“అహింసలో జీవించినప్పుడే .. ముక్తి, మోక్షం”

   

“మనం అంతా కూడా భౌతిక శరీరంతో విలసిల్లుతోన్న సాక్షాత్తు భగవంతులం” అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత!

భూలోకంలో, భువర్లోకంలో, సువర్లోకంలో, జనాలోకంలో, తపోలోకంలో, మహాలోకంలో, బ్రహ్మలోకంలో లేదా సత్యలోకంలో .. ఇలా ఏ లోకంలో ఉన్నా సరే .. మనం అంతా కూడా మణుల్లా ప్రకాశిస్తోన్న భగవంతుళ్ళమే!

ధ్యానం చేస్తేనే మనకు “ఇదంతా భగవంతుళ్ళ రాజ్యం” అనీ .. “మనమంతా భగవంతుళ్ళం” అనీ .. “మనచుట్టూ ఉన్న మనుష్యులూ .. సకల జీవరాశి అంతా కూడా భగవంతుళ్ళే” అనీ తెలుస్తుంది! ధ్యానంలో ‘మనస్సు’ అనే అడ్డును తొలగించుకోవడం ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుని ఆత్మ స్వయంప్రకాశకులయిన భగవంతుళ్ళుగా వెలుగుతాం!

“యోగః శ్చిత్త వృత్తి నిరోధః” అన్నారు పతంజలి మహర్షి! చాలామంది రకరకాల శారీరక విన్యాసాలు చేస్తూ శీర్షాసనాలు వేస్తూ అదే ‘యోగా’ అనుకుంటారు. నిజానికి ఒక్క మనిషి మాత్రమే ఇలాంటి చిత్ర విచిత్రాలు చేస్తూంటాడు. ఏ జంతువూ ‘యోగా’ చెయ్యదు మరి జబ్బుతో అది ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కూ వెళ్ళదు! అసలు జంతువులే నిజమైన భగవంతుళ్ళలా జీవిస్తున్నాయి.

ఇదంతా కూడా “భగవంతుళ్ళు” అనే వారి గురించి వేదాలు తెలియజేసిన శాస్త్రీయమైన సమాచారం అయితే మరి హాయిగా ఆనందంగా భగవంతుళ్ళలా జీవిస్తూన్న చేపలనూ, కుందేళ్ళనూ భగవంతుళ్ళం అయిన మనం క్రూరంగా చంపి ‘ఫ్రై’ చేసుకుని తినవచ్చా? ఒక భగవంతుడు ఇంకొక భగవంతుడిని పట్టి చంపి తినడం ఎంతటి అధర్మం!

ఇలా ఇతర భగవంతుళ్ళను చంపి తింటూ “గుళ్ళూ, గోపురాలు” తిరిగి .. తీర్ధయాత్రలు చేస్తే ముక్తి వస్తుందా? అహింసలో జీవించనప్పుడే మనకు ముక్తి, మోక్షం అన్నీ వస్తాయి. జీవితానికి భక్తి, సంగీతం, నాట్యం, డబ్బు, బంగారం, ఆస్తి అన్నీ కూడా ఐచ్ఛికాలు కానీ .. అహింస అన్నది మాత్రం తప్పనిసరి! ఇది సృష్టి నియమం. ఐచ్ఛికాలు మనకు తాత్కాలిక ఆనందాలను ఇస్తే ఒక్క అహింస మాత్రం మనకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

మోక్షాన్ని పొందినప్పుడే మనం ఈ జననమరణ చక్రం నుంచి బయట పడగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్క భగవంతుడు కూడా హింసలోంచి అహింసలోకి రావాలి. బంధంలోంచి మోక్షంలోకి గమనం చెయ్యాలి! అదే జీవిత పరమావధిగా జీవించాలి.

పూర్ణులైన భగవంతుళ్ళుగా ఈ భూమి మీద పుట్టిన మనం .. పూర్ణులు గానే జీవించి .. పూర్ణులు గానే ఇక్కడి నుంచి నిష్క్రమించాలి. అదే ఆత్మజ్ఞానయుత జీవన విధివిధానం .. మరి ప్రతి ఒక్కరూ అలాంటి జీవితాన్నే జీవించాలి!