అంతా పరిపూర్ణమే

 

“అనేక రకాల వైవిధ్యాలతో కూడి .. తనదైన ప్రత్యేకతను కలిగివున్న ఈ సృష్టిలో .. ప్రతి ఒక్కటీ గొప్పదే .. ప్రతి ఒక్కటీ సత్యమే .. మరి ప్రతి ఒక్కటీ పూర్ణమే!

“ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”

“అంటూ ఈశావాస్యోపనిషత్ మనకు అద్భుతమైన శాంతి సందేశాన్ని ఇచ్చింది.  “అది పూర్ణమే, ఇదీ పూర్ణమే .. పూర్ణంలోంచి  పూర్ణం తీసేస్తే .. మిగిలేదీ పూర్ణమే!”

“ఈ సకల చరాచర సృష్టిలో వున్న ప్రతి ఒక్కటీ పూర్ణమే మరి ప్రతి ఒక్కటీ విశిష్ఠమైనదే! పుట్టాక ఈ భూలోకం ఎంత క్రొత్తగా కనిపిస్తుందో .. చనిపోయాక పై లోకాలు కూడా అంతే క్రొత్తగా కనిపిస్తాయి!

“కనుక ఈ సృష్టి అంతా కూడా అనేక రకాల వైవిధ్య భరితమైన స్థితులతో అలరారుతున్న ఏకత్వం యొక్క విశ్వరూపం! ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో ‘ఇది తప్పు’, ‘అది తప్పు’, .. ‘వీడు మంచివాడు’, ‘వాడు చెడ్డవాడు’ .. ‘ఇది సరియైనది’, ‘అది సరికానిది’ అంటూ సృష్టిరచనను తప్పు పట్టడం సరియైన పద్ధతికాదు!

“నడక నేర్చుకుంటూన్న చిన్నపిల్లవాడు వేసే తప్పటడుగులు ‘తప్పులు’ కానట్లే .. ఈ ప్రపంచంలో ఏ ఒక్కటీ ‘తప్పు’ కాదు. సంగీతం నేర్చుకునేటప్పుడు మొదట్లో అపస్వరాలు సహజంగానే పలికినట్లు .. సత్యాన్ని అవగాహన చేసుకునే క్రమంలో ప్రతిఒక్కరూ ‘తప్పులు’ చేస్తూనే వుంటారు! కాలక్రమంలో ఆ తప్పులను సహజంగానే సరిదిద్దుకుంటూనే వుంటారు.

“ఇదంతా ప్రకృతి సహజం!   “‘రకరకాల సమస్యలు’ అనే సుడిగుండాలలో మన జీవితం సదా గిరగిరా తిరుగుతూనే వుంటుంది. ఆ సుడిగుండం యొక్క వేగం, లోతు తెలియదు కాబట్టి వాళ్ళకు తోచిందేదో అంటూంటారు. కాబట్టి సంగతి తెలుసుకుని మాట్లాడాలి!

“ఇదంతా కూడా ‘ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రం’ అన్నదానిని సమగ్రంగా అధ్యయనం చేసిన వారికే తెలుస్తుంది. “ఒకానొక పూర్ణరూపులైన తల్లి నవమాసాలు తన గర్భంలో బిడ్డను మోసి తన రక్త మాంసాలను ఆ బిడ్డకు పంచి .. తొమ్మిది నెలలు నిండాక ఇంకొక పూర్ణస్వరూపిణి అయిన బిడ్డకు జన్మను ఇస్తుంది.

“ఇలా ఒక తల్లి గర్భంలో నుంచి ఎంతమంది పుట్టినా .. ఆ తల్లి పూర్ణత్వంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ తల్లి పూర్ణమే .. గర్భంలో ఉన్న బిడ్డ పూర్ణమే .. మరి తల్లి నుంచి పిల్లను వేరు చేసాక మిగిలేదీ పూర్ణమే! ఒక పూర్ణంలోంచే ఇంకొక పూర్ణం వస్తుంది.

“అలాగే శరీరవత్ పూర్ణంగా మరి ఆత్మవత్ పూర్ణంగా ధ్యానం మరి అహింసలో పరిపూర్ణమైన జీవితాలను గడిపిన కొన్ని ఉన్నత ఆత్మలు ఈ భూమి మీద మరికొన్ని అంశాత్మలను పుట్టించి .. పుట్టించి చివరికి మరింత పరిపూర్ణత్వంతో పైలోకాలలోకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాయి! అక్కడి నుంచి ‘ఈ పిల్లపూర్ణాత్మలు తమ భూలోక జీవితాన్ని ఎలా జీవిస్తూన్నాయో?!’ అని ఆసక్తిగా పై నుంచి చూస్తూంటారు.

ఏ ఆత్మ అయితే .. పూర్ణాత్మలుగా మారడానికి కావలసిన సత్యం మరి అహింసలో జీవిస్తుందో .. ఇతర పిల్ల పూర్ణాత్మలకు అలా జీవించడానికి సహాయం చేస్తాయో అప్పుడు అది కూడా పూర్ణత్వాన్ని సిద్ధించుకుని మరి కొన్ని పిల్లాత్మలను అక్కడే వదిలేసి ఇక పై లోకాలలో స్థిరపడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళతో ‘ఇక్కడ ఏం చెయ్యాలి?’ అని సదస్సులు నిర్వహిస్తూ ఉంటాయి.

“పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ధ్యానం మరి అహింసలో జీవించి పూర్ణత్వాన్ని సిద్ధించుకున్న గొప్ప గొప్ప ఆత్మలు! ప్రతి ఒక్కరినీ ధ్యానులుగా శాకాహారులుగా మార్చడానికి ఈ భూమి మీదకి స్వంత ఇచ్ఛతో వచ్చిన వారు. ఇక్కడి ప్రతి క్షణాన్నీ, ప్రతి సందర్భాన్నీ .. మరి ప్రతి సంతోషాన్నీ .. పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు!!”