నుండి వచ్చాం?’ ఇలాంటి మౌలిక సత్యాలను తెలుసుకోకుండా మానవుడు ప్రతి దానినీ ‘తనది’ అనుకుంటూ క్షతగాత్రుడు అవుతూ ఉన్నాడు.”

“నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ‘తత్’ = ‘త్వం’ అని తెలుసుకోవాలి. అంటే ‘అదే నువ్వు’ అని గ్రహించాలి. అప్పుడే జీవన్ముక్తి లభించేది. జీవించినప్పుడే ధ్యానం చేస్తే జీవించే ఉన్నప్పుడే ముక్తి వస్తుంది.”

“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్యే నిర్మోహత్యమ్ నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః|”

“సత్సంగత్వం వలన జగత్‌పట్ల అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం వలన మోహభ్రాంతి తొలగుతుంది. మోహం నశించగానే జ్ఞానం నిర్మలమవుతుంది. నిర్మలమైన జ్ఞానమే, నిర్మలమైన బుద్ధే జీవన్ముక్తికి కారణభూతమవుతుంది.”

“సత్సంగం అంటే ‘సత్యంతో సంగమం’. సత్యంతో కలయిక. నిత్యమైనదే సత్యం. ‘సత్యం’ అంటే ‘ఆత్మ పదార్థం’. ఆత్మానుభవమే సత్సంగం. ఆత్మానుభవం ద్వారానే అనాత్మతో తాదాత్మ్యం అంతరిస్తుంది. అంటే మనస్సు నిస్సంగ రూపం ధరిస్తుంది. ఆ పరిస్థితులలోనే ‘మోహం’ అన్నది, అంటే ‘అతి’ అన్నది, నశిస్తుంది; చంచలమైన మనస్సు, ‘అతి’ వర్జితం కాగనే, మోహం నశించగానే, నిశ్చలత్వాన్ని సాధిస్తుంది.

సర్వదేశకాల పరిస్థితులలోనూ నిశ్చంచలత్వాన్ని మనః పరిపాకాన్ని, కలిగి ఉండడాన్నే ‘జీవన్ముక్తస్థితి’ అంటారు.

“వయసి గతే కః కామ వికారః? శుష్కే నీరే కః కాసారః? క్షీణే విత్తే కః పరివారో? జ్ఞాతే తత్త్వే కః సంసారః?||”

“వయస్సు మళ్ళిన తరువాత మోహం ఎక్కడ ఉంటుంది? నీరు ఇంకిపోగానే సరస్సు ఎక్కడుంది? సిరిసంపదలు పోగానే బంధుజన పరివారం ఎందుకు ఉంటుంది? జ్ఞానం కలిగిన తరువాత సంసార భావమెందుకు ఉంటుంది?”

“కామ ‘పరాక్రమం’ యౌవ్వన సహజం. వయస్సు క్షీణిస్తూనే కామ పరాక్రమం కూడా క్షీణిస్తుంది. అదేవిధంగా, విత్తం క్షీణిస్తున్నప్పుడు రక్త సంబంధం కూడా పలచబడుతూ ఉంటుంది. నీటి సరఫరా క్షీణిస్తున్నప్పుడు సరస్సు కూడా కుంచించుకుపోతుంది కదా! అదేవిధంగా ‘తత్త్వం’ అవగతం అవుతున్న కొద్దీ మనిషిలో నిర్వాణ స్థితి సంవృద్ధం అవుతూ ఉంటుంది. నిర్వాణ స్థితిలో విపరీతమైన ‘సంసార స్థితి’ అన్నది అదృశ్యమవుతూ ఉంటుంది!”

“మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్కారి సర్వమ్| మాయామయ మిద మఖిలం భూత్వా బ్రహ్మపదం ఈ ప్రవిశ విదిత్వా||”

“నీకు ఇంత ధనమున్నదనీ, నీ యాజమాన్యం క్రింద ఇంతమంది జనులున్నారనీ, నీకు చక్కటి యవ్వనమున్నదనీ గర్వపడకు. కాలం నిమిషంలో సర్వాన్నీ హరించి వేస్తుంది. కనపడే ఈ ఉన్నదంతా మాయామయమే. ఈ విషయం సదా జ్ఞప్తిలో ఉంచుకోవడంలోనే ‘బ్రహ్మపదం’ లోకి ప్రవేశించే మార్గం ఉంది.”

“మనిషి జీవితంలో కౌమారం పోతూనే యౌవ్వనం, యౌవ్వనం పోతూనే వార్థక్యం అనివార్యం. యౌవ్వనం ఇప్పుడుంది రేపు పొయ్యేది. ధనం ఇప్పుడుంది రేపు పొయ్యేది. జనం ఇప్పుడుండి రేపు పొయ్యేవారు. ఈ జగత్తు, ఈ సంసారం, లేనిది వున్నట్లు తోచేది! ఉన్నది ప్రతి క్షణం మారుతూ ఉండేది! ఈ వాస్తవాలను సదా జ్ఞప్తిలో ఉంచుకోవడమే ‘బ్రహ్మ పదవి లబ్ధి’ కి మార్గం.”

“వాస్తవం మరచిపోతే అధోగతే! వాస్తవం మరచిపోకపోతే ఊర్ధ్వగతే! ‘ఆజ్ఞ’ పై ప్రజ్ఞ ఉండాలి! ప్రజ్ఞ అంటే ‘ఆత్మాభ్యాసమే!’ అంటే ‘భజగోవిందమే శరణ్యం!’”

“దినయా మిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః| కాలః క్రీడతి గచ్ఛత్యాయుః స్తదపి న ముంచ త్యాశావాయుః||”

“దివరాత్రులు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తూంటాయి మరి పోతూంటాయి. కాలం క్రీడిస్తూనే ఉంటుంది .. జీవితం క్షీణించి పోతూనే ఉంటుంది. అయినా మనిషి ఆశలను వదలలేక పోతున్నాడు.”

“రాత్రి-పగలు, సాయం-ప్రాతం ఇవి నిరంతరం ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే వసంతం, శిశిరం, గ్రీష్మం లాంటి ఋతువులు క్రమం తప్పకుండా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. కాలం అనేది ఆగనిది. అది ఎప్పుడూ క్రీడిస్తూనే ఉంటుంది. ఆయువు తరుగుతూనే ఉంటుంది.

“‘ఆయుష్షు’ అంటే ‘ఈ శరీరంలో ఈ భూమండలంలో నిర్ణయించుకున్న సమయం’ అన్నమాట. క్రికెట్టులో ‘వన్ డే మ్యాచ్’ ఆడుతున్నప్పుడు సమయం అయ్యే కొద్దీ ఆట ముగింపుకు వచ్చేసరికి ‘ఓటమో’, ‘విజయమో’ తేలిపోతుంది! ‘ప్రజ్ఞ’ లేకపోతే ఆట ముగింపు సమయానికి ‘ఓటమి’ తప్పదు!

తృష్ణే అన్ని దుఃఖాలకూ మూలం. ‘తృష్ణ’ అంటే ‘అత్యాశా వాయువు.’ అత్యాశా వాయువు వల్లనే ఆయుష్షు తగ్గిపోతూన్నా మానవుడు పొందాల్సిన ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ‘అత్యాశా వాయువు’ అన్నది శమించాలంటే ధ్యానం పరిమళించాలి.”

“కాతే కాంతా ధనగత చింతా వాతుల కిం తవ నాస్తి నియంతా త్రిజగతి సజ్జన సంగతి రేకా భవతి భవార్ణవతరణే నౌకా||” – (పద్మపాదుడు)

“ఓ వెర్రివాడా! నీ భార్యను గూర్చి, ధనాన్ని గూర్చి ఎందుకంతగా చింతిస్తావు? బల పరిపాలన చేసి నియంత కావాలనుకున్నావా? త్రిలోకాలలోనూ కూడా భవసాగరాన్ని దాటింపగల నౌక ‘సజ్జన సంగతి’ మాత్రమేనని తెలుసుకో.”

“మన వర్తమాన ‘భోగం’ అనేది, ‘భాగ్యం’ అనేది, మనం గతంలో చేసిన కర్మల ద్వారా నిశ్చయింపబడే ఉంది; రూపకల్పన చేయబడే ఉంది. మన పూర్వమే మన ప్రస్తుత ‘నియంత’, ‘పూర్వం’ లేకుండా ‘ప్రస్తుతం’ లేదు. ‘ప్రస్తుతం’ లేకుండా ‘వరం’ లేదు. పూర్వజ్ఞానం లేకుండా ‘పూర్వం’ అన్నది గ్రాహ్యం చేసుకోలేకుండా, ‘ప్రస్తుతం అన్నది వెంటనే భోగభాగ్యాలతో నిండిపోవాలి’ అని అనుకోవడం మూర్ఖత.

మన శక్తి, సామార్థ్యాలు చూసుకోకుండా, పురుష ప్రయత్నం చేయకుండా, మన ప్రస్తుతానికి వెంటనే నియంత గావడానికి ఉవ్విళ్ళు ఊరడమే మన అజ్ఞానానికి నిదర్శనం. సజ్జనుల నిరంతర సాంగత్యం వల్లనే ఈ విషయాలన్నీ సువిదతం అయ్యేది.”

“జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః| పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః||” (తోతాచార్యుడు)

“ఒకానొకడు జడలు ధరించీ, మరొకడు ముండనం చేయించుకునీ, ఇంకొకడు వెంట్రుకలు పెరికేసుకునీ, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించీ ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని ఈ మూర్ఖులు పొట్టనింపు కోవటానికే అనేకానేక వేషాలు వేస్తూంటారు.”

“జడలు పెంచుకోవడం, బోడిగుండు చేయించుకోవడం, జుట్టును దారుణంగా పెరికివేయడం, ఆర్భాటమైన వస్త్రాలు ధరించడం – ఇవన్నీ కూడా మూర్ఖమతులు పొట్టనింపుకోవడానికి చేసే ఆడంబరమైన, అర్థరహిత చర్యలు మాత్రమే.

“జ్ఞాని అయినవాడు జడలు పెంచుకోడు, ప్రత్యేకమైన వస్త్రధారణ హాస్యస్పదమని తలుస్తాడు. ఉదర పోషణార్థం కష్టపడి పని చేస్తాడే కానీ కాషాయ వేషధారణల్లాంటివి చేయడు. ‘మూడవకన్ను’ అంటే ‘దివ్యచక్షువు’ ఉండి కూడా దానిని వినియోగించని వాడు మూర్ఖ మానవుడు. సత్యం కళ్ళెదుట నిత్యమాడుతూన్నా ‘అంధులు’ గా ఉండ నిశ్చయించుకుంటారు మూఢులు.”

“అంగం గళితం పలితం ముండం దశన విహీనం జాతుం తుండమ్| వృద్ధో యాతి గృహీత్వా దండం స్తదపిన ముంచ త్యాశాపిండమ్|| – (హస్తాదులకాచార్యుడు)

“శరీరం సడలిపోయింది. తల నెరసిపోయింది. దంతాలు ఊడిపోయాయి. ముసలివాడై కర్రమీద ఆధారపడి కదులుతున్నాడు. అప్పుడు కూడా కోరికల మూటను వదలి పెట్టాడు.”

“‘అత్యాశ’ అన్నది వారించాలంటే ‘అజ్ఞానం’ అన్నది అంతం కావాలి. ‘అజ్ఞానం’ అంతం కావాలంటే ‘జ్ఞానసాధన’ చెయ్యాలి. ముసలివాళ్ళం అయినప్పుడు వివేకం, యుక్త వైరాగ్యం అన్నవి తమంతట తాముగానే వచ్చేస్తాయి అని మూర్ఖులు అనుకుంటూ ఉంటారు. మరికొందరు ‘పండితులు’ ప్రవచిస్తూ ఉంటారు. ఇదంతా వొట్టి భ్రాంతి. ఏదైతే సాధించవలసి ఉందో అది వయస్సులో ఉన్నప్పుడు చేపట్టాలి. వయస్సులో ఉన్నప్పుడు ‘గోరంత’ ధ్యానసాధనతో సాధ్యమయ్యేది, వయస్సు మళ్ళినప్పుడు ‘కొండంత’ ధ్యానసాధనతోనే సాధ్యమవుతుంది.

“అగ్రే వహ్నిః పృష్ఠే భానూ రాత్రౌ చుబుక సమర్పిత జానుః| కరతల భిక్ష స్తరుతల వాస స్తదపి న ముంచ త్యాశాపాశః||” – సుభోధుడు

“ముందు చలిమంట, వెనుక సూర్యుని వేడి, రాత్రులందు మోకాటిని గెడ్డానికి తగిలేటట్లుగా పెట్టుకుని కూర్చుంటాడు. ఆహారం దోసిట్లో పెట్టించుకుని తింటాడు. చెట్టునీడలో జీవిస్తాడు. ఇలాంటి దీనావస్థలో కూడా కోరికలు దూరం కావటం లేదు.”

అజ్ఞానాంధకారంలో కొట్టుకుపోతూన్న మానవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, మళ్ళీ మళ్ళీ సుఖాలకోసం అర్రులు చాస్తున్నాడే కానీ, కష్టాల మూలం తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. కష్టాలకు ‘మూలం’ తెలుసుకోవాలంటే తాను ఎవరో తెలుసుకోవాలి. తాను ఎవరో తాను తెలుసుకోవాలంటే ‘చిత్తవృత్తి నిరోధం’ కన్నా వేరే శరణు లేదు. అంటే ‘ధ్యానం’ వినా వేరే మార్గం లేదు.”

“కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మథవా దానమ్| జ్ఞాన విహీనః సర్వ మతేన ముక్తిం భజతి న జన్మశతేన||” – (వార్తికకారుడు)

“మానవుడు గంగా సాగరాలకు వెళ్ళి స్నానమాచరించినా, అనేకానేక వ్రతాలు నెరపినా, దానాలు చేసినా జ్ఞానం పొందనంత వరకు నూరు జన్మలెత్తినా ముక్తి లభించదని అన్ని మతాలూ అభిప్రాయపడుతున్నాయి.”

“శ్రీ శంకరాచార్యులవారు ‘దేహం’ తో చేసే కర్మలను సంపూర్ణంగా నిరసిస్తున్నారు. ‘బాహ్య కర్మకాండ’ అంతా అజ్ఞానపు విపరీత చేష్టలే! శ్రీ శంకరాచార్యుల వారు ఆత్మనిష్టా గరిష్టులు. ఆయనకు కావల్సింది ‘ ఆత్మనిష్ట’ దేహ స్పృహను వదిలివేయ లేకపోవడమే ‘జ్ఞాన విహీనత్త్వం’. అది పోవాలంటే మనకు తప్పనిసరి ‘అంతర్-ఆత్మ-కాండ.”

“సురమందిర తరుమూల నివాసః శయ్యా భూతల మజినం వాసః| సర్వ పరిగ్రహ భోగత్యాగః కన్య సుఖం న కరోతి విరాగః||” – (నిత్యానందుడు)

“‘దేవాలయాలలో, చెట్టునీడలలో తలదాచుకుంటూ, కటిక నేలపై పవళిస్తూ, మృగచర్మాన్ని వస్ర్తంగా ధరిస్తూ, సర్వాన్నీ, ‘పరిత్యజించాలి’, ‘అనుభవించాలి’ అనే కోరికలను కూడా విడనాడిన వాడికి సుఖం ఎందుకు ఉండదు?!

ఆత్మజ్ఞానానికి, నిత్య ఆత్మ ఆనందశీలికి, ప్రాపంచిక వస్తు సముదాయం, భోగభాగ్యాలు అన్నవి ఏవీ లేకపోయినా సుఖం తరుగదు. చెట్ల మూలాలలో సుఖంగా నివసించగలడు. వొట్టినేలమీద సుఖంగా నివసించగలదు. వొట్టినేలమీద సుఖంగా నిద్రపోగలడు. కేవలం కౌపీనధారియై సుఖాన్ని భావించగలడు, ‘అంతా తానే’ అయి ఉన్నప్పుడు జరిగే వింత ఇది. ఈ వింతను తెలుసుకోవాలంటే ధ్యానం చెంతకు పోవాలి.”

“యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవీహీనః| యస్య బ్రహ్మణి రమతే చిత్తం నన్దతి నన్దతి నన్దత్యేవ||” – (ఆనందగిరి)

“యోగం అనుష్ఠించినా, భోగం అనుభవించినా, సమూహంలో నివసించినా, ఏకాంతంలో కాలం గడిపినా, ఎవరి మనస్సైతే బ్రహ్మపదార్థంలో సదా రమిస్తూ ఉంటుందో అతడే ఆనందాన్ని పొందుతాడు, సుఖాన్ని అనుభవిస్తాడు. అతడే ఆనందమయుడై ఉంటాడు.”

“మనం బాహ్యంగా ఎలా ఉన్నామన్నది కాదు, ‘అంతరంగంలో ఎలా వున్నాం?’ అన్నదే ముఖ్యం. ఆత్మస్ఫూర్తి సదా కలిగి ఉండాలంటే దానికి ఒక్కటే మార్గం అదే ధ్యానం, నిత్య ధ్యానం. అంటే నిత్య ‘గోవింద భజన’. ఈ విధంగా సుశిక్షితుడైనవాడే, సుబోధితుడైనవాడే నిత్యానందరూపుడు కాగలడు.”

“భగవద్గీతా కించి దధీతా గంగాజల లవ కణికా పీతా| సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా||” – (దృఢభక్తుడు)

“ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగాజలాన్ని కనీసం ఒక్క బొట్టునైనా పానం చేస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానులతో కనీసం ఒక్క పర్యాయమైనా నిజంగా చర్చిస్తారో అలాంటివారిని గురించి యముడు ఇక ఆలోచించదు.”

“ఆత్మజ్ఞానంలో కూడిన, ఆత్మానుభవంతో వ్రాయబడిన, ఆధ్యాత్మిక గ్రంథాల్ని కొంచెమైనా చదవాలి. ధ్యానస్థితిలో, సమాధిలో ఉన్నప్పుడు ఖేచరీముద్ర ద్వారా లాలాజలం విశ్వశక్తితో ఏకమై అమృతబిందువులుగా మారినప్పుడు, ఆ గంగాజలాన్ని ఒక బొట్టు అయినా త్రాగాలి; అంటే ‘అను నిత్య ధ్యానం’ కొంతైనా చేయాలి.”

“అలాగే ఎవరైతే కొంతైనా సజ్జన సాంగత్యం చేస్తారో అలాంటి వారే మరణం వచ్చిన తరువాత, వారు ‘ ఈ భూమండలం నుంచి నిష్క్రమించి ఊర్థ్వలోకాలలో’ చేరినప్పుడు, వారిని నిలబెట్టి ‘గద్దించేవారు’ ఎవ్వరూ ఉండరు. అంటే ‘చర్చ వేసేవారు’ ఎవ్వరూ ఉండరు. ఆధ్యాత్మిక శాస్త్ర త్రిరత్నాలైన స్వాధ్యాయ, ధ్యాన, సజ్జన సాంగత్యాలను మూడు చక్కటి పదాలలో అద్భుతంగా వివరించారు శ్రీ శంకరాచార్యులవారు.”

“పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్| ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే||” – (నిత్యనాధుడు)

“మళ్ళీ మళ్ళీ పుట్టటం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడటం. ఈ విధంగా చావు పుట్టుకల సంసారాన్ని దాటడానికి సాధ్యం గాకుండా ఉంది. అనంత దయాస్వరూపుడవైన ఓ జ్ఞానీ! కృపతో నన్ను కాపాడి రక్షించు.”

“ప్రతి జన్మ కూడా క్రొత్త పాఠాల పఠనం కోసమే ఉంది. ఉన్న క్లాసులోనే ప్రతిసారీ ‘ఫెయిల్’ అవుతూ అవే అవే పాఠాలను మళ్ళీ మళ్ళీ చదవాల్సి రావడం అన్నది చాలా అవాంఛ నీయమైన దుస్థితి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి దారుణంగా ఉండి ‘రక్షించండి’, ‘రక్షించండి’ అని ఎంత మొత్తుకున్నా ప్రత్యేకంగా కొండ దిగివచ్చి రక్షించే ‘నాథుడు’ ఎవ్వడూ ఉండడు!

ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితులలోనైనా స్వప్రయత్నం ద్వారానే ఒక అంగుళం అయినా మనల్ని మనం జరుపుకునేది! స్థితిగతులు ప్రార్థిస్తే తొలగవు, ప్రార్థిస్తే మారవు. సరియైన మార్గంలో తగినంత సాధన చేస్తేనే స్థితిగతులు సక్రమం అవుతాయి. ఆ సాధనే నిత్య ‘భజ గోవింద’ సాధన.”

“రథ్యాచర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః| యోగీ యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ||” – (యోగానందుడు)

“దారిలో దొరికే గుడ్డపీలకలతో తయారయిన బొంత మాత్రం ధరిస్తూ, పుణ్యాపుణ్యాలకు అతీతమైన మార్గాన్ని అనుసరిస్తూ, మనస్సును పూర్ణయోగంలో నియమించిన యోగి బ్రహ్మంలో సదా రమిస్తున్నవాడై పిల్లవాడిలాగా, పిచ్చివాడి లాగా సంచరిస్తూంటాడు.”

“యోగి అయినవాడు ‘నేను ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నాడు?’ అని ఆలోచించడు. రోడ్డు మీద పడి వున్న గుడ్డముక్కలను కలిపి కట్టుకుని జీవిస్తాడు. వాడికి లోకం నిర్ణయించిన ‘మంచి’, ‘చెడు’ లతో పనిలేదు. తన అంతరాత్మ చెప్పిందే మంచి. అంతరాత్మ చెప్తే చేస్తాడు లేకపోతే చేయడు. యోగి అయినవాడు ఎప్పుడూ తనలోతానే నిమగ్నమై ఉంటాడు. బహిర్ -ప్రపంచంలో ఎంతగా మునిగి ఉన్నట్టుగా కనిపించినా యోగి అయినవాడు చిన్నపిల్లవాని మనస్తత్వం కలిగి ఉంటాడు. యోగి అయినవాడు చిన్నపిల్లవాని మనస్తత్వం కలిగి ఉంటాడు. యోగి అయిన వానిని అందరూ ‘ఒక పిచ్చివాడు’ అనుకోవడం కూడా అత్యంత సహజమే. అసలు ఒక మనిషి యోగి ఎలా అవుతాడు? ధ్యాన జ్ఞాన సాధన ద్వారా అంటే ‘గోవింద’ సాధన ద్వారా మాత్రమే!”

“కస్త్వం కోహం కుత అయాతః కా మే జననీ కో మే తాతః| ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్|| ” – (సురేంద్రుడు)

“‘నువ్వు ఎవరు? నేను ఎవరు? అసలు ఎక్కడ నుండి వచ్చాం? తల్లి ఎవరు? తండ్రి ఎవరు?’ – ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వేసుకోకపోతే జీవితం ‘గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు’ గా ఉంటుంది.

“మనిషి సరైన ప్రశ్నలు వేసుకోవాలి. ‘పరిశీలింప బడని, పరిశోధన చేయబడని జీవితం జీవించడం అనేది బొత్తిగా వృథా!’ అని సోక్రటీస్ మహాశయుడు చెప్పనే చెప్పాడు.

“ఈవిధంగా పరిశోధనలు చేస్తే కనుక్కునే విషయం ఏమిటంటే ఆ జన్మ పర్యంతం మరి మరణం వరకు ఉన్న ఈ భౌతిక జీవితం కూడా ‘ఒకానొక దీర్ఘకాలికమైన స్వప్నం’ లాంటిదే. ఇటువంటి చక్కని తత్త్వాన్ని గ్రహించాలంటే, స్వానుభవం చేసుకోవాలంటే, తప్పదు మరి రోజువారీ ధ్యానం, అంటే రోజువారీ ‘భజన – ఆత్మభజన’.”

“త్వయి మయి చాన్యత్తైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః| భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛ స్యచిరా ద్యది విష్ణుత్వమ్||” – (మేథాతిథి)

“నీలో, నాలో అంతటా ఉన్నది సర్వవ్యాపకమైన భగవత్ తత్త్వమే. నిగ్రహం లేక అనవసరంగా నాపై కోపగించుకుంటున్నావు. నువ్వు వెంటనే విష్ణుత్వాన్ని పొందగోరితే, అన్ని పరిస్థితులలో కూడా సమానదృష్టిని కలిగి ఉండాలి.”

“అందరిలో ఉన్న ఆత్మపదార్థం ఒక్కటే. అంతా ఒక్కటే అయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకు కోపాలు వ్యర్థం. ఒకళ్ళను చూసి ఇంకొకరు సహింప లేకపోవడం అనేది మూర్ఖం. విష్ణుత్వాన్ని అర్థం చేసుకోవాలంటే, బ్రహ్మత్వాన్ని పొందగోరాలంటే, ఆత్మానుభవ సహాయంతో సమస్తం పట్ల సమమైన చిత్తం కలిగి ఉండాలి.

సమమైన చిత్తం కలిగి ఉండాలంటే, ఆత్మానుభవం ఉండాలంటే మరి క్రమం తప్పని, రోజువారీ ధ్యానసాధన అనివార్యం. అంటే ‘ఆనాపానసతి’ – ‘విపస్సన’ అభ్యాసం. అంటే ‘గోపాలుని భజన’. ‘గో’ అంటే ఇంద్రియాలను పరిపాలించేది, శాసించేది ‘ఆత్మ’.”

“శత్రా మిత్రే పుత్రా బంధ్ మా కురు యత్నం విగ్రహ సంధౌ| సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సజ భేదాజ్ఞానమ్||”

“శత్రువుగానీ, మిత్రుడు గానీ, పుత్రుడు గానీ, ఎవరైనా గానీ వారిపట్ల ప్రత్యేక శత్రుత్వం గానీ, స్నేహం గానీ చేసే యత్నాలకు స్వస్తి చెప్పాలి. అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన పుట్టిన భేద బుద్ధిని వదలిపెట్టాలి.”

“శత్రువులతో, మిత్రులతో, పుత్రులతో అనవసరంగా స్పర్థలు పెంచుకోవడం, మళ్ళీ మళ్ళీ వాటికి తగిన శాంతి మార్గాలు వెతుక్కోవడం, మళ్ళీ మళ్ళీ వాటికి తగిన శాంతి మార్గాలు వెతుక్కోవడం, ఇవన్నీ కూడా ప్రాపంచికపరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ, నిష్ప్రయోజనమైన క్రియలు, ‘అడుసు త్రొక్కనేల? కాలు కడగనేల?’ ‘తొలుత కలహమేల, తదుపరి రాయబారమేల?’ అందరిలోనూ సరిసమానమైన ఆత్మను చూడాలి. బేధజ్ఞానాన్ని సర్వవేళలా పరిత్యజించాలి. షరా మామూలే! మార్గం ఒక్కటే!ధ్యానమేవ శరణం!

గ్రహించవలసిన దేమిటంటే జ్ఞానికి ఎవ్వరూ ప్రత్యేకంగా శత్రువులు కాదు! ఎవ్వరూ ప్రత్యేకంగా మిత్రులు కాదు! ఎవ్వరూ ప్రత్యేకంగా బంధువులు కాదు. మహాదృష్టిని కలిగిన మహాత్ములు జ్ఞానులు. ఆ మహాదృష్టిని సంతరించుకోవాలంటే దివ్యచక్షువును ఉత్తేజింప చేసుకోవాలి.”

“కామం క్రోధం లోభం మూహం త్వక్త్వా త్మానం పశ్యతి సోహమ్| ఆత్మజ్ఞాన విహీనా మూఢా స్తే వచ్యన్తే నరక నిగూఢాః||” – (భారతీయతుడు)

“కోరికలనూ, క్రోధాన్నీ, లోభాన్నీ, మోహాన్నీ విడిచి వివేకియైనవాడు ఆత్మను చూస్తున్నాడు. ఆత్మజ్ఞానం లేని అవివేకులైనవారు నరకయాతనను అనుభవిస్తూంటారు.”

“కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాల్ని ఒకింత ప్రక్కన పెట్టి, ‘ఆత్మసాధన చేయడం నేర్చుకోవాలి. ‘ఆత్మసాధన’ అనేది ‘ఆత్మలోనే, ఆత్మ ద్వారానే, ఆత్మకోసం’ చేసేసి. ‘స- అహం’ అంటే ‘అదే నేను’ అని తెలుసుకోవడాన్నే ఆత్మసిద్ధి లభించడం అంటారు.

“ఆట్మసిద్ధి లేని మూఢుడు ఎప్పుడూ భరించలేని నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆత్మసిద్ధి కావాలంటే రోజుకి ఒక గంటసేపు తప్పనిసరిగా ఆనాపానసతి సాధనను అందరూ చేస్తూ ఉండాలి.

“‘పశ్యతి’ అంటే ‘చూడడం’; శ్రీ శంకరుల వారు మనల్ని దివ్యచక్షువుతో ‘చూడ’ మన్నారు! దివ్య చక్షువుతో చూడడాన్నే బుద్ధుడు ‘విపస్సన’ అన్నాడు. అది ‘ఆనాపానసతి’ ద్వారానే సాధ్యం.”

“ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారమ్| జాప్య సమేత స్మాధి విధానం కుర్వవధానం మహదవదానమ్||”

“ప్రాణాయామం, ప్రత్యాహారం, ఆత్మానాత్మ వివేకం, వీటినే జపమాలగా త్రిప్పుతూ, సమాధి విధానమైన ఈ మార్గాన్ని జాగ్రత్తగా అనిష్ఠించాలి. ఇది చాలా గొప్ప అనుష్ఠానం.”

“చేయవలసినది ‘శ్వాస మీద ధ్యాస’; ‘కావలసింది అంతర్‌ముఖం’; విచారించవలసింది ‘నిత్యానిత్యాలు ఏమిటి?’, ‘అవివేకం అంటే ఏమిటి?’ అని. ఈ ప్రాణాయామం అంటే ‘ఆనాపానసతి’. ప్రత్యాహార, ధారణలు వెరసి ‘విపస్సన’ అవుతుంది. ఆనాపానసతి, విపస్సనలు కలిసి ‘ధ్యానసాధన’ అనబడుతుంది.

“నిత్యానిత్యవివేక విచారమే ‘జ్ఞానసాధన’. ఈ ధ్యాన జ్ఞాన సాధనలు నిరంతరంగా కొనసాగుతూండాలి. అంటే వాటి ‘జపం’ నిత్యమూ జరగాలి. అదే నిర్వికల్ప సమాధివిధానం. ‘సమాధానాలన్నీ దొరికిన స్థితి’ ని ‘సమాధి’ అంటాం. శంకరాచార్యులవారు అందరినీ ఈ అవధానమే చెయ్యమన్నారు. అంటే, ఈ శాస్త్ర అధ్యయనమే చేయమని చెప్పారు. అదే అత్యంత అద్భుతమైన శ్రేష్టమైన అవధానం.”

“గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూప మజస్రమ్| నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తమ్||” -(భారతీయతుడు)

“భగవద్గీత, సహస్రనామాలు మొదలైన వాటిని గానం చేయాలి. నిరంతరం ‘లక్ష్మీపతి’ యొక్క ‘రూపాన్ని’ ధ్యానం చేయాలి. మనస్సును సజ్జన సాంగత్యంలోనే నడిపించాలి. దీనులకు ద్రవ్యసహాయం చేయాలి.”

“ఆత్మజ్ఞాన విశారదుల గ్రంథాలను నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి. ‘శ్రీ’ అంటే ‘ప్రకృతి’. ‘శ్రీపతి’ అంటే ‘ప్రకృతిని శాసించగల జీవుడు’. ఎప్పుడూ పురుషోత్తముల అంటే ‘శ్రీపతుల’ జీవసారాల్నే దృష్టిలో ఉంచుకోవాలి. వారే మన గమ్యాన్ని మనకు సూచించేది. వారే మనకు మార్గాన్ని చూపించేది. దానికి మార్గంగా చిత్తాన్ని ఎప్పుడూ సజ్జన సాంగత్యం వైపే త్రిప్పాలి. వీటి అన్నింటితో పాటు ఆర్థికంగా దీనావస్థలో ఉన్న దీన జనులకు ఒకింత యుక్త సహాయం కూడా విధిగా చేయాలి.”

“‘విష్ణువు’ అంటే ‘అంతటా వ్యాపించినవాడు’ ఆత్మజ్ఞానే ‘శివుడు’ అంటే నిత్యానందమయుడు; ఆత్మజ్ఞానే ‘శివుడు’; ‘బ్రహ్మ’ అంటే ‘సృష్టికర్త’; ఆత్మజ్ఞానియే క్రొత్తగా ఏదైనా సృష్టించగల సమర్థత ఉన్నవాడు.”

“సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్దన్త శరీరే రోగః| యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్||”

“లైంగిక భోగాలకు అధికంగా లోనైన వ్యక్తి భోగ జీవితం అనుభవిస్తాడు. తరువాత శరీరం రోగ భూయిష్టమవుతుంది. ఈ లోకంలో మరణం అనివార్యమయినప్పటికి కూడా మనిషి పాపభూయిష్టమైన ప్రవర్తనలను వదలడం లేదు.”

“శారీరక సంభోగ సుఖాలను అవిశ్రామంగా అనుభవించాలనే కోరికల మూలంగా అనేకానేక రోగాలను అందరూ కొని తెచ్చుకుంటున్నారు. సక్రమమైన మార్గంలో ‘సభోగాలు’ ఉంటే, ‘సంయుక్తం’ గా ఉంటే బాధలు ఏమీ ఉండవు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ ఏదైనా సమపాళ్ళలోనే, సరిపాళ్ళలోనే ఉండాలి.

రేపో మాపో దేహాన్ని వదిలేసే తరుణం ఆసన్నమవుతోంది కదా! మరి దేహమే సర్వమూ అయినట్లు వెర్రి ఆవేశాలు వేయడం అనవసరం కదా! దేహాంతర జీవితానికి దేహంలో ఉన్నప్పుడే మార్గం చూసుకోవాలి. పాపాచరణాన్ని మానుకోవాలి. మధ్యే మార్గ నిష్ణాతులు కావాలంటే ధ్యానజ్ఞాన నిష్ణాతులం కావాలి. అంటే నిత్య గోవిందానుసంధానం ఉండాలి.”

“గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసార దచిరా ద్భవ ముక్తః| సేన్ద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవం||”

“సద్గురు చరణ సేవారతుడవైన ఓ ధ్యానభక్తుడా! ఇంద్రియాలనూ, మనస్సునూ నిగ్రహించి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తుడవు కా! అలా చేయడం వలన హృదయంలోనే ఉన్న సర్వాత్మను దర్శించగలవు.”

“గురువు లేని విద్య గుడ్డి విద్య! ‘గురువు’ అంటే ‘బరువైనవాడు’, అంటే అనుభవంతో బరువు అయినవాడు. గురుత్వాన్ని కోరుకుంటూన్న లఘువులు గురువుని ఆశ్రయించాల్సిందే. గురువు ద్వారా సూచించబడిన ధ్యాన అభ్యాస మార్గాన్ని భక్తితో శ్రద్ధతో అనుష్టించ వలసిందే. జనన మరణ చక్రసంసారం నుంచి అచిరకాలంలోనే విముక్తులు కావడానికి ఇది ఒక్కటే సూత్రం.”

గురువుగా కావాలంటే .. బరువులు ఎత్తవలసిందే! ఆధ్యాత్మిక గురువులు కావాలంటే ఆధ్యాత్మిక సాధనలు చేయాల్సిందే! దివ్యులం కావాలంటే దివ్య సాధనను చేయవలసిందే!

ధ్యానసాధన జ్ఞానసాధన .. జ్ఞాన సాధనే ముక్తిసాధన! కరుణా సాధనే ఆత్మసాధన .. బోధనా సాధనే శంకర సాధన!!