ఆనాపానసతి

 

గౌతమబుద్ధుడు 2500 సం|| క్రితం ఉపయోగించిన పదం “ఆనాపానసతి”
“అన” అంటే “ఉచ్ఛ్వాస”
“అపాన” అంటే “నిశ్వాస”
“సతి” అంటే “కూడుకుని వుండడం”
“ఆనాపానసతి” అంటే  శ్వాస మీద ధ్యాస”
“శ్వాస మీద ధ్యాస” అంటే “మన శ్వాసతో మనం కూడుకుని వుండడం”
“ఎన్నో ధ్యాన పద్ధతులు వున్నా వాటన్నిటిలో ఒక్కటే ‘ సరి అయిన ధ్యాన పద్ధతి ‘
మరి అదే ‘ఆనాపానసతి’” .. అన్నాడు బుద్ధుడు
సృష్టిలో ఒకానొక ప్రధాన మూల సిద్ధాంతం
“ప్రకృతి ఎప్పుడూ సహజంగా వుంటుంది .. అది ఎప్పుడూ సులభరీతిలో వుంటుంది”
“ఏదైతే ప్రకృతి సహజంగా వుంటుందో, సులభరీతిగా వుంటుందో .. అదే సత్యమైనది కూడా”
‘సహజత’, ‘సత్యత’, ‘సులభత’ .. ఈ మూడు కూడా పర్యాయపదాలు
ఒకటి వుంటే మిగతా రెండూ వుంటాయి అక్కడ
“హఠయోగ ప్రాణాయామం” అన్నది కఠోరమైనది మరి అసహజమైనది
కనుక అది సత్యానికి సుదూరమైనది
“సుఖమయప్రాణాయామం” అన్నది కుంభక .. పూరక .. రేచక రహితం
” కుంభకం ” అంటే ” బలవంతంగా శ్వాసను బిగపట్టడం”
“పూరకం” అంటే “బలవంతంగా శ్వాసను పీల్చడం”
“రేచకం” అంటే “బలవంతంగా శ్వాసను నెట్టేయడం”
“ఆనాపానసతి” అంటే “సుఖమయప్రాణాయామం”
“సుఖమయప్రాణాయామం” అన్నది సహజమైనది
కనుక అది సత్యానికి అత్యంత చేరువ అయివున్నది
ధ్యానవిజ్ఞానశాస్త్రంలో మూడు విషయాలు ఉన్నాయి :
* ఆనాపానసతి * కాయానుపస్సన * విపస్సన
” ఆనాపానసతి ” అభ్యాసంలో భౌతికకాయం ఉడుకుతుంది
అనేకానేక ప్రాణశక్తిసంచారాలు మన ప్రాణమయశరీరంలో జరగడం మనం గమనిస్తాం
ఎక్కడెక్కడో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు మనం గమనిస్తూ వుంటాం
దీనిని  కాయానుపస్సన” అంటాం
“కాయానుపస్సన” లో విశేషంగా నాడీమండలశుద్ధి జరుగుతుంది
అయితే ఇంకా ధ్యానాన్ని పొడిగించాలి
“నాడీమండలకాయం” లో సుమారు రెండు లక్షల 72 వేల నాడులు వుంటాయి
“నాడి” అంటే ఓ “ఎనర్జీ ఛానెల్ “
నాడులన్నీ పరిశుద్ధం అవుతూన్నప్పుడు వచ్చే నొప్పులనూ, బాధలనూ,
గమనించడాన్నే “కాయానుపస్సన” అంటాం
“ఆనాపానసతి” అన్నదానిని చేస్తూంటే, చేస్తూంటే
అపారమైన విశ్వమయప్రాణశక్తి ..
మన లోపల ప్రవహించడం ప్రారంభం అవుతుంది
అ విశ్వమయప్రాణశక్తి ..
అనేకానేక పాపకర్మల ద్వారా మలినమైన నాడులను ప్రక్షాళన గావిస్తూ వుంటే
ప్రక్షాళనా రీతులను గమనించడం అన్నదే “కాయానుప్పసన”
“కాయానుపస్సన” లో వచ్చే తప్పనిసరి బాధలను
ధ్యానాభ్యాసంలో మరింత లోతుకు వెళ్తేనే అధిగమించగలం
“ఆనాపానసతి అభ్యాసం” అంటే
హాయిగా కూర్చుని .. కాళ్ళు, చేతులు కట్టేసుకుని .. కళ్ళు రెండూ మూసేసుకుని
మన ఆలోచనలను ఎప్పటికప్పుడు ‘కట్’ చేసుకుంటూ “శ్వాస మీద ధ్యాస” వుంచాలి
నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే “భ్రూమధ్యం” అదే “నాసికాగ్రం”
“నాసికాగ్రం” అంటే “ముక్కు కొన” కాదు
అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి
“నాసికాగ్రం” లో అంటే “భ్రూమధ్యం” లో
అంటే “అజ్ఞాచక్రస్థానం” లో .. అంటే “సుదర్శన చక్రస్థానం” లో
తనంతట తాను సుఖంగా స్థితం అయిపోతుంది
ఆ స్థితిలో మనం తన్మయమైవుంటే “మూడవకన్ను” యొక్క విస్ఫోటనం మొదలవుతుంది
“మూడవ కన్ను” విస్ఫోటాన్ని గమనించడాన్నే “విపస్సన” అంటాం
“పశ్యతి” అంటే సంస్కృతంలో “చూడడం”
“ఆనాపానసతి” అన్నదే ఒకానొక “పశువు” ను ఒకానొక “పశుపతి” గా పరిమారుస్తుంది
“పతి” అంటే “యజమాని”
తన జంతుతత్వానికి ఆధీనుడు అయినవాడు ఒకానొక ” పశువు”
తన జంతుతత్వాన్ని అధిపత్యంలో తీసుకున్నవాడు ఒకానొక “పశుపతి”
ఆనాపానసతి .. అన్నది సర్వరోగనివారిణి
ఆనాపానసతి .. అన్నది సర్వభోగకారిణి
ఆనాపానసతి .. అన్నది సత్యజ్ఞానప్రసాదిని