భగవద్గీత 15-10

“ ఉత్ర్కామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ |

విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః || ”

 

పదచ్ఛేదం

ఉత్ర్కామంతం – స్థితం – వా – అపి – భుంజానం – వా – గుణాన్వితం – విమూఢాః – న – అనుపశ్యంతి – పశ్యంతి – జ్ఞానచక్షుషః

ప్రతిపదార్థం

ఉత్ర్కామంతం = జీవుడు శరీరాన్ని వదలుతున్నప్పుడు ; వా = లేక ; స్థితమ్ = శరీరంలో వున్నప్పుడు ; వా = లేక ; భుంజానం = భోగాలను అనుభవిస్తున్నప్పుడు ; గుణాన్వితం, అపి = అలాగే త్రిగుణాలతో కూడి వున్నప్పుడు ; విమూఢాః = అజ్ఞానులు ; న, అనుపశ్యంతి = తెలుసుకోలేరు ; జ్ఞానచక్షుషః = కేవలం జ్ఞానులే తమ జ్ఞాన నేత్రాల ద్వారా ; పశ్యంతి = సత్య స్వరూపాన్ని తెలుసుకుంటారు

తాత్పర్యం

“ జీవాత్మ దేహంలో గుణాలను కలిగి వున్నప్పుడు, విషయాలను అనుభవించేటప్పుడూ, శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడూ జ్ఞానచక్షువు కలిగిన జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. అంతేకాని అజ్ఞానులు ఈ విషయాలను తెలుసుకోలేరు. ”

వివరణ

భౌతిక శరీరంలో నివశిస్తున్న జీవాత్మ,

తన పూర్వజన్మల సంస్కారాలకు అనుగుణంగా గుణాలను కలిగి వుంటుంది.

బాహ్య ఇంద్రియాలతో గ్రహించిన విషయాలను

తన గుణాలకు అనుగుణంగా అనుభవిస్తూ ఉంటుంది.

మరణం ఆసన్నమైనప్పుడు, తనలోని సంస్కారాలను … వాసనలను తీసుకుని

స్థూలశరీరాన్ని విడిచి, సూక్ష్మశరీరంగా వెళ్ళిపోతుంది. నిష్క్రమిస్తుంది.

ఇటువంటి నిగూఢ సత్యాలను …

జీవాత్మ ఈ శరీరంలో గుణాలతో కలసివున్నప్పుడు గానీ …

విషయాలను అనుభవించేటప్పుడు గానీ …

చివరికి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు గానీ

ఆయా యదార్థాలను … అజ్ఞానులు ఎంతమాత్రం తెలుసుకోలేరు.

కేవలం “ జ్ఞానం అనే నేత్రం ” కలిగిన జ్ఞానులు మాత్రమే

జీవాత్మ స్థితులను యదార్థంగా, వున్నది వున్నట్లుగా గ్రహించగలుగుతారు.

ఈ “ జ్ఞాన నేత్రం, ” “ దివ్య చక్షువు ” అన్నది …

కేవలం ధ్యానసాధన ద్వారానే సిద్ధిస్తుంది.