భగవద్గీత 7-3

“ మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || ”

 

పదచ్ఛేదం

మనుష్యాణాం – సహస్రేషు – కశ్చిత్ – యతతి – సిద్ధయే – యతతాం – అపి – సిద్ధానాం – కశ్చిత్ – మాం – వేత్తి – తత్వతః

ప్రతిపదార్థం

మనుష్యాణాం, సహస్రేషు = వేలాదిమంది మనుష్యులలో ; కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే ; సిద్ధయే = ఆత్మానుభవత్ప్రా‌ప్తికై ; యతతి = ప్రయత్నిస్తాడు ; యతతామ్ సిద్ధానామ్, అపి = ఆ విధంగా ప్రయత్నించిన యోగులలో కూడా ; కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే ; “ మామ్ ” = “ తనను తాను ” ; తత్వతః = యథార్థంగా ; వేత్తి = తెలుసుకుంటాడు

తాత్పర్యం

“ వేలాదిమందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మమోక్షానికి ప్రయత్నిస్తున్నాడు ; అటువంటి వేలాదిమంది యతులలో యే ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. ”

వివరణ

కోట్ల కొద్దీ ఉన్న మనుష్యులలో కొంతమంది మాత్రమే

 “ నాకు సత్యం కావాలి ” … “ నాకు సిద్ధి కావాలి ” … అని ప్రయత్నిస్తారు.

మిగతావాళ్ళకు “ సత్యం ” అవసరం లేదు … “ సిద్ధి ” అక్కరలేదు.

మానవుల మానసిక పరిణతి, గుణగణాలు, వారి ఆత్మస్థాయికి అనుగుణంగా …

వివిధ స్థాయిలలో వుంటుంది.

జన్మపరంపర ప్రారంభంలో … భూలోకయాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ

“ శిశువు ”తో సమానమైన “ శైశవాత్మ ” స్థితిలో వుంటుంది.

“ బాల్య ” ఆత్మ స్థాయి నుండి “ యవ్వనాత్మ ” స్థాయికి …“ ప్రౌఢ ఆత్మ ” స్థాయికీ …

ప్రతి స్థాయిలోనూ కొన్ని కొన్ని జన్మలు తీసుకుంటూ …

జీవించే విధానాన్ని నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ …

పరిణతి చెందిన “ వృద్ధాత్మ ” గా రూపుదిద్దుకుంటుంది.

అప్పుడే త్రికరణశుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది.

తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా … వేలాదిమందిలో కొంతమంది

మాత్రం తమకు తాము నిజతత్వం తెలుసుకుంటారు.

ఏమిటి ఆ నిజతత్వం?? … “ నేను సర్వకాల సర్వపరిస్థితులలోనూ సర్వత్రా

వ్యాపించి ఉన్న ఆత్మను ! … ఆదిలోనూ … మధ్యలోనూ … అంతంలోనూ కూడా నేనున్నాను ” … ఇదే ఆత్మ యొక్క నిజతత్వం.