భగవద్గీత 8-10

“ ప్రయాణకాలే మనసాஉచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ || ”

 

పదచ్ఛేదం

ప్రయాణకాలే – మనసా – అచలేన – భక్త్యా – యుక్తః – యోగబలేన – చ – ఏవ – భ్రువోః – మధ్యే – ప్రాణం – ఆవేశ్య – సమ్యక్ – సః – తం – పరం – పురుషం – ఉపైతి – దివ్యం

ప్రతిపదార్థం

సః = అటువంటి ; భక్త్యా, యుక్తః = భక్తి గలవాడు ; ప్రయాణకాలే = అంత్యకాలంలో ; యోగబలేన = యోగబలంతోటి ; భ్రువోః, మధ్యే = భ్రూమధ్య ప్రదేశంలో ; ప్రాణం = ప్రాణాన్ని ; సమ్యక్ = చక్కగా ; ఆవేశ్య = నిలిపి ; చ = మరి ; అచలేన = నిశ్చలమైన ; మనసా = మనస్సుతో ; తమ్ = ఆ ; దివ్యం = దివ్యమైన ; పరం, పురుషం, ఏవ = పరమాత్మనే ; ఉపైతి = పొందుతాడు

తాత్పర్యం

“ అంత్యకాలంలో ఎవరు చలించని మనస్సుతో, యోగబలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు. ”

వివరణ

ఇంద్రియాలకు రాజు మనస్సు.

ఇంద్రియాలు బాహ్య విషయ గ్రహణ చేసి మనస్సుకు అందజేస్తాయి.

మనస్సు ఆ విషయ లాలసతల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది.

సుఖంగా కూర్చుని, కళ్ళు మూసుకుని, ధ్యాసను అంతా శ్వాసపై లగ్నం చేస్తూంటే …

ఇంద్రియ ద్వారాలు మూయబడి …

మనస్సు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది.

ఈ విధంగా నిరంతర ధ్యానసాధన చేసేవాడు …

“ అవసానకాలం ” అంటే  “ శరీరాన్ని త్యాగం చేసే సమయం ”

సమీపించినప్పుడు కూడా … చలించని మనస్సుతో, యోగబలంతో …

ప్రాణాలను భ్రూమధ్యంలో గానీ … సహస్రారంలో గానీ నిలిపి …

ఆత్మధ్యానం చేస్తూ …

దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమాత్మప్రాప్తినే పొందుతాడు.