భగవద్గీత 10-20

“ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |

అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ || ”

 

పదచ్ఛేదం

అహం – ఆత్మా – గుడాకేశ – సర్వభూతాశయస్థితః – అహం – ఆదిః – చ – మధ్యం – చ – భూతానం – అంతః – ఏవ – చ

ప్రతిపదార్థం

గుడాకేశ = నిద్రను జయించినవాడా ; సర్వభూతాశయ స్థితః = సమస్త ప్రాణులలో ఉన్న ; ఆత్మా = ఆత్మను ; అహం = నేను ; చ = మరి ; భూతానాం = సకల ప్రాణులకు ; ఆదిః = మొదలు ; మధ్యం = మధ్య ; చ = ఇంకా ; అంతః చ = మరి అంతమునూ (ప్రాణుల సృష్టిస్థితిలయల కారణం) ; అహం ఏవ(అస్మి) = నేనే

తాత్పర్యం

“ అర్జునా ! సమస్త ప్రాణులలో వుండే ఆత్మను నేనే ! సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు మూడూ కూడా నేనే ! ”

వివరణ

నిద్రను జయించినవాడు అర్జునుడు.

ఇంద్రియాలను జయించినవారు అతి కొద్దిమంది ఉంటారు.

అటువంటి వారు “ పాండవులు ”.

ఇంద్రియాలకు లోబడినవారు కోకొల్లలు.

అటువంటి వారు “ కౌరవులు ”.

ఇంద్రియాలు జయించినవారికే ఆత్మతత్త్వం అర్థమవుతుంది గానీ …

ఇంద్రియాలకు లోబడినవారికీ,

ఇంద్రియాలలో మునిగి కొట్టుకుపోయే వారికీ …

ఆత్మతత్త్వంఎంతమాత్రంమింగుడుపడదు

ఓ “ కృష్ణుడు ”, “ ఓ వేదవ్యాసుడు ” .. పాండువులవంటి వారికే అవసరం ;

నేర్చుకునే తత్త్వంలేని వారు కౌరవులు …

వాళ్ళకు ప్రాపంచిక రాజ్యాలే కావాలి …

వాళ్ళకు ఆత్మ యొక్క సిద్ధత్వంతో పనిలేదు.

ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధించబడుతుంది.

అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు.

ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో ఒకానొక పరిస్థితిలో మాత్రమే ఉన్నది “ దేహం ”.

కానీ సర్వ దేశాలలో, సర్వ కాలాలలో సర్వ పరిస్థితులలో …

సర్వత్రా వ్యాపించి ఉన్నది “ ఆత్మ ”

“ ఆత్మ ” అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ వుండేది …

భౌతిక సృష్టి యొక్క మధ్యలోనూ వుండేది ..

మరి భౌతిక సృష్టి యొక్క అంతంలోనూ ఉండేది.

భౌతికమైన సృష్టి అంతం కావచ్చు … “ ఆత్మపదార్ధం ” మట్టుకు అంతం కాదు

“ ఆత్మ ” ఒకానొక భౌతికమైన సృష్టిలోంచి

మరొక భౌతికమైన సృష్టిలోకి వెళ్ళి ఉంటూ వుంటుంది ..

ఇలా తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం.