భగవద్గీత 13-2

“ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః || ”

పదచ్ఛేదం

ఇదం – శరీరం – కౌంతేయ – క్షేత్రం – ఇతి – అభిధీయతే – ఏతత్ – యః – వేత్తి – తం – ప్రాహుః – క్షేత్రజ్ఞః – ఇతి – తద్విదః

ప్రతిపదార్థం

కౌంతేయ = కుంతీకుమారా ; ఇదం, శరీరం = ఈ శరీరం ; క్షేత్రం, ఇతి = ‘క్షేత్రం’ అని ; అభిధీయతే = పిలువబడుతుంది ; ఏతత్ = దీనిని గురించి ; యః , వేత్తి = ఎవరు తెలుసుకుంటారో ; తం = అతనిని ; క్షేత్రజ్ఞః , ఇతి = ‘క్షేత్రజ్ఞుడు‘ అని ;

తద్విదః = తత్త్వజ్ఞానులు ; ప్రాహుః = అంటారు

తాత్పర్యం

“ ఓ కుంతీపుత్రుడా, క్షేత్ర క్షేత్రజ్ఞులను గురించి తెలిసినవారు ఈ శరీరమే క్షేత్రం అనీ, దీనిలో వ్యవహరిస్తూ వుండేవాడు క్షేత్రజ్ఞుడు అనీ చెపుతారు. ”

వివరణ

“ క్షేత్రం ” అంటే శరీరం

జడమైన శరీరాన్ని నడిపే చైతన్య శక్తి ఏదైతే వుందో …

అదే “ క్షేత్రజ్ఞుడు ” … ఆత్మ.

జీవుడు నిజానికి క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాడు.

“ దేహం ” వేరే … “ దేహి ” వేరే.

దేహం ‘ క్షేత్రం ’ … దేహి ‘ క్షేత్రజ్ఞుడు ’

“ క్షేత్రం ” అంటే “ పొలం ” అని కూడా అర్థం.

పొలంలో నాటిన విత్తనాలు తగిన సమయంలో …

పంట రూపంలో మొలకెత్తుతాయి.

అలాగే జీవుడి యొక్క కర్మలు కూడా సమయం వచ్చినప్పుడు …

ఈ శరీరం అనే క్షేత్రంతోనే అనుభవిస్తూంటాడు.

శరీరం ఉత్పత్తి, నాశనాలను కలిగి వుంటుంది.

కానీ “ క్షేత్రజ్ఞుడు ” మాత్రం ఉత్పత్తి, నాశనాలు లేని నిత్యుడు …

“ క్షేత్ర, క్షేత్రజ్ఞ జ్ఞానం కలిగినవాడు ” అంటే …

“ వివేకం కలిగినవాడు ” అని అర్థం

“ నిత్య, అనిత్య వివక్ష ఉన్నవాడు ” అని అర్థం.