భగవద్గీత 6-5

“ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |     

ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః || ”

పదచ్ఛేదం

ఉద్ధరేత్ – ఆత్మనా – ఆత్మానం – న – ఆత్మానం – అవసాదయేత్ – ఆత్మా – ఏవ – హి – ఆత్మనః – బంధుః – ఆత్మా – ఏవ – రిపుః – ఆత్మనః

ప్రతిపదార్థం

ఆత్మనా = తనచేత ; ఆత్మానం = తనను ; ఉద్ధరేత్ = ఉద్ధరించుకోవాలి ; ఆత్మానం = తనను ; న అవసాదయేత్ = అధోగతి కానీయరాదు ; హి = ఎందుకంటే ; ఆత్మా ఏవ = తానే ; ఆత్మనః = తనకు ; బంధుః = బంధువు ; ఆత్మా ఏవ = తానే ; ఆత్మనః = తనకు ; రిపుః = శత్రువు.

తాత్పర్యం

“ ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలే గానీ ఆత్మపతనం చేసుకోకూడదు ; ఆత్మకు ఆత్మయే బంధువు … ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి వుంది. ”

వివరణ

ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి …

ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు.

ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు …

ఎవరికి నిద్రవస్తే వారే నిద్రపోవాలి …

ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి …

ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి.

ఒకరు చక్కగా ధ్యానసాధన చేసి యోగియై

ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పతనం వాళ్ళదే …

ఒకరి గొప్పతనం ఇంకొకరిది ఎప్పటికీ కాజాలదు.

మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి …

మన కర్మలను మనమే సరిచేసుకుంటూ వుండాలి.

ధ్యానంలో నిమగ్నమై ధ్యానకర్మ చేసుకుంటూ వుండాలి.

తద్ద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ వుంటుంది.

అప్పుడు … ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది !

అలా కాకుండా సమయాన్ని వృథా చేస్తున్నామంటే …

మన ఆత్మను మనమే అవసానదశకు తీసుకువెళ్తున్నట్టు …

అలాంటప్పుడు మనకు మనమే శతృవుగా అవుతాం.

ఏ లోకంలో వున్నా, ఏ కాలంలో వున్నా,

మన వాస్తవాలకు మనమే సదా సృష్టికర్తలం.

 “ కృతయుగం ” లో వున్నా, “ కలియుగం ”లో వున్నా …

“ భూలోకం ” లో వున్నా, “ సత్యలోకం ” లో వున్నా …

“ శైశవాత్మదశ ”లో వున్నా, “ వృద్ధాత్మదశ ” లో వున్నా …

“ జ్ఞాని ”గా వున్నా, “ అజ్ఞాని ”గా వున్నా …

“ పండితుడు ”గా వున్నా, “ పామరుడు ”గా వున్నా …

మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం.

మన నోటిలోని మాటే మన నుదుటి మీద వ్రాత !

మన భావాలే మన భవాలుగా నిరంతరం పరిణామం చెందుతూ వుంటాయి !

మన ఆలోచనలతోనే,

మన మాటలతోనే,

మన చేతలతోనే,

మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము …

లేదా దిగజార్చుకుంటున్నాం.

ప్రతి క్షణాన్నీ పిండుకోవాలి …

సద్వినియోగం చేసుకోవాలి …

“ శ్వాసాభ్యాసం ” చేస్తూ తపస్సులో ఉండాలి.

“ స్వాధ్యాయం ” చేస్తూ ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉందో …

అంత జ్ఞానాన్నీ సమీకరించుకోవాలి.

అందరిలో దైవాన్ని చూస్తూ, అందరినీ సమానంగా గౌరవిస్తూ,

ప్రేమిస్తూ … “ ఈశ్వరప్రణిధానం ”లో ఉండాలి.

ఉత్తములైనవారు అమూల్యమైన కాలాన్ని ఎప్పుడూ వృథాచేయరు …

సద్వినియోగం చేసుకుంటారు.

అందరిచేతా కాలాన్ని సద్వినియోగం చేయించేవాళ్ళు ఉత్తమోత్తములు …

మరి పురుషోత్తములు !