ఆత్మపరిణామక్రమం – విధి విధానం

 

“శక్తి” .. అంటే “Energy”. అది ఏడు ముఖ్యమైన రూపాలలో మన జీవితాలను సుసంపన్నం చేస్తూ ఉంటుంది. అవి వరుసగా Existence .. Evolution .. Experiment .. Experience .. Expression .. Enlightenment .. Enjoyment.

1. Existence.. అస్తిత్వం .. ఉనికి: “ఈ సువిశాల విశ్వంలో ఉన్న అనేకానేక లోకాలకు చెందిన మనం అంతా కూడా ప్రస్తుతం ఈ భూగ్రహం మీద జన్మలు తీసుకున్న సర్వశక్తివంతులమైన శుద్ధ చైతన్య స్వరూపాలం” అన్న మన ఉనికినీ .. మన అస్తిత్వాన్నీ .. మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి.

2. Evolution .. పరిణామక్రమం: అనేకానేక నక్షత్ర లోకాలూ, గ్రహ, ఉపగ్రహ కక్ష్యలతో పాటు, సౌరమండలాలూ, మరెన్నో వింతలూ, విడ్డూరాలతో నిండి ఉన్న మన సువిశాల విశ్వం .. పరిణామక్రమంలో భాగంగా నిరంతరం మార్పును ఆహ్వానిస్తూ .. పురోగతి దిశలో సాగుతూ ఉంటుంది. అలాగే విశ్వజీవులమైన మనం కూడా .. ప్రతి క్షణం మన జీవితంలో జరిగే మార్పులను ఆత్మపూర్వకంగా ఆహ్వానిస్తూ వుండాలి.

ఒకానొక పిండం .. బాలుడిగా, యవ్వనుడిగా, మధ్యవయస్కుడిగా మరి వృద్ధుడిగా .. ఇలా అనేక విధాలుగా అభివృద్ధి చెందినట్లే .. ఒకానొక ఆత్మ కూడా అనేకానేక అనుభవాల జ్ఞానంతో .. శైశవాత్మగా .. బాలాత్మగా .. యవ్వనాత్మగా .. వృద్ధాత్మగా .. మహాత్మగా మరి పూర్ణాత్మగా ఆధ్యాత్మిక పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

3. Experiments .. ప్రయోగాలు: క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తూంటేనే మనకు క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి! ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటూన్న వస్తువులూ, సౌకర్యాలూ మరి టెక్నాలజీ అంతా కూడా ఇలా మనం ప్రయోగాల ద్వారా పొందినవే. ఇదంతా భౌతిక ప్రపంచానికి చెందినది!

అయితే .. విశ్వలోక జీవులం అయిన మనం భౌతిక పరమైన ప్రయోగాలతో పాటు ఆధ్యాత్మిక పరమైన ప్రయోగాలను కూడా చేస్తూనే వుండాలి. దివ్యచక్షువు, సూక్ష్మశరీరాలతో శాస్త్రీయమైన ధ్యాన ప్రయోగాలు చేసి ఉన్నతలోక జ్ఞానాన్ని పొందాలి!

4. Experineces .. అనుభవాలు: రకరకాల భౌతిక, మరి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ద్వారా మనం విస్తారంగా అనుభవాలను గడిస్తాం! ఆ అనుభవాల సారాంశం ఆధారంగా. `మంచి – చెడు’ .. `చేయవలసినవి – చేయకూడనివి’ .. `సరియైనవి – సరికానివి’ అన్న విషయాలకు సంబంధించిన `యదార్థ జ్ఞానాన్ని’ పొందుతాం!

5. Expressions .. అభివ్యక్తీకరణలు: రకరకాల నూతన ప్రయోగాలు చేసి అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానాన్ని మనం సరియైన రీతిలో వ్యక్తీకరణ చేయగలగాలి! అప్పుడే అది పదిమందికీ ఉపయోగపడే సిద్ధాంతంగా రూపొందుతుంది.

శాస్త్రీయమైన మరి సందర్భోచితమైన ఆలోచనలూ, మాటలూ, చేతలూ మరి పుస్తక ప్రచురణలూ ఈ కోవకే చెందుతాయి కనుక ఈ దిశగా మన శక్తిని విస్తారంగా వినిమయం చెందించాలి.

6. Enlightentment .. దివ్యజ్ఞానప్రకాశం: “అనేకానేక ప్రయోగాలు చేసి పొందిన అనుభవ జ్ఞానం వల్ల మనలోని చైతన్యం అనంతంగా విస్తరించి .. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న `ఏకత్వం’ అంతా మనకు అనుభూతికి వస్తుంది! అనంతకాలంగా ప్రయాణం సాగిస్తూన్న ఆత్మస్వరూపులైన మనకు `చావు’ అన్నది లేనేలేదు అన్న సత్యం అనుభవంతో అవగాహనకు వస్తుంది.

ఇలా మనం ఆత్మ స్వరూపులం అన్న సత్యాన్ని తెలుసుకోవడమే అతి గొప్ప అంశం.

7. Gred Enjoyment .. బ్రహ్మానందం: “ `సత్యం’ అన్నది అనుభవంలోకి వచ్చాక ఇక అర్థం పర్ధం లేని భయాలూ, ఆందోళనలూ, అజ్ఞానాలూ మరి మూర్ఖత్వాలూ అనబడే సకల దుఃఖాల నుంచి మనం విముక్తలం అవుతాం!

ప్రతి క్షణం అత్యంత ఎరుకతో జీవించడంలో వున్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ .. శక్తివంతంగా, రసవంతంగా మరి జ్ఞానవంతంగా మన జీవితాన్ని పండుగలా “నిత్య కళ్యాణం – పచ్చ తోరణం”గా చేసుకుంటాం!!