భగవద్గీత 5-27

“ స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః |

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ || ”

పదచ్ఛేదం

స్పర్శాన్ – కృత్వా – బహిః – బాహ్యాన్ – చక్షుః – చ – ఏవ – అంతరే – భ్రువోః – ప్రాణాపానౌ – సమౌ – కృత్వా – నాసాభ్యంతరచారిణౌ

ప్రతిపదార్థం

బాహ్యాన్, స్పర్శాన్ = బాహ్య విషయ భోగాలను ; బహిః ఏవ , కృత్వా = బయటికి పారద్రోలి ; చ = మరి ; చక్షుః = దృష్టిని ; భ్రువోః, అంతరే = భ్రూమధ్యంలో (నిలిపి); నాసాభ్యంతర చారిణౌ = నాసికారంధ్రాలలో సంచరిస్తున్న ; ప్రాణాపానౌ = ప్రాణ అపాన వాయువులను ; సమౌ, కృత్వా = సమంగా చేసి.

తాత్పర్యం

“ శబ్దస్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేసి, ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, నాసికారంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణ, అపాన వాయువులను సమానంగా చూడాలి. ”

వివరణ

నది ఒడ్డున ఉంటే నదిలోని కెరటాలు మనల్ని ఏమీ చెయ్యలేవు.

కానీ … నదిలోకి దిగితే అవి మనల్ని ముంచెత్తుతాయి !

అలాగేశబ్దస్పర్శాదిపంచేంద్రియవిషయాలతో

మనస్సు తాదాత్మ్యం చెందితేనే…

అవి మనల్ని కలత పరుస్తాయి.

బాహ్యప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటకే

పంపించేసెయ్యాలి … అంతరప్రపంచంలోకి రానీయకూడదు.

అటూ ఇటూ దిక్కులు చూస్తే … మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది.

కనుక కళ్ళు రెండూ మూసుకోవాలి ;

తరువాత “ నాసికాగ్రం ” మీద దృష్టిని నిలపాలి.

“ నాసికాగ్రం ” అంటే రెండు కనుబొమ్మల మధ్య గల “భ్రూమధ్యం ” …

అంతేకానీ ముక్కుపుటాల దగ్గరి చివరి భాగం కాదు !

‘ దృష్టి ’ని … అంటే ‘ అంతరదృష్టి ’ని … ధ్యాసను … భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి.

అందుకోసం ముందు ఉచ్ఛ్వాస లో … ముక్కు లోపలికి వచ్చే ప్రాణవాయువు.

ఇంకా నిశ్వాసలో … బయటకు విసర్జించబడే అపానవాయువు …

యొక్క చలనాలను నాసికలో సమానంగా గమనిస్తూ ఉండాలి.

అంటే … నిరంతరంగా మనలో కొనసాగే శ్వాసక్రియను గమనిస్తూ ఉండాలి.

అలా చేస్తూ చేస్తూ ఉంటే … శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ …

స్వయంగా “ భ్రూమధ్యం ” లోకి చేరుకుంటుంది.

తద్ద్వారా మనస్సు నెమ్మది నెమ్మదిగా ప్రశాంత స్థితికి …

పరంపరగా శూన్యస్థితికి …

అత్యంత సహజంగానే చేరుకుంటుంది.

శ్వాస తనంతట తాను భ్రూమధ్యంలోకి చేరే విధానమే  “ ఆనాపానసతి ”.